Gaddars Legacy: ఇప్పుడు గద్దర్ ఉండాల్సింది
ABN, Publish Date - Aug 06 , 2025 | 02:56 AM
ఆపదలో అయినవాళ్లు యాదికొస్తారంటారు. నేడు తాము ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో తాడిత పీడిత ప్రజలు, మరీ ముఖ్యంగా
ఆపదలో అయినవాళ్లు యాదికొస్తారంటారు. నేడు తాము ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో తాడిత పీడిత ప్రజలు, మరీ ముఖ్యంగా ఆదివాసులు, ఇప్పుడు గద్దర్ ఉంటే ఏమి చేసేవాడు అని తమవైన అనుభవాల్లోంచి ఊహించుకుంటున్నారు. ఏడాది కాలంగా గద్దర్ ఫౌండేషన్ కార్యకలాపాలలో భాగంగానూ, ఎన్‌కౌంటర్లలో అమరులైన వారి కుటుంబాలను పరామర్శిస్తూనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక గ్రామాలు తిరిగాను. ఎక్కడికి వెళ్లినా– పాలక ప్రభుత్వాల అమానవీయ చర్యలను ప్రజలు నిరసి స్తున్నారు. గద్దర్ ఉంటే ఇలా ఉండేది కాదంటున్నారు. ఇలా గద్దర్ లేని లోటు కొంచెం కొంచెంగా ప్రజలకు, ముఖ్యంగా సామాజిక కార్యకర్తలకు, అనుభవంలోకి వస్తున్నది.
ఈ దేశ ప్రజా సంస్కృతిపై ఒక కళాకారుడిగా గద్దర్ వేసిన ప్రభావం ఎనలేనిది, మరొకరు పూడ్చలేనిది. ప్రజా కళాకారుడిగా ఆడి పాడటమే కాదు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాతి కాలంలో కూడా సామాజిక సమస్యలను, విషయాలను పట్టించుకొని, పాలకుల అపసవ్య విధానాలకు వ్యతిరేకంగా తాను కదలటమే గాక మొత్తం సమాజాన్ని కదిలించాడు. సామాజిక చారిత్రక సందర్భానుసారంగా కలిసి వచ్చే శక్తులను, వ్యక్తులను ఏకం చేసి అనేక ఐక్య ఉద్యమాలను నిర్మించాడు. పార్టీలను, ప్రజా సంఘాలను ఏకతాటి మీదికి తెచ్చి ప్రజాస్వామిక విలువల కోసం నిరంతరం ఉద్యమించాడు.
ఈ మధ్యన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోతే ఆయన మృతదేహాన్ని ఇవ్వకుండా ప్రభుత్వాలు అమానవీయంగా వ్యవహరించాయి. బతికి ఉన్నప్పుడు ప్రభుత్వాల దృష్టిలో అతను ఏమైనా కావచ్చు, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని వారి కుటుంబీకులకు అప్పగించి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు చేసుకునేందుకు వీలు కల్పించటం కనీస మానవీయత. దాన్ని కూడా పాటించకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న గడ్డు కాలం ఇది. గద్దర్ ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్లలో చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు చేర్చటానికి ఎంతో కృషి చేశాడు. ఆ క్రమంలో పోలీసులతో, ప్రభుత్వాధి నేతలతో తీవ్రంగా ఘర్షణపడ్డాడు. ప్రజాస్వామిక వాదులు అందరినీ ఏకం చేసి శవాల స్వాధీన కమిటీ పేర గొప్ప మానవీయ కార్యాన్ని నెరవేర్చాడు.
నేడు ఆదివాసులు గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టనష్టాల పాలవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో, మావోయిస్టుల ఏరివేత అంటూ ఆదివాసులపై యుద్ధం ప్రకటించాయి. అడవులను ఆక్రమిస్తూ ఆదివాసులకు నిలువ నీడలేకుండా చేస్తున్నాయి. లక్షల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో ఆదివాసీ ప్రాంతాలను చెరబట్టి అమాయక ఆదివాసులను అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ఎదురుకాల్పుల పేరిట హత్య చేస్తున్నారు. గద్దర్ జీవితాంతం ఆదివాసుల హక్కుల కోసం పోరాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై, దోపిడీ పీడనలపై పాటలు రాశాడు. ఆదివాసుల సంస్కృతి, జీవనం, వారిపై అమలవుతున్న అణచివేతలపై ఓ బ్యాలే రాశాడు. అడవిపై ఆదివాసులది జన్మహక్‌కు అని చాటిచెప్పాడు. నేడు ఈ మానవ హనన కాలంలో నేడు గద్దర్ ఉండివుంటే సమాజాన్నంతా కదిలించి ప్రజలకు అండగా నిలిచేవాడంటూ ప్రజలు గద్దర్ లేని లోటును చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఇవ్వాళ పౌర ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదం ఏర్పడింది. సర్వత్రా రాజ్యాంగ స్ఫూర్తి, విలువలు తుంగలో తొక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలోంచే గద్దర్ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాల్సి వచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రేమికులారా గద్దర్ ఆశయాల వెలుగులో పయనిద్దాం. రాజ్యాంగ విలువల పరిరక్షణకై ఉద్యమిద్దాం. ఆదివాసులపైనా, ప్రజలపైనా కొనసాగుతున్న అన్ని రకాల అణచివేతలను నిరసిద్దాం.
-సూర్యకిరణ్ గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి
Updated Date - Aug 06 , 2025 | 02:56 AM