ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chalasani Prasad: అనేక తరాల విప్లవ ఆత్మీయుడు

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:52 AM

చలసాని ప్రసాద్ జ్ఞాపకంగా మారి పదేళ్లు. ఎప్పటికీ నిలిచి ఉండే అరుదైన ఆయన వ్యక్తిత్వానికి..

లసాని ప్రసాద్ జ్ఞాపకంగా మారి పదేళ్లు. ఎప్పటికీ నిలిచి ఉండే అరుదైన ఆయన వ్యక్తిత్వానికి, ఆచరణకి కాలపు లెక్కలతో నిమిత్తం లేదు. దేశవిభజనకి ముందునుంచీ తెలుగు సమాజం మీద ప్రభావం చూపుతూ వస్తున్న కమ్యూనిస్ట్ తాత్విక భావధారలో భాగం ‘సీపీ’. కృష్ణా జిల్లాలో తొలితరం కమ్యూనిస్ట్ బాల సంఘాలలో చేరి పనిచేయడం, చిన్న వయసులోనే పేద ప్రజల పోరాటాలను సపోర్ట్ చేస్తూ పాటలు రాయడం, తెలంగాణ సాయుధ పోరాటంలో కుటుంబ సభ్యులని పోగొట్టుకోవడం, తన చుట్టూ ప్రభావశీలురైన నాయకులు, సాహిత్యకారులు ఉండడం వంటి అనేకానేక అంశాలు ఆయన జీవితాన్ని ‘సమసమాజ ఆకాంక్ష’ మీద ఎటూ తొణికిపోకుండా నిలబెట్టాయి. నమ్మిన రాజకీయాలకి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చుట్టూ అసంఖ్యాక ఆప్తుల మరణాలు ఎదురైనా- విప్లవమే ఆయనని ఓదార్చింది, తీర్చిదిద్దుకుంది, చేయి పట్టుకుని నడిపింది. అందుకు అనుగుణంగా తన మేధను, హృదయాన్ని నిరంతరం సిద్ధంగా ఉంచడమే ఆయన వ్యక్తిగత ఆచరణ.

శ్రీకాకుళ గిరిజన పోరాటం జరిగే సమయానికి సీపీ విశాఖపట్నంలో ఉన్నారు. స్వతహాగానే దాని ప్రభావాన్ని అందిపుచ్చుకున్నారు. పోరాటం గిరిజన ప్రాంతాలలో వాటి సరిహద్దుల్లో జరిగినా, దాని ప్రభావ కేంద్రం విశాఖపట్నమే. గిరిజన పోరాటం నుంచి మొదలుపెట్టి నక్సల్బరీ ప్రభావంతో తదనంతర కాలంలో ఏవోబీ తదితర ప్రాంతాల్లో విస్తరించిన మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల సానుభూతిపరుడిగా, విప్లవోద్యమానికి మద్దతు సంపాదించడానికి విశాఖ కేంద్రంగా పనిచేసారు. ఆయన ఇల్లే మేధాకేంద్రంగా మారిపోయింది. దాదాపు అయిదు దశాబ్దాల పాటు విశాఖ అవుట్ పోస్ట్‌ని కాపాడిన విప్లవ కార్యకర్త ఆయన.

శ్రీశ్రీ షష్టిపూర్తి సభలు, వాటి రద్దు, విరసం ఆవిర్భావం, ఆ సంస్థలో శ్రీశ్రీ, కొకు, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితలు చేరడం... వీటన్నిటి వెనుకా చోదక శక్తులుగా పని చేసినవారిలో చలసాని ప్రసాద్ చాలా ముఖ్యులు. విరసంలో, పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు, ఫలితంగా తీసుకునే నిర్ణయాల పట్ల నిబద్ధంగా ఉంటూనే ఆయా రాజకీయ నిర్మాణ అంశాల కఠిన ప్రభావాలను వ్యక్తిమాత్రుల మీద చూపేవారు కాదు. మనుషుల మీద, వారి ఆచరణల మీదా తీర్పులు ఇవ్వకపోవడమే కాదు, ఉన్నంతలో వారిని కాపాడుకోవాలని తాపత్రయపడేవారు. మనుషుల అభిప్రాయాలు మారడమో, స్థానాలు మారడమో, వైఖరులు మారడమో జరిగినపుడు వారిని పోగొట్టుకోకూడదు, వారిలో ఎంత ఉంటే అంత, ఉన్నంతలో నిలబెట్టుకోవాలని అనుకునేవారు. శ్రీశ్రీ విరసంలోనే కొనసాగడం కోసం సీపీ పడిన తపన ఇందుకు ఉదాహరణ. మహామహులుగా పేరు పొందిన రచయితలు అనేక కారణాల రీత్యా విప్లవ రాజకీయాలకి దూరం జరిగినా, దాన్ని బాహాటంగా తీవ్రంగా ప్రకటించకపోవడం, ఏదో మేరకి అభ్యుదయ, విప్లవ ఉద్యమాలకి సపోర్ట్‌గా నిలబడటం వెనుక ఆయా రచయితల నిబద్ధతతో పాటు చలసాని ప్రసాద్ ముద్ర చాలా ఉంది. ఎవరైనా సమాజానికి ఏ కొద్దిగానైనా ఉపయోగపడతారు అనుకుంటే ఆ వ్యక్తి చుట్టూ ఉండే సమస్త ప్రపంచంతో అనుబంధం పెంచుకుంటారు సీపీ. వారి మార్గాన్ని సుసాధ్యం చేయడానికి ఉండే అడ్డంకులతో ఓపికగా సంభాషణ చేస్తారు. అంతటి ఎనర్జీ చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. సాహిత్యం, విప్లవ రాజకీయాలతో ఏమీ సంబంధం లేనివారు కూడా సీపీ ఏ పని అడిగితే అది చేయడానికి ఇష్టపడేవారు. మనుషుల్ని విప్లవ సానుభూతిపరులుగా మార్చడానికి ఆయన ఎంచుకున్న మార్గం ప్రేమ, మానవీయ సంభాషణ. ఒక వ్యక్తి తన జీవితకాలంలో వంద మానవ సంబంధాలను నిర్వహించగలరు అనుకుంటే సీపీ అంతకు పది రెట్లు. ఈ ఓపికకి కారణం విప్లవోద్యమం పట్ల ఉన్న ప్రేమ మాత్రమే కాదు, మనుషులు కావాలి, జన సందోహమే ఆయన ఊపిరి.

ఆయన ఆచరణ పద్ధతులు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కమ్యూనిస్ట్ సమాజంలో స్త్రీ పురుషులు సమానం కనుక స్త్రీల స్నేహం పట్ల చాలా విలువగా, గౌరవంగా ఉండేవారు. కృష్ణాబాయితో ఆయన స్నేహం దాదాపు అర్ధ శతాబ్ది పైన. అరమరికలు ఎరుగని మంచి మిత్రులుగా కలిసి చేసిన కార్యక్రమాలు, రచనలు, సంపాదకత్వ బాధ్యతలు అనేకం. అలాగే ఆయన ఇంటికి వెళ్లినవారికి తెలుసు ఆయన ఎన్నడూ ఇంటికి తాళాలు వేసి ఎరుగరు. అనేక మేధా చర్చలు, పుస్తకాలు రెక్కలు ఆహ్వానం పలుకుతాయి. ఇష్టపడి వచ్చేవారికి ఆ ఇల్లు ఎపుడూ ‘నో’ చెప్పలేదు. ఇస్త్రీ లేని ఉతికిన బట్టలు, సాదా చెప్పులు, నల్లటి స్ట్రాప్ ఉన్న చిన్న వాచీ, కొద్దిగా ఊగుతూ నడుస్తూ, వెస్పా బండి మీద ఎక్కడ, ఎవరు, ఏ కార్యక్రమానికి పిలిచినా రయ్యిన వాలిపోయేవారు. ఎనభై మూడేళ్ల వయసుని కూడా అంత సార్థకం చేసిన చలసాని ప్రసాద్ వంటివారిని గుర్తు చేసుకోవడం కూడా ఒక పుస్తకం చదివినట్లే. అన్ని తరాల వారితో ఇట్టే కలిసిపోగల చాతుర్యం, నిమ్మళమైన నవ్వు మొహం, నొప్పించకుండా ఒప్పించే నేర్పు, నమ్మినదాని పట్ల తిరుగులేని నిబద్ధత, మనుషులంటే అవధులు లేని ప్రేమ, పుస్తకాల విలువని నిజార్థంలో గుర్తించి అపురూపమైన లైబ్రరీని తయారు చేసిన చదువరి, సాయం చేయడానికే పుట్టినట్లు ఉండే అపురూపమైన మిత్రుడు, తన చుట్టూ ప్రపంచాన్ని ప్రేమ, విప్లవాలతో ముడివేసిన గొప్ప మానవుడి జ్ఞాపకాలను మరొక్కసారి మనసారా హత్తుకుంటూ...

-కె.ఎన్. మల్లీశ్వరి

Updated Date - Jul 26 , 2025 | 12:52 AM