Acharya Donappa Legacy: శోధన, బోధనలో దొణప్ప వెలుగులు
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:13 AM
విద్యార్థి ఎంత ఎదిగితే దేశం అంత ఎదిగి సుభిక్షమవుతుందనే సూత్రాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన గురు సార్వభౌముడు ఆచార్య తూమాటి దొణప్ప. భాషాశాస్త్రానికి తెలుగులో తగిన పుస్తకాలు దొరకని రోజుల్లో తేలికగా అర్థమయ్యేలా...
‘విద్యార్థి ఎంత ఎదిగితే దేశం అంత ఎదిగి సుభిక్షమవుతుంద’నే సూత్రాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన గురు సార్వభౌముడు ఆచార్య తూమాటి దొణప్ప. భాషాశాస్త్రానికి తెలుగులో తగిన పుస్తకాలు దొరకని రోజుల్లో తేలికగా అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా బోధించిన భాషాశాస్త్ర పండితుడు దొణప్ప. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకట్ల గ్రామంలో తూమాటి సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు 1926, జూలై 1న జన్మించారు. పుట్టినప్పుడు ఆయనకు దొణతిమ్మరాయచౌదరి అని పేరు పెట్టారు. పాఠశాల రికార్డుల్లో మాత్రం దొణప్ప అని పేరు మార్చారు. బాల్యంలో భీమప్పగారి వద్ద సంస్కృతాంధ్రాలు చదివారు. భారత, భాగవత రామాయణాలు గురువుగారి నేతృత్వంలో అధ్యయనం చేశారు. వజ్రకరూర్‌లో 1939–42 మధ్య విద్యాభ్యాసం చేశారు. 1946లో ఉరవకొండ ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదివారు. అక్కడే చిలుకూరి నారాయణరావు పాఠాల వల్ల పరిశోధనపై ఆసక్తి కలిగింది. ఆపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్‌లో గంటిజోగి సోమయాజి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి ఉద్దండ పండితుల నేతృత్వంలో చదువు కొనసాగింది. ఆనర్స్‌లో ‘ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్’ను ప్రత్యేకాంశంగా చదివారు. గంటిజోగి సోమయాజి పర్యవేక్షణలో తెలుగులో ‘వైకృత పద స్వరూప నిరూపణము’ అనే అంశంపై పరిశోధన చేశారు. 1958లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకుడిగా చేరి భాషా శాస్త్ర బోధనలో తనదైన శైలిలో బోధించ ప్రారంభించారు. తరగతి గదిలో చెప్పిన పాఠం పరీక్షల వరకూ గుర్తుండేలా బోధించేవారు. గుంటూరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌ను విశ్వవిద్యాలయంగా మార్చే ప్రక్రియలో 1976లో అధ్యాపకుల బదిలీలు జరిగాయి.
ఈ నేపథ్యంలో తన వద్ద పని చేస్తున్న పరిశోధక విద్యార్థి బృందంతో సహా 1976 సెప్టెంబర్ 11న కొత్తగా నామకరణం చేసిన నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడే శాఖాధిపతిగా, విశ్వవిద్యాలయ కళాశాలకు ప్రిన్సిపల్‌గా, రిజిస్ట్రార్‌గా పలు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏ పదవిలో ఉన్నా క్లాసు టైమ్‌కి మాత్రం తప్పక వచ్చి పాఠాలు చెప్పిన మహామహోపాధ్యాయుడాయన. ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు కళలు, చారిత్రక వారసత్వ సంపదల పరిరక్షణకు ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలని భావించారు. 1986 జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, తొలి వైస్ ఛాన్సలర్‌గా ఆచార్య తూమాటి దొణప్పను నియమించారు. ఈ విశ్వవిద్యాలయం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని తెలుగు భాషా సాహిత్యంతో పాటు, కళలు, జానపద కళలు, పురావస్తుశాఖ మొదలైన అధ్యయనాలను అభివృద్ధి చేయాలని శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో నాలుగు అనుబంధ శాఖలు ఏర్పాటు చేశారు. బాధ్యతాయుతమైన ఉపకులపతిగా ఉన్నా, రచనా వ్యాసంగం కొనసాగించారు. ఆయన ఏ రచనా ప్రక్రియ ప్రారంభించినా ఆమూలాగ్రం పరిశోధించి చికిలీపట్టి, నగిషీ చేయగల సమర్థుడు. ఆయన రచనల్లో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డులు, ప్రత్యేక పురస్కారాలు పొందిన రచనలే. వాటిల్లో ఆంధ్ర సంస్థానాలలో సాహిత్య పోషణ, భాషా చారిత్రక వ్యాసావళి, జానపద కళాసంపద, తెలుగు హరికథా సర్వస్వం, తెలుగులో కొత్త వెలుగులు, ఆకాశ భారతి, వైకృత పద స్వరూప నిరూపణము, బాలల శబ్ద రత్నాకరములతో పాటు సంపాదకుడిగా తెలుగు వ్యుత్పత్తి పదకోశము, త్రివేణి, మాండలిక వృత్తి పదకోశము, అన్వేషణ మొదలైన ముద్రిత గ్రంథాలున్నాయి. దొణప్ప రచించిన మూడు వేల పుటలకు పైగా అముద్రిత రచనలను ముద్రించే యత్నాలు శతజయంతి కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్నాయి. ఆయన పర్యవేక్షణలో తెలుగు వారి ఇంటిపేర్లు, ఊర్ల పేర్లు, సంప్రదాయ ఆధునిక కవుల రచనలు, క్రైస్తవ, ముస్లిం, జైన, బౌద్ధం, తెలుగు–సంస్కృత వ్యాకరణాలు మొదలైన పరిశోధనా గ్రంథాలు వెలువడ్డాయి.
ఉద్యోగ విరమణానంతరం ప్రత్యేక అనుమతితో ఆయన వద్ద పలువురి పరిశోధనలు కొనసాగాయి. ఆచార్య దొణప్ప నేతృత్వంలో అరవై మందికి పైగా పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా నిత్యం తెలుగు భాషా పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేవారు. పీహెచ్‌డీ పొందినవారి నుద్దేశించి ‘పీహెచ్‌డీ పట్టా పరిశోధనకు తొలిమెట్టు. అనంతరం అధిరోహించి పరిశోధించవలసినది ఎంతో ఉంది’ అని చెప్పేవారు. గురువులకే గురువుగా, తెలుగు భాషా సాహిత్యాన్ని జీవిత పరమార్థంగా భావించి జీవించిన ఆచార్య దొణప్ప 1996 సెప్టెంబరు 6న విజయవాడలో తనువు చాలించారు. ఆయన శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లి నేటికీ ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆచార్య తూమాటి దొణప్ప శతవత్సరాన్ని (1926–2025) పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు, విద్యార్థులు, అభిమానులు ఏడాది పొడవునా శతజయంతి వేడుకలు, సదస్సులు, తెలుగు భాషా సాహిత్య కార్యక్రమాలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. శత జయంత్యుత్సవాలు జూలై 1, 2025న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, పలు సాహిత్య సంస్థల ద్వారా ‘ఆచార్య దొణప్ప శతజయంతి సాహిత్య వేడుక’ల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమయినాయి. తెలుగు భాషా సాహిత్య ఆచార్యునికి సాహిత్య అభిమానులు, అంతేవాసులు ఏడాదిపాటు నిర్వహించే తెలుగు భాషా సాహిత్య సభలు, అముద్రిత గ్రంథాల ప్రచురణ కొత్త వెలుగులు చూపుతాయనడంలో సందేహం లేదు.
-ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి
(జూలై 1 నుంచి ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి ఉత్సవాలు)
Updated Date - Jun 29 , 2025 | 03:15 AM