Infrastructure Development: నవభావవతి అమరావతి
ABN, Publish Date - May 02 , 2025 | 06:36 AM
మహాకవులు సార్వకాలీన సంస్కారాలతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, తమ సమాజాన్ని ధీశక్తితో, లక్ష్యాలతో ముందుకు నడిపిస్తారు. అమరావతి, భారత రాజధానిగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారేందుకు మరిన్ని సంకల్పాలు మరియు సవాళ్లు ఎదురవుతున్నాయి.
మహాకవులు జన సంక్షేమం కోసం సార్వకాలీన సంస్కారాలు ప్రబోధిస్తారు. సంఘర్షణలను ఎదుర్కొనే ధీశక్తి నిస్తారు. భావి లక్ష్యాలను నిర్దేశిస్తారు. మహాసంకల్పాలకు సంసిద్ధులను చేస్తారు. కాలం ఏదైనా అటువంటి సంస్కారాలు, ధీశక్తులు, లక్ష్యాలు, మహాసంకల్పాల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వాటిని పసిగట్టి, అవాహన చేసుకుని, మమేకమై ప్రజలు ముందుకు నడిచినప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యం పరిపక్వతను పొందుతుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. అద్భుతాల సృష్టికి కేంద్రం అవుతుంది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యే నేటి శుభవేళ జనావళి అటువంటి పరిపక్వత దిశగా అడుగులేస్తేనే ఆంధ్ర ప్రగతిరథం పరుగులు పెడుతుంది. అమరావతి ఒక రాజధాని నగరం మాత్రమే కాదు.. అదొక భావన.. జాతి పునర్నిర్మాణ పరికల్పన.. నవ నిర్మాణానికి ప్రేరణ.. రూపుకట్టే భవితను తలచుకుని పొంగుకొచ్చే అనుభూతి.. సమష్టి శ్రేయోసాధనకు ఆలంబన.. అంటూ ఎన్నో విశేషణాలతో ఆంధ్ర ఆలోచనాపరులు తాదాత్మ్యం చెందొచ్చు. ఇవన్నీ సాధారణ జనబాహుళ్యంలో ఎంత త్వరగా ఉదయిస్తే అంత త్వరగా అమరావతి ఆంధ్రావళికి జయగీతి అవుతుంది. అద్భుతమైన వాస్తుకళ ఉట్టిపడే ఆకాశ భవనాలు కట్టుకుంటే సరిపోదు. సంపద సృష్టికి, మేధో ఉత్కృష్టతకు కొత్త భావాలకు వేదికగా అమరావతి వెలుగొందాలి. మధ్యయుగాల నావికులు తమ సాహసోపేత సముద్ర యాత్రలతో కొత్త ఖండాలు, పురాతన దేశాలను కనుగొన్నట్టే సమష్టి సంక్షేమాల కోసం అమరావతి కేంద్రంగా అన్వేషణలు జరగాలి. ‘అభివృద్ధి చెందిన దేశాలు కష్టపడి ఏళ్ల తరబడి చేసిన దీర్ఘయాత్రని అభివృద్ధి చెందే దేశాలు ఒక మహాముందడుగులో అందిపుచ్చుకోవాలని’ విక్రమ్ సారాభాయి అన్న మాటలు ప్రేరణగా తీసుకుంటేనే అమరావతి అభివృద్ధి నిజంగానే ఊపందుకుంటుంది.
తొలుత కర్నూలులో మజిలీ చేసి, అనంతరం భాగ్యనగరం నుంచి కదలి, తుదకు అమరావతికి చేరిన ఆంధ్ర రాజధాని కోసం సంకల్పాలు ఘనంగా చెప్పుకున్నా, నిర్మాణ పథకాలను పటిష్ఠంగా రూపొందించుకున్నా భవిష్యత్తు గండాలు లేకుండా చూసుకోవటం ప్రాణావసరం. రాజకీయ కక్షలకూ, స్వార్థాలకూ అయిదేళ్లపాటు అమరావతి మూగసాక్షిగా నిలిచిపోయింది. నవ్యాంధ్ర ఆశలు, సంకల్పాలే పునాదులై లేచిన మహానిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగిన చరిత్ర నవభారతంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కింది. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఊపిరులు ఊది దేశంలో బలమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పడటానికి కారణమైన ఆంధ్రకు ఆ దుస్థితి ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు.
ఒకటో రెండో విధానాలపై విబేధాలుంటే వాటిని ఉపసంహరించుకోవటమో, సంస్కరించటమో చాలా రాష్ట్రాల్లో జరిగింది. కానీ అందరి అమోదంతో ఏర్పాటైన రాజధానిని మూడుచోట్లకు మూడుముక్కలుగా విసిరివేయటానికి అయిదేళ్లపాటు అహర్నిశలూ పథకాలు రచించటం ఆంధ్రలో మాత్రమే జరిగిన వైపరీత్యం! దీన్ని ఎదుర్కోటానికి భూములు ఇచ్చిన రైతులు కనీవినీ ఎరగని రీతిలో ఆందోళనలు చేపట్టాల్సి రావటమూ ఎక్కడా జరగలేదు. రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇవ్వటానికి రైతులు ముందుకు రావటమే దేశచరిత్రలోనే ఒక అద్వితీయ సంఘటన అనుకుంటే దానికీ ఎన్నో దుష్ట లక్ష్యాలను, ప్రేరణలను అంటగట్టటం ఆంధ్రలోనే జరిగింది. అమరావతికి ఎదురైన రాజకీయ విఘ్నాలు కళ్లముందు మెదలుతున్నా నగర విస్తరణ కోసం అవసరమైన మరిన్ని భూములు ఇవ్వటానికి రైతులు మళ్ళీ సంసిద్ధత వ్యక్తంచేయటం గొప్పగానే భావించాలి. ఎకరం భూమి వదులుకోటానికీ రైతులు ముందుకురాని పరిస్థితే దేశంలో చాలా చోట్ల ఉంది. అమరావతికి ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైతే ఎక్కడాలేని సానుకూలత ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. కాకపోతే భవిష్యత్తులో రాజధానిని అమరావతి నుంచి మార్చలేని విధంగా పార్లమెంటులో చట్టంచేయాలనే ప్రతిపాదన వచ్చింది. దానికి సాధ్యాసాధ్యాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయో లేవో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలోని చేదు అనుభవాలు అటువంటి డిమాండ్లు తలెత్తేలా చేస్తున్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత పెట్టుబడులను ఆకర్షించటానికి ఏ రాష్ట్రం అవకాశాలను ఒకపట్టాన వదులుకోలేదు.
పెట్టుబడులు ఇతరచోట్లకు పోకుండా రాష్ట్రాలు శతవిధాలుగా ప్రయత్నించాయి. ఏదో ఒకచోట ప్రాథమిక సౌకర్యాలను పటిష్ఠంగా ఏర్పాటుచేసి అక్కడికి పెట్టుబడులు తరలివచ్చేలా చేశాయి. అమరావతిలో మాత్రమే గడిచిన అయిదేళ్లలో ఆ ప్రక్రియకు గండికొట్టేలా వ్యవహారాలు జరిగాయి. పెట్టుబడులు పెట్టేవారు విధానాల్లో కొనసాగింపును కోరుకుంటారు. ఫలానాచోట రాజధాని ప్రాంతమనో, పారిశ్రామిక ప్రాంతమనో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకునే పెట్టుబడులు పెట్టటానికి సంసిద్ధులు అవుతారు. అందుకే అమరావతి విషయంలో భవిష్యత్తులో మళ్లీ వెనకడుగులు పడకుండా చూడటమే పెద్ద సవాల్. జనబలంతోనే ఆ వెనుకడుగుల ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు. అమరావతి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా విధానాలు రూపొందించితే జనబలం వెన్నంటే ఉంటుంది. అదే అమరావతికి శ్రీరామరక్ష!
Updated Date - May 02 , 2025 | 06:37 AM