Reclaiming the Local: ఆర్థిక వ్యవస్థ స్థానికీకరణ
ABN, Publish Date - Sep 12 , 2025 | 06:11 AM
నేను నెహ్రూ భారత్ బిడ్డను. ప్రపంచీకరణ పవనాలు ఆగమించక ముందు భారతీయ సమాజం ఆర్థిక, సామాజిక...
నేను నెహ్రూ భారత్ బిడ్డను. ప్రపంచీకరణ పవనాలు ఆగమించక ముందు భారతీయ సమాజం ఆర్థిక, సామాజిక స్వరూప స్వభావాల గురించి నా పుస్తకం ‘The Rise of the Neo-Locals : a generational reversal of globalisation’లో విపులంగా జ్ఞాపకం చేసుకున్నాను. నా ఆరు దశాబ్దాలకు పైగా జీవితంలో ప్రపంచ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమయిందో అక్కడకే ఎలా తిరిగివచ్చిందో నేను చర్చించాను. నా బాల్యంలో ఆర్థికాభివృద్ధి విషయమై భారతదేశ దార్శనికత స్వావలంబనకు, దేశీయ వస్తూత్పత్తి రంగాలలో పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చేది; నా తొలి యవ్వనంలో దేశ ఆర్థిక రంగంలోకి ప్రపంచ వాణిజ్య సంస్థ, స్వేచ్ఛా వాణిజ్యం ప్రవేశించాయి. తత్ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమవడం ప్రారంభమయింది; దరిమిలా ఎగుమతుల ఆధారిత ప్రపంచీకరణ అనేది ఆర్థికాభివృద్ధికి బంగారు ప్రమాణంగా పరిణమించింది. వాషింగ్టన్‌లోని శ్వేత సౌధానికి డోనాల్డ్ ట్రంప్ రెండో రాకడతో ఆ అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో ఇప్పుడు అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయి.
అమెరికా ప్రజల వినియోగం అపారమైనది. ఈ కారణంగానే ట్రంప్ అనేక దేశాలతో (తన షరతుల ప్రకారం) వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్రపంచ జనాభాలో 4 శాతం మాత్రమే ఉన్న అమెరికా జనాభా ప్రపంచ గృహ సంబంధ సరుకుల వినియోగంలో ఆ దేశం వాటా 30 శాతం మేరకు ఉన్నది! అమెరికాతో పోలిస్తే చైనా వినియోగం తక్కువగా ఉన్నది. ప్రపంచ జనాభాలో చైనా జనాభా 17 శాతం ఉండగా ప్రపంచ వినియోగంలో ఆ దేశం వాటా 12 శాతంగా ఉన్నది. ఈ వినియోగ చిక్కు ప్రశ్నను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది మన భవిష్యత్తు నిర్ణాయక అంశం. వాస్తవమేమిటంటే అమెరికా తరహా వినియోగం వనరులు పరిమితంగా ఉన్న, కార్బన్ ఉద్గారాలు అత్యధికంగా ఉన్న సమాజాలలో సాధ్యంకాదు. ఈ ధరిత్రిపై ప్రతి ఒక్కరూ అమెరికన్‌లా జీవించాలంటే ప్రపంచానికి మరెన్నో భూగ్రహాలు అవసరమవుతాయని విజ్ఞులు అనే మాట పూర్తి సత్యం. వినియోగ ఆధారిత ఆర్థికాభివృద్ధి నమూనా పర్యవసానాలను ఎదుర్కోకుండా వాతావరణ మార్పు సమస్యను అధిగమించడం గురించి చర్చించలేము. అదే సమయంలో ఆర్థికాభివృద్ధి సాధనకు సరుకుల వినియోగం చాలా ముఖ్యం అనే వాస్తవాన్ని విస్మరించకూడదు.
మరి మన ముందున్న మార్గమేమిటి? వినియోగానికి సంబంధించిన చిక్కు ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ఒక దేశంలోని సంపద పంపిణీ మరింత పెంచడానికి ప్రాధాన్యమిస్తుంది. తద్వారా వినియోగం అన్నది కొద్ది మంది సంపదకు సంబంధించినది కాకుండా అత్యధిక ప్రజల సంక్షేమ సంబంధితమవుతుంది. ‘పేదల చేతుల్లో డబ్బు ఉన్నంతవరకు వారు వివిధ సరుకుల ‘వినియోగదారులు’ అవుతారు’ అన్నది ఎవరూ కొట్టివేయలేని సత్యం. రెండోది ఆర్థిక వ్యవస్థను స్థానికీకరణ చేసుకోవల్సిన ఆవశ్యకత. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజల కోసం పెద్ద ఎత్తున వస్తూత్పత్తి చేయడం కాకుండా ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులు అన్నిటినీ స్థానికంగా తయారు చేసుకోవడం. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుని దేశీయ, ప్రపంచ మార్కెట్ల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించుకోవాలి. గాంధీజీ చెప్పింది ఇదే కదూ? ఆధునిక, స్వావలంబన ఆర్థిక వ్యవస్థకు ఇదే పునాది కావాలి. స్థానిక వనరుల ఆధారంగా స్థానికంగా ఎంత అభివృద్ధి సాధిస్తామో వాతావరణ మార్పు వైపరీత్యాలను అంత సమర్థంగా ఎదుర్కోగలుగుతాము. బకాసుర వినియోగ మనస్తత్వాన్ని త్యజించాలి. స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే జీవనాధారాలను కాపాడే కొత్త హరిత భవిష్యత్తును నిర్మించుకోవాలి. మరి మనం ఇందుకు సుముఖంగా ఉన్నామా?'
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’
డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
Updated Date - Sep 12 , 2025 | 06:11 AM