Amaravati Development: అమరావతికి పునర్వైభవం
ABN, Publish Date - May 02 , 2025 | 07:40 AM
అమరావతికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, చంద్రబాబు నాయుడి విజనరీ ఆలోచనతో ప్రారంభమైనప్పటికీ, వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి, రైతులు చేసిన పోరాటంతో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పునర్నిర్మాణం ద్వారా ఆర్థిక సమృద్ధి, పెట్టుబడుల రాక తదితరులు లక్ష్యంగా అమరావతి 2.0 ప్రారంభం అయ్యింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తయారైన వ్యాక్సిన్లలో 33శాతం వాటా హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీదే. బయోటెక్ సంస్థను స్థాపించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ జీనోమ్ వ్యాలీలో 200కు పైగా ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, 10వేల మందికి పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ప్రపంచం మొత్తంలోని టీకాలలో మూడవ వంతు ఇక్కడి నుంచే వస్తున్నాయి. విశాలమైన రాజధాని ప్రాధాన్యత ఏమిటో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు... దేశంలోనే నేడు పెద్ద నగరాలలో ఒకటి అయ్యింది. అదే అనుభవంతో ఆర్థిక, ప్రజా రాజధాని చెయ్యాలని ప్రభుత్వం అమరావతి నిర్మాణం తలపెట్టింది. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, ఒక ఆహ్లాదకరమైన, ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి, పనులు ప్రారంభంకానున్నాయి. వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిన అమరావతి బ్రాండ్‌ను పునరుద్ధరిస్తూ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా, ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణం జరగబోతున్నది.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు దీటుగా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 58 రోజుల్లో 34,281 ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. 2015లో పనులు ప్రారంభించి... హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాలు, రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరించి భూములిచ్చిన రైతులను అక్రమ కేసులతో వేధించి, అవమానించి, రాజధాని పనులు నిలిపివేశారు.
పాలకులు ఎవరైనా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకు విరుద్ధంగా జగన్‌రెడ్డి విధ్వంసానికి పాల్పడి, రాష్ట్రానికే తలమానికమైన ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్‌రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా శాంతియుతంగా, నిర్విరామంగా రైతులు, మహిళలు 1632 రోజుల పాటు అలుపెరుగని పోరాటం చేశారు.
పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా అమరావతి పునర్నిర్మాణం చేయడంతో పాటు మిగిలిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి జిల్లాలోను పారిశ్రామిక అభివృద్ధి జరిగేందుకు బాటలు వేశారు. వినూత్న నగరంగా అమరావతిని నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రజలపై భారం పడకుండా సొంతంగా నిధులు సమకూర్చుకోగలిగిన ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు.
అమరావతిని రాజధానిగా నిర్మిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని వైసీపీ తన పెయిడ్ ఆర్టిస్ట్‌ల ద్వారా దుష్ప్రచారం చేయించడం సిగ్గుచేటు. అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధానిలో నిర్మాణాలు అన్నీ పోగా, రూ.2లక్షల కోట్ల పైబడి విలువైన మిగులు భూములు అమరావతిలో ఉన్నాయి. పదేళ్ల తరువాత సైబరాబాద్ వద్ద పెరిగినట్లు ఇక్కడ భూములు విలువ ఎకరం రూ.50 కోట్లకు పైగా పెరుగుతుంది. అయితే, రాష్ట్ర నిధులన్నీ అమరావతికి ఖర్చు చేస్తున్నారంటూ ప్రాంతీయ చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నది జగన్ ముఠా. అమరావతి పూర్తయితే పెట్టుబడులన్నీ ఏపీకి వస్తాయనే భయంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.
భూసమీకరణలో భూములు ఇచ్చిన వారిలో 32శాతం ఎస్సీలు, ఎస్టీలు; బీసీలు 14శాతం, రెడ్డి సామాజికవర్గం 20శాతం; కమ్మ సామాజికవర్గం 18శాతం; కాపు సామాజికవర్గం 9శాతం; ముస్లిం సామాజికవర్గం మూడు శాతం ఉన్నారు. ఇలాంటి చోట కులం రంగువేసే ప్రయత్నం జగన్ ముఠా చేస్తున్నది. జగన్‌రెడ్డి నిర్వాకం వల్ల రూ.2లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార, విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడు రాజధానుల పేరుతో కుల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టి, తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేశారు. జగన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో అమరావతిని కుప్పకూల్చారు. ఎక్కడి పనులు అక్కడ ఆపేశారు. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్‌ను కూడా తమ అనుచరులతో దోపిడీ చేయించారు. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో దళితులు, బీసీలు ఎక్కువగా ఉన్నారు. దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి, వారి చేతులకు బేడీలు వేసి జైళ్లకు తరలించి, హింసించారు.
అమరావతి వంటి రాజధాని వస్తే రాష్ట్రానికే పేరు, గుర్తింపు వస్తుంది. ఇదొక ఆర్థికశక్తిగా మారి రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. సంపద సృష్టికి కేంద్రంగా అమరావతి ఉంటుంది. అమరావతి 2.0 పనులను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి.
ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి 15 వేల కోట్ల రుణం మంజూరైంది. జర్మనీకి చెందిన డెవలప్‌మెంట్ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి 15,400 కోట్లు రుణాలు రావడం హర్షణీయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతి అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు మోదీ చేతుల మీదుగా మరోసారి కూటమి ప్రభుత్వం అమరావతి 2.0కు శ్రీకారం చుట్టింది. అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది.
రైతుల ప్రాణత్యాగాలు ఓవైపు... పోరాటాలు మరోవైపు... న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలనా దక్షతతో ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకులను ఒప్పించి, తెచ్చిన నిధులతో అమరావతి పనులు రానున్న కాలంలో పరుగులు పెట్టబోతున్నాయి.
- ఏలూరి సాంబశివరావు
పర్చూరు శాసనసభ్యులు
Updated Date - May 02 , 2025 | 07:41 AM