Poem on Ego and Self Respect: గిరిగీత
ABN, Publish Date - Sep 08 , 2025 | 12:05 AM
అహంభావమూ ఆత్మగౌరవానికి ఒక ఆవశ్యకమైన కంఠాభరణమే..
అహంభావమూ ఆత్మగౌరవానికి
ఒక ఆవశ్యకమైన కంఠాభరణమే
వక్ర మతులు మర్మజాలాల విసురు
కుత్సితాలనెదురొడ్డు అదొకానొక
అత్యావశ్యకమైన రక్షక వలయమే
ఎటొచ్చీ సాటి స్వాభిమానాల
మనుగడను పనిగట్టుకొని గురుతెరుగనోర్వని
అదుపు దప్పిన
దురహంకారమే ఒక ఏవగింపు
ఆత్మన్యూనతల్ని కప్పిపుచ్చుకునే
దిక్కుమాలిన ప్రాకులాటలో
పూనుకొని పరుల ప్రతిష్ఠల్ని
అపమానించ జూసే క్షణికానందపు
దురభిమానమూ ఒక ఓకరింతే
కీకారణ్యపు కారుచీకట్ల నడిబొడ్డున
నీకు నువ్వే ప్రతిష్ఠించుకున్న
సింహాసనాన్ని అధిష్టించి
సకల భూమండల సామ్రాజ్యపు
ఏకైక అధిపతివి నువ్వని
రొమ్ము విరిచి మీసాలు మెలిపెట్టి
గిరిగీసుకున్న నీ బింకాలు
ఏ పునాదుల ఆదరువులూ లేని
ఉత్తిత్తి భ్రమల గాలిమేడల పేటికలు
నీ కండ్ల గమ్మిన కారుచీకట్ల
పొరల మైకాన్ని విదిలించుకుని
ఏ నిమిత్తమూ లేకనే
నువ్వు చొరబడ్డ ఊబిలోనుంచి
ఇంగితపు సోయివై బైటపడి
సమస్త లోకాలు ఇంపుగా అలరారి
తులతూగు వెలుగురేఖల్ని జూడు
ఊహల్ని వసంత వర్ణమాలికల చేసి
మనసుపడి మురిపెంగ అల్లుకున్న
లేతపచ్చని కలల కుటీరాల లోగిళ్ళలో
స్వేచ్ఛా నినాదమై ఒద్దికగ నడయాడు
పైరగాలుల మోదముల జూడు
పైరగాలుల రెక్కల పైన
ఎగిసెగిసి నాక లోకాల చెక్కిళ్ళపై
సుతిమెత్తగా ముద్దులిడ తారాడు
విహారుల ఆర్ద్ర మోములను జూడు
ఆర్ద్ర మోముల నుంచి ఉట్టిపడి
శీతరుతు తొలి సంజె పొద్దులో
లేలేత గడ్డిపరకల చివరంచు
నీటి బిందువుల వోలె నర్తించు
ఆనంద పరవశాలను జూడు
ఆ సుందర లోకాల విహారులు
తాముగా ఆశపడి నిర్మించుకోనట్టి
ఎవరి సామ్రాజ్యాలకు వారే
ఎటువంటి అధికార పీఠాల
తావులసలెరుగని సత్య సార్వభౌమాధిపత్యాలు
ఒకరి సామ్రాజ్యపు హద్దులు
వేరొకరు మీరనే మీరని
ఆ సుందర గగన విహారులే
తాముగా ఆశపడి నిర్మించుకోనట్టి
ఎవరి సామ్రాజ్యాలకు వారే
ఎటువంటి రాజ్యాంగ స్వామ్యాల
ఎరుకలసలొల్లని నిత్య పీఠాధిపత్యాలు
కండ్ల గమ్మిన కారుచీకట్ల
పొరల మైకాన్ని విదిలించుకుని
ఒక్కగానొక్క సారన్న బైటపడి
నీ బింకాల భ్రమలకు కనువిప్పు
కలుగునో లేదో కూసింత సేపన్న
ఆ వెలుగురేఖలు విరజిమ్ము
సుకుమార సోయగాలను జూడు
ఏ ఆభిజాత్యాల ఊసులసలెత్తని
ఆ సార్వభౌమాధిపత్యాల
నైర్మల్య నిర్వికారముల జూడు
ఏ హెచ్చుతగ్గుల రేతులసలెన్నని
ఆ పీఠాధిపత్యాల
సౌశీల్య సంస్కారముల జూడు
నీ బింకాల భ్రమలకు కూసింత
కనువిప్పు కలుగునో లేదో
నీ నుంచి నువు కాసేపు వైదొలిగి
నిన్ను నువు ఒక్క సారన్న తేరిపార జూడు
బైరెడ్డి కృష్ణారెడ్డి & 94400 72211
Updated Date - Sep 08 , 2025 | 12:05 AM