Chandrababu Naidu Vision: రాజధాని వేరు అమరావతి సృష్టి వేరు
ABN, Publish Date - May 01 , 2025 | 03:49 AM
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే దార్శనికతతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధాని కోసం అవసరమైన భవనాలు, వ్యవస్థలను నిర్మించి, ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి ఆవకాషాలు అందించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు.
రాష్ట్రానికి ‘రాజధాని’ వేరు. చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో పురుడు పోసుకుంటున్న ‘అమరావతి’ వేరు. రాజధాని అంటే... ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శి, మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, వారి అనుబంధ విభాగాలు... తమ తమ అధికార విధులు నిర్వహించడానికి వీలైన సచివాలయం, శాసనసభ, గవర్నర్ కార్యాలయాలు, నివాసంతో కూడిన రాజ్‌భవన్, డీజీపీ కార్యాలయం, హైకోర్ట్ మొదలైన వారి అధికార విధులు నిర్వహించడానికి వీలైన భవనాల సముదాయం. వీరందరి నివాసాలు (క్యాంపు కార్యాలయాలు... సచివాలయానికి చేరువలో ఉండాలనే రూల్ ఏమీ లేదు) ఎక్కడైనా ఉండవచ్చు. ఆ కోణంలో చూస్తే, విభజనకు గురైన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం– రాజధాని వసతులు లేకుండా ఎప్పుడూ లేదు. 2014 జూన్‌లో చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, హైదరాబాద్‌లోని సచివాలయం నుంచే మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, ఉమ్మడి హైకోర్ట్ నుంచి న్యాయమూర్తులు, హైదరాబాద్ రాజభవన్ నుంచి గవర్నర్– తమ తమ విధులు నిర్వహిస్తూ వచ్చారు. కనుక, రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనే సమస్యే లేదు. అయితే, ఈ సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు కాలేదు. ఇపుడు వెలగపూడిలో ఉన్న సచివాలయం, విజయవాడలో ఉన్న రాజభవన్ శాశ్వతమైనవి కావు. అలాగే, చాలా ప్రభుత్వ శాఖలు విజయవాడ, గన్నవరం, గొల్లపూడి, కంచికచర్ల, మంగళగిరి, ఇబ్రహీంపట్నం, గుంటూరు చుట్టుపక్కల అక్కడొకటి, అక్కడొకటిగా విసిరేసినట్టున్నాయి. వీటన్నిటికీ శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాలు, ప్రజాప్రతినిధులకు ఆవాసాలు, న్యాయమూర్తులు, గవర్నర్‌కు వసతి ఏర్పాటు మొదలైన నిర్మాణాలకు ఓ వెయ్యి ఎకరాలైతే ఎక్కువ. కానీ, మహాదార్శనికుడైన ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియక కాదు, అమరావతి... అమరావతి’ అని కలవరించేది. సుభిక్షమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారికి....‘సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్’గా హైదరాబాద్ ఉండేది. 13 జిల్లాలలోని తెలుగు వారు ప్రతి చిన్న, పెద్ద అవసరానికి హైదరాబాద్‌పై ఆధారపడడం... గత ఆరేడు దశాబ్దాలుగా ఒక ఆనవాయితీగా మారిపోయింది.
ఉద్యోగాలకోసమో, వ్యాపారాల కోసమో, ఇతర జీవనోపాధి మార్గాల కోసమో... 13 జిల్లాల నుంచి లక్షలాది మంది తెలుగు వారు పిల్లాపాపలతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సంక్రాంతి, దీపావళి, ఉగాది వంటి పండుగ వేళల్లో హైదరాబాద్ రోడ్లు, మాల్స్, సినిమా హాళ్లు చూస్తే... తెలుగు వారు ఏ స్థాయిలో హైదరాబాద్‌లో స్థిరపడ్డారో తెలుస్తుంది. తమ ఊళ్లల్లోని ఆస్తులను అమ్ముకొచ్చి హైదరాబాద్‌లో కొనుక్కున్నారు. అందుకే, హైదరాబాద్ అనేది తెలుగువారికి ఒక విద్యా, వ్యాపార, నివాస, ఉపాధి వనరుగా మారిపోయింది. తెలుగువారు హైదరాబాద్‌లో లక్షల కోట్లు కుమ్మరించడం వల్లనే అది తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఇటువంటి ‘సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్’ ఆంధ్రాకు లేదు. విశాఖపట్నం, విజయవాడ ఆ స్థాయి నగరాలు కాదు. అందుకే, హైదరాబాద్ లాంటి విస్తృతావకాశాలు గల ఒక నగరం ఆంధ్రకు లేని లోటును తీర్చడానికి ఉద్దేశించిందే అమరావతి. రాజధానికి అవసరమైన భవనాలు సైతం అమరావతి మహా నగరంలో ఓ చిన్న అంతర్భాగం అవుతాయి కానీ, రాజధానే అమరావతి కాదు. అమరావతి అంటే... లక్షలాదిగా నివసించే ప్రజలు, ప్రపంచ స్థాయి పెద్ద పెద్ద వ్యాపార, వాణిజ్య భవనాలు, పబ్లిక్ పార్క్‌లు, వినోద కేంద్రాలు, ఐకానిక్ నిర్మాణాలు, సువిశాలమైన రహదారులు, నైట్ లైఫ్ వినోద కార్యకలాపాలు అందించే సఫారీ టూర్ల వెసులుబాట్లు, టూరిస్ట్ ఆకర్షణలు. ఇవేగాక అంతర్గత రవాణా సదుపాయాలు, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ వైద్య–విద్యా సంస్థల క్యాంపస్‌లు, ప్రపంచస్థాయి ఆకర్షణలు, ఫ్లై ఓవర్లు... ఇలా అనేక సదుపాయాల సముదాయంగా అమరావతి పేరిట ఒక మహానగరం నిర్మింప చేయాలని చంద్రబాబు నాయుడు తలపెట్టారు. అందుకే 50 వేల ఎకరాలు.
నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో చంద్రబాబు కాకుండా మరెవరైనా ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నట్లయితే... 2019–2024 మధ్య కాలం నాటి అనుభవాలను 2014–2019లోనే తెలుగువారు రుచి చూసి ఉండేవారు. ఆ విభజన సమయాన దార్శనికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల, ప్రపంచ స్థాయి నగరంగా ‘అమరావతి’కి బలమైన పునాదులు పడుతున్నాయి. ఇప్పటి హైదరాబాద్ నగరం రూపుదిద్దుకోవడానికి నాలుగొందల ఏళ్లకు పైగా పట్టినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ప్రకటించిన ఈ 60, 70 ఏళ్లల్లోనే దాని దశ తిరిగింది. హైదరాబాద్ దశ తిరగడానికి కారకులైన వారిలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యుడు. ఆ అనుభవంతోనే, ఆ దార్శనికతతోనే, ఇపుడు అమరావతి నగర ఆవిష్కరణకు 2014లో మొదలుపెట్టిన బృహత్ కృషిని కొనసాగిస్తున్నారు. ఇది, ఒక ఆకారం తీసుకోవడానికి ఒకటి, రెండు దశాబ్దాలు పట్టవచ్చు కానీ... చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఒక సజీవరూపంగా చరిత్రలో అమరావతి నగరం నిలిచిపోతుంది. తెలుగువారికి ఆయన చేస్తున్న మహోపకారం– అమరావతి. ఈ సమయాన భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ పేరు కూడా తెలుగువారి చరిత్రలో నిలిచిపోతుంది, ఒకసారి శంకుస్థాపన చేసినందుకు, మరోసారి పునః నిర్మాణ యజ్ఞానికి జెండా ఊపినందుకు.
- భోగాది వేంకటరాయుడు
Updated Date - May 01 , 2025 | 03:49 AM