Tribal Religion: మతం ఉచ్చులోకి జారుతున్న ఆదివాసీలు
ABN, Publish Date - Sep 24 , 2025 | 12:20 AM
ఆదివాసులు హిందువులే అనే కంటే, వారు హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే అంటే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి’లో 24 జూలై 2025న...
‘ఆదివాసులు హిందువులే’ అనే కంటే, వారు హిందూ మతాన్ని ‘అనుసరించే వాళ్ళు’ మాత్రమే అంటే బాగుంటుంది. ‘ఆంధ్రజ్యోతి’లో 24 జూలై 2025న ‘ఆదివాసుల మతం ఏమిటి?’ అని ప్రొ. భంగ్యా భూక్య, 12 ఆగస్టు 2025న ‘ఆదివాసీలు ముమ్మాటికీ హిందువులే’ అని కాయం నవేంద్ర రాసిన వ్యాసాలు చదివాక ఈ విశ్లేషణ చేయాలనిపించింది. హిందూ ఆచారాలు, అనేక దేవుళ్ళ పుట్టుక చరిత్ర వెనుక ఆదివాసీల చారిత్రక నేపథ్యం దాగున్నదని మరచిపోతున్నారు మేధావులు. పురాణేతిహాసాల్లో, వేదాలలో భక్త కన్నప్ప, ఏకలవ్యుడు, చెంచులక్ష్మి, శబరి, పోకల దమ్మక్క, హిడింబి, తాటకి, శూర్పణక, హోలిక, రావణుడు, నరకుడు, కుపార్ లింగో... వీరు గిరిజన ఆదివాసీలే కదా. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయ ఆచారాలే క్రమంగా హిందూ మతాచారాలుగా మారాయి. కాబట్టి ఈ మూలవాసులది పురాతన ‘ఆదివాసీ మతం’ అనటం సమంజసం. ఆదివాసులు ఆదిమ కాలం నుంచి స్వీయ ఆచార సంస్కృతులు కలిగినవారు. వారికి తెలిసిందల్లా నమ్మకంతో ముడిపడిన భక్తి మాత్రమే. ఆధ్యాత్మిక చింతనలు, పునర్జన్మలు, ముక్తి మార్గాలు వారికి తెలియవు. వారి ఇలవేల్పులైన నాగోబా, జంగుబాయి, పెర్స పేన్, మేడారం సమ్మక్క–సారక్క, గుంజేడు ముసలమ్మ, కొమ్మలమ్మ, సడలమ్మ, గట్టమ్మ, దూలరాజు, మారయ్య వంటి దైవాలను గౌరవించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. వారికి వ్రతాలు, నోములు, పూజలు, మంత్రాలు, హెూమాలు తదితరాలతో సంబంధం లేదు. వారి పూర్వాచారాలే వారసత్వంగా అమలవుతున్నవి. అనారోగ్యం పాలైతే తెలిసిన మూలికా వైద్యం చేసుకుంటారు. మనోధైర్యం కోసం వారాంతపు దేవర్ల దగ్గరకు వెళ్లి పూనకం దేవర్లు చెప్పే ధైర్యపు మాటలు వింటారు. పంటలు బాగా పండాలని దేవర్లకు మొక్కుకుంటారు. కృతజ్ఞతతో వారికి ధాన్యం, ఇప్పసారా, మాంసాహారం వంటి వాటిని ప్రసాదంగా సమర్పించుకుంటారు. ఒక రకంగా గిరిజనుల భక్తి భావనలో కేవలం నమ్మకం, కృతజ్ఞతలు తప్ప ప్రతిఫలాపేక్ష ఏ మాత్రం ఉండదు. ఇది ఒకనాటి గిరిజనుల భక్తి భావనల తీరు.
నేటి ఆధునిక కాలంలో వస్తున్న మార్పుల్లో భాగంగా ఆదివాసుల భక్తి విధానాలలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక దైవాలైన శ్రీరాముడు, ఆంజనేయుడు, గణపతి, అయ్యప్పలను పూజిస్తున్నారు. మాల ధారణలు, దీక్షలు మొదలుపెట్టారు. గిరిజనేతరులతో కూడా కలిసి విడివిడిగా భక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే, ఇటీవల గిరిజన గ్రామాల్లో విరివిగా గణేష్ మండపాలు వెలిశాయి. గ్రామస్తులంతా చందాలు వేసుకుని పూర్తి ఆధునిక పద్ధతుల్లో గణేష్ పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, నిమజ్జనం, శోభాయాత్రల్లో మాత్రం తమదైన డోలు వాయిద్యం, గిరిజన నృత్యాలతో సాంప్రదాయంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సంక్రాంతి నాడు శ్రీరామ భజన చేస్తూ గిరిజన గ్రామాల్లో పల్లకీ సేవలు నిర్వహిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో జరిగే శివరాత్రి నాటి శివకళ్యాణం, శ్రీరామ నవమి నాటి సీతారామ కళ్యాణం, నృసింహ జయంతికి నరసింహ కళ్యాణం జరుపుకుంటున్నారు. భద్రాచలంలోని రామాలయంలో శబరి స్మృతి యాత్ర వంటి వివిధ తీర్థాలకు గిరిజనులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. ఈ మధ్యన భగవద్గీత త్రైత కమిటీ ద్వారా కృష్ణుని పల్లకి సేవ, జయంతి పూజలు చేశారు. వీటి వెనుక మనువాదం మిళితం అయి ఉన్నదని ఆదివాసులు గమనించడం లేదు. కానీ తమ సంస్కృతికి విఘాతం ఏర్పడితే గిరిజన జాతి ఉనికికే ప్రమాదమని ఇప్పటికైనా గ్రహించాలి. మరోవైపు గిరిజనుల్లో కొందరు అనారోగ్యాల నుంచి స్వస్థత పొందే క్రమంలో చర్చిలకు వెళుతున్నారు. పాస్టర్ల ఆర్థిక పురోభివృద్ధి ప్రత్యక్షంగా చూసిన కొంతమంది గిరిజన యువకులు పాస్టర్లుగా కూడా మారుతున్నారు. దీనితో ప్రతి గిరిజన గ్రామంలో చర్చిలు వెలుస్తున్నాయి. మరోపక్క తమ జాతి పండుగలకు దూరమవుతున్నారు. వారిదైన గిరిజన సంస్కృతికి సంబంధించిన కొత్తల పండుగ, విత్తనాల పండుగ, వివిధ తెగల, గోత్రాలకు నిర్దేశించిన ఇలవేల్పు పండుగలను మర్చిపోతున్నారు. గ్రామ పండుగలైన ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తదితర పండుగలకు, జాతర్లకు కూడా దూరమవుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో అక్షరాస్యులు, ఉద్యోగులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న తుడుందెబ్బ, సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన తదితర గిరిజన సంఘాలు ఆధునిక భక్తిభావాలపట్ల వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి. తమదైన గిరిజన సంస్కృతికి సంబంధించిన దేవర్లను, ఇలవేల్పులను, ఆదివాసీ వీరులను మాత్రమే పూజించుకునే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ చైతన్యం దిశగా గిరిజన సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలి. నేటి గిరిజన యువతలోని అక్షరాస్యత కేవలం ఉద్యోగాల కోసం, ఆర్థిక వృద్ధి కోసం మాత్రమే కాదు. తమదైన సంస్కృతులను, సాంప్రదాయాలను, తమ అస్తిత్వాన్ని సంరక్షించుకోవాలి.
గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకులు
Updated Date - Sep 24 , 2025 | 12:20 AM