Minister Vasamsetti Subhash: అమరావతి క్రాంతదర్శి చంద్రన్న
ABN, Publish Date - May 06 , 2025 | 02:40 AM
అమరావతి నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకోటానికి ఇప్పుడు పునరావిష్కరణ చర్యలు వేగంగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు దార్శనికతతో ఈ నగరాన్ని ప్రపంచస్థాయి సౌకర్యాలతో, ఆధునిక సాంకేతికతతో నిర్మించాలని లక్ష్యంగా ఉంది.
నవ్యాంధ్రకు నవశకం ఆరంభమైంది. ఆరు కోట్ల ఆంధ్రుల కలలు సాకారమైనవేళ అమరావతికి మంచి రోజులు వచ్చాయి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతే నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా మారబోతుంది. ఆ మలుపునకు కారణం కూడా తానే అయి నిలిచిన క్రాంతదర్శి నారా చంద్రబాబు నాయుడు.
2019–24 మధ్యకాలంలో విధ్వంస పాలకుల చేతిలో శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునర్జీవం దిశగా పనులకు అడుగులు పడిన వేళ ఆంధ్రప్రదేశ్ అంతటా పండుగ వాతావరణంతో నిండిపోయింది. తరతరాలకు ఆదర్శంగా అమరావతి నిలవబోతున్నది. రాజధాని లేని రాష్ట్రంగా విభజిత ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరెన్నో రాజకీయ కుట్రలను తట్టుకుంటూ చివరికి నేడు స్థిరమైన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పట్టాభిషేకం అందుకుంది.
రాజధాని పునర్నిర్మాణం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయింది. ఓ వేడుకలా సాగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా చూశారు. మన రాజధాని అనే భావనతో ఒక్కసారే యాభై వేల కోట్ల రూపాయల పనులను మోదీ ప్రారంభించడంతో ఈసారి ఆలస్యం కాదన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
అమరావతి రాజధానికి ఎప్పుడో పునాదులు పడ్డాయి. వాటిని తవ్వేసే పాలకులు తర్వాత అధికారంలోకి రావడంతో అవి పాడుబడిపోయాయి. అయితే అంతకుముందు పడిన ఆ పునాదులు చెక్కుచెదరలేదు. అది భౌతికంగానే కాదు.. ప్రజల మనసుల్లో కూడా. అందుకే ఈసారి అమరావతి నిర్మాణం పునాదుల మీద నుంచి చకచకా జరిగిపోతుంది. టార్గెట్ ప్రకారం నిర్మాణాలు చేయించడంలో ముఖ్య మంత్రి చంద్రబాబుకు ప్రత్యేక అనుభవం ఉంది. అందుకే ఏడాది, రెండేళ్లలోనే అమరావతి నిర్మాణంలో స్పష్టమైన మార్పు కనిపించనుంది. నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌గా సాగేలా చర్యలు చేపడుతున్నారు.
అమరావతికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయినా అంతిమంగా మాత్రం అడుగు బలంగా పడబోతోంది. మొదటి అడుగుతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి, అనుపానులు కళ్లముందు కనిపించడానికి మరో మూడేళ్లు పట్టవచ్చు. కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా అమరావతి డైనమిక్‌గా ఉండబోతుంది. ప్రతి తెలుగువాడు మాకు అమరావతి గొప్ప రాజధాని ఉందని గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచస్థాయిలో దీనిని నిర్మించాలని సీఎం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రపంచంలో టాప్–5 నగరాల్లో ఒకటిగా ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. చక్కటి జనావాసాలతో, విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజారవాణా, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్ధాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికి తొమ్మిది థీమ్ సిటీలను, 27 టౌన్‌షిప్‌లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. కృష్ణా నదీ తీరాన 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647 ఎకరాలలో రూపుదిద్దుకొనున్న అమరావతి రాజధానికి నవనగరాలు నవ నాగరికంగా నిలవనున్నాయి.
అమరావతికి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీలు క్యూ కట్టనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కోసం మూడు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది. అమరావతిలో భూములు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలతో ఆ ప్రాంతం బిజీగా మారనుంది. ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఈ కళ రాష్ట్రం మొత్తం కనిపించనుంది.
ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేశంలోనే తొలి అత్యాధునిక, సాంకేతిక నగరం కాబోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అలరారే అరుదైన రాజధానులు– టోక్యో, రోమ్, లండన్, బెర్లిన్, మాస్కో, వాషింగ్టన్, ఒట్టావాలకు అమరావతి దీటుగా నిలవనున్నది. కానీ, ఆ రాజధానులు వేటికీ లేని విశిష్టత ఉన్న మహోజ్వల నగరం ఇది. అమరావతి అభివృద్ధి కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఆత్మగౌరవానికి, ప్రజల భవిష్యత్‌కు నిలకడగా నిలబడే మార్గం. గతంలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్థాయిని మించి అమరావతిని తీర్చిదిద్దే శక్తి చంద్రబాబుకే ఉంది. హైదరాబాద్ లాంటి విస్తృతావకాశాలు గల ఒక నగరం ఆంధ్రకు లేని లోటుని తీర్చడానికి ఉద్దేశించిన అమరావతి... చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఒక సజీవరూపంగా నిలిచిపోతుంది. చంద్రబాబు చేస్తున్న ఈ మహోపకారానికి ప్రజలందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారనడంలో సందేహం లేదు. ప్రపంచంలోని ప్రసిద్ధ తొలి రాజధానుల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలు ఫలించాలని ఆశిద్దాం.
- వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి
Updated Date - May 06 , 2025 | 02:42 AM