ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Turupati Kutumba Rao: తెలుగుజాతి వెలుగు రేఖ.. తుర్లపాటి

ABN, Publish Date - Aug 09 , 2025 | 04:31 AM

అందరినీ ప్రేమించు అందరినీ పలకరించు మరల ఈ దారిన వస్తానో, రానో రాము, రాబోము. ఈ మహత్తర మానవ జీవిత సందేశాన్ని

‘అందరినీ ప్రేమించు! అందరినీ పలకరించు! మరల ఈ దారిన వస్తానో, రానో!’ రాము, రాబోము. ఈ మహత్తర మానవ జీవిత సందేశాన్ని పాటించడమే మానవ జీవిత ప్రస్థానానికి సాఫల్యం. చివరగా ఒక మాట. నేను ఎప్పుడూ చేప్పే మాటే. ‘జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు మానవునిపట్ల మానవుడుగా వ్యవహరించే మానవీయ వ్యవస్థ మన లక్ష్యం కావాలి’ అని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు తన ‘నా కలం–నా గళం’ ఆటో బయోగ్రఫీలో రాసుకున్నారు. మహాత్మాగాంధీ ఆటోగ్రాఫ్ సంపాదించిన తుంటరి తుర్లపాటి... ఐరన్ లేడీ ఇందిరాగాంధీ ఇంటికొచ్చి పరామర్శించేంత గొప్ప వ్యక్తిత్వం... మా జాతిపితకు నోబెల్ ఎందుకివ్వరు అంటూ నిర్వాహకుల్ని నిలదీసిన తెగువ... ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అమరజీవి, ఆంధ్రకేసరి త్యాగాలను రికార్డు చేసిన కలం... మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, రాజాజీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన మహా మేధావి.. బిల్ క్లింటన్‌నూ భారతదేశానికి ఉత్తరం ద్వారా రప్పించిన జనహితుడు.

ఉత్తరాలతోనూ ఉద్యమాలను నడిపించిన సత్తా.. నిరసన తెలిపిన చాతుర్యం సొంతం చేసుకున్న తుర్లపాటి కుటుంబరావు తాను నడిచిన దారి నిండా మంచితనం, మానవత్వం మొక్కలు నాటుకుంటూ మహావృక్షాలుగా చేసి వార్తలలో వ్యక్తిగా.. బహుముఖ ప్ర‌జ్ఞాశక్తిగా శాశ్వతత్వం సాధించారు. కలకాలం నిలిచే ఆయన కలం.. తెలుగు భాష ఉన్నంతవరకూ ప్రతిధ్వనించే ఆయన గళం ఒక చరిత్ర. ఏడు దశాబ్దాల పాటు నిర్విరామంగా పాత్రికేయునిగా కొనసాగిన తుర్లపాటి కుటుంబరావు తెలుగుజాతి వెలుగు రేఖ. 14 ఏళ్లకే రచనా వ్యాసంగంలోకి వచ్చి పాత్రికేయుడైన తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు 10న సుందర రామారావు, శేషమాంబ దంపతులకు విజయవాడలో జన్మించారు. విద్యాభ్యాసం గన్నవరం, విజయవాడలలో కొనసాగించారు. నార్ల వేంకటేశ్వరరావు గారికి ఏకలవ్య శిష్యుడు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా పనిచేశారు. తుర్లపాటి వంటి ఘనాపాఠీని పరిచయం చేయడానికి భారీ కాన్వాస్ అవసరం. తెలుగు నేలపైనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన వ్యక్తి.. ఒక దేశ ప్రధాని కుటుంబంతో నాలుగుతరాలుగా అనుబంధం కొనసాగడం అంటే మాటలా? జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ ఇలా నాలుగు తరాలు మారినా తరగని స్నేహబంధం ఏర్పడింది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇప్పటి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ 20 మంది ముఖ్యమంత్రులకు తలలో నాలుకలా వ్యవహరించినా, ఏ రాజకీయ పార్టీకి చెందని అజాతశత్రువు.

నాటి ప్రధానమంత్రులు.. కేంద్రంలో కీలక నేతలైన ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్‌గాంధీ, జగ్జీవన్‌రామ్‌ లాంటి ఉద్దండుల ఇంగ్లీష్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించే ఒకే ఒక తెలుగు గళం తుర్లపాటి. ఒకసారి వేదిక ఎక్కి మాట్లాడితే మురిసిపోతాం.. స్వాతంత్య్రం రాక ముందు నుంచీ, స్వర్ణోత్సవ కాలం ముందు వరకూ 20 వేల ఉపన్యాసాలు ఇచ్చిన ‘ఉపన్యాస కేసరి’ గురించి కొత్తగా మనం ఏం ఉపన్యసించగలం? ‘వార్తల్లోని వ్యక్తి’ అనే శీర్షికను తొలుత ఆంధ్రజ్యోతిలో తర్వాత వార్త దినపత్రికలో మొత్తం దాదాపు 50 సంవత్సరాలు కొనసాగించి రికార్డ్ నెలకొల్పారు. ఈ శీర్షిక ద్వారా వికిపీడియాను మించిన కచ్చితమైన సమాచారాన్ని అందించిన ‘వార్తల్లోని వ్యక్తి’ కుటుంబరావు. దాదాపు 6,000 మంది జీవితచరిత్రలు రాసి, చరిత్ర సృష్టించిన ఆటోబయోగ్రఫీస్ స్పెషలిస్ట్ మన తుర్లపాటి. పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు పాత్రికేయ ఎవరెస్ట్ శిఖరం కుటుంబరావు.. చివరికి సొంతిల్లు కూడా లేదు. మంచితనం, మానవత్వం, నిజాయితీ, నిబద్ధత.. వీటినే ఆయన తరతరాలకు తరగని ఆస్తిగా మురిసిపోయేవారు. పాత్రికేయుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రలు రచించిన రచయితగా, ఉపన్యాసకుడిగా, రాజకీయ నేతలకు కార్యదర్శిగా ఏ బాధ్యతనైనా తుర్లపాటి కుటుంబరావు మాత్రమే నిర్వర్తించగలరు అన్న బలమైన ముద్ర వేసుకోగలిగారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కుటుంబంలో తుర్లపాటి ఇంటిపెద్ద వంటి వారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను స్థాపించి నటీనటులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించేవారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డులు ప్రవేశపెట్టటానికి కుటుంబరావు ఇచ్చిన అవార్డులే ప్రేరణ. అక్కినేని నాగేశ్వరరావుకి 1957లో ‘నటసామ్రాట్’ బిరుదుని, హీరో కృష్ణకి ‘సూపర్ స్టార్’ బిరుదుని ఇచ్చింది కుటుంబరావే. నేషనల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, నంది అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా, ‘జ్యోతిచిత్ర’ ఎడిటర్‌గా, నేషనల్ ఫిల్మ్ అడ్వైజర్‌గా వివిధ హోదాలలో పనిచేశారు.

తుర్లపాటి బహుముఖ ప్రతిభకు ‘ఉపన్యాస కేసరి’, ‘దశ సహస్ర సభా కేసరి’ అనే బిరుదులు; ఆంధ్రా యూనివర్సిటీ వారి ‘కళా ప్రపూర్ణ’, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్’ అవార్డ్, ముట్నూరి కృష్ణారావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్, అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ‘ఇంటర్నేషనల్ మాన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు వరించాయి. 2002లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అందుకున్న ఏకైక తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు కలం నుంచి జాలువారిన రచనలు కలకాలం నిలిచే ఉంటాయి. ఆయన గళం తెలుగు భాష ఉన్నంతవరకూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయనకు జననమే కానీ మరణం లేదు. తుర్లపాటి జీవించు ప్రజల నాలుకల యందు.. తుర్లపాటి కుటుంబరావు జీవితచరిత్ర భావితరాలకు అందేలా పునర్ముద్రించాలని, ఆయన పేరుతో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని ఒక జర్నలిస్టుగా ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాను.

-చల్ల మధుసూదనరావు ,జర్నలిస్ట్

Updated Date - Aug 09 , 2025 | 04:31 AM