Alluri Sitarama Raju: మహోజ్వలశక్తి అల్లూరి
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:50 AM
విప్లవం పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేరు.. అల్లూరి సీతారామరాజు. ఆయన విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ. బ్రిటిషర్లను గడగడలాడించి, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరపుత్రుడు.
విప్లవం పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేరు.. అల్లూరి సీతారామరాజు. ఆయన విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ. బ్రిటిషర్లను గడగడలాడించి, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరపుత్రుడు. అల్లూరి పేరు చెబితే మన్యం పులకిస్తుంది. ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక అల్లూరి. తెల్లవాడి కబంధ హస్తాల్లో భరతమాత కన్నీరు పెడుతున్న రోజులు అవి. ఉత్తర భారతంలో స్వాతంత్య్రోదమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులు కూడా. అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది. ఆ అగ్ని కణమే దావానలంలా వ్యాపించి బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో వణుకు పుట్టింది. అలా తెల్లవాళ్ల పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు. నేడు ఆ విప్లవ వీరుని 128వ జయంతి. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. స్వాతంత్ర్యం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి.. తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించాడు. మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. కొన్నేళ్లపాటు సమరశీల ఉద్యమాలకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని నమ్మి, స్వరాజ్యం కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అడవుల్లోని ప్రకృతి సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు అల్లూరి. ఆయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. పోడు వ్యవసాయానికి పన్ను కట్టనక్కర్లేదన్నాడు. గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారికి అండగా ఉన్న బ్రిటిషువారి మీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. ప్రతి గిరిజనుడినీ ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర్య పోరాట మార్గం చూపాడు.
సమాచారం ఇచ్చి మరీ పోలీసు స్టేషన్లపై దాడులు చేశాడు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవ దళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను సీతారామరాజు కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరపలేదు. ఆ సమయంలో అల్లూరి మరణించాడనే వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన 1923 ఏప్రిల్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మరోసారి తెల్లవాళ్లపై దాడులకు దిగాడు. అల్లూరికి సాయం చేస్తున్నారన్న కోపంతో మన్యం ప్రజలను బ్రిటిషర్లు వేధించడం మొదలు పెట్టారు. తనకున్న అవకాశాలతో పూర్తి స్థాయిలో మన్యం ప్రజలకు రక్షణ కల్పించలేనని తెలిసి తెల్లదొరలకు రామరాజు లొంగిపోవాలనుకున్నాడు. తాను స్నానానికి చెరువు దగ్గరకు రాబోతున్నట్టుగా తన అనుచరుల ద్వారా బ్రిటీష్ అధికారులకు సమాచారం అదించాడు. 1924 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా అల్లూరిని బంధించిన పోలీసులు, ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున ఆయన్ను కాల్చిచంపారు. బ్రిటిష్ అధికారులు ఓ నాయకుడిని చంపగలిగారు కానీ ఆయన ప్రజల్లో రగిలించిన స్వతంత్ర్య ఆకాంక్షను మాత్రం ఆర్పివేయలేకపోయారు. తెలుగుతేజం అల్లూరి మరణం లేని ఓ విప్లవ వీరుడు. తెలుగు జాతికి, దేశానికి స్ఫూర్తి ప్రధాత. అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం.
సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్ర్య నినాదం. సమరగీతం. ఓ ఉద్యమ జ్వాల. తెలుగు నేల మీద స్వాతంత్ర్య సమరానికి బీజాలు వేసిన మహా నాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఆ వీరునికి మరోసారి ఘన నివాళి అర్పిద్దాం.
-అనంతాత్మకుల కొండబాబు జర్నలిస్ట్
(నేడు అల్లూరి సీతారామరాజు జయంతి)
Updated Date - Jul 04 , 2025 | 01:50 AM