ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The Sanghi Sentiment: సంఘీ భావం

ABN, Publish Date - Aug 16 , 2025 | 04:57 AM

బ్రిటిష్‌ వలసపాలననుంచి విముక్తిపొందిన తొలి ఏడాది అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ఎర్రకోట ప్రసంగం డెబ్బైరెండు నిముషాలు సాగిందట..

బ్రిటిష్‌ వలసపాలననుంచి విముక్తిపొందిన తొలి ఏడాది అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ఎర్రకోట ప్రసంగం డెబ్బైరెండు నిముషాలు సాగిందట. చరిత్రలో నిలిచిపోయే చక్కని ప్రసంగమని దానిని ఇప్పటికీ కీర్తిస్తున్నవాళ్ళున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ నిడివిని ఎప్పుడో దాటేశారు. ప్రధాని అయిన తొలిసంవత్సరం నరేంద్రమోదీ 65నిముషాలు మాత్రమే మాట్లాడారు. మరుసటి ఏడాదిలోనే నెహ్రూను ఓ పదహారు నిముషాలు దాటేశారు. 2016లో 96 నిముషాలు మాట్లాడిన మోదీ, 2017లో 56 నిముషాలకే స్వస్తి చెప్పేశారు. తన ఎర్రకోట ప్రసంగాలు మరీ పొడుగ్గా ఉంటున్నాయని జనం లేఖలు రాయడంతో వాటిని కుదించాలని నిర్ణయించుకున్నట్టు ఆ ఏడాది ‘మన్‌ కీ బాత్‌’లో మనసు విప్పారు. అయితే, ఆ తరువాత ఆయన ఆ మాటమీద నిలబడిందేమీ లేదు. చివరకు సొంతపార్టీ బలం 240కు పడిపోయి, కూటమి కట్టాల్సివచ్చినప్పటికీ, గత ఏడాది తన 11వ ఎర్రకోట ప్రసంగాన్ని అంతకుముందు పది ప్రసంగాల రికార్డులను చెరిపివేస్తూ సుదీర్ఘంగా చేశారాయన. ఈ ఏడాది ఏకంగా 103 నిముషాల సుదీర్ఘప్రసంగంతో గత ప్రధానమంత్రుల రికార్డులన్నీ చెరిపేశారు, ప్రసంగాల సంఖ్యలో ఇందిరను దాటేశారు.

మోదీ ఏం మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఉద్వేగం, ఉద్రేకం మేళవించి ఆహూతులను ఆకట్టుకోగలరాయన. మోదీ ఎర్రకోట ప్రసంగాల్లో విషయం తగ్గుతోందని గిట్టనివారు అంటారు కానీ, ఈ మారు అత్యధికులకు ఆయన స్వరవిన్యాసం కొత్తగా అనిపించింది. తన ప్రసంగంలో ఆయన ఆపరేషన్‌ సిందూర్‌కూ, తదనంతర పరిణామాలకు అధికప్రాధాన్యం ఇవ్వడం సహజం. ప్రతీకారేచ్ఛతో, వీరావేశంతో ఆరంభించిన యుద్ధాన్ని వెంటనే నిలిపివేయడం మీద రేగిన విమర్శలను అటుంచితే, ట్రంప్‌ అలకలూ ఆగ్రహాలూ, సుంకాల యుద్ధాల వరకూ సాగిన పలు పరిణామాల నేపథ్యంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోదీ ఈ వేదికమీదనుంచి వాటిని ప్రస్తావించక తప్పలేదు. శత్రువుగా మారిన ట్రంప్‌ భారత్‌మీద దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో, జాతీయవాదాన్నీ, దేశభక్తినీ రగల్చడం అవశ్యకమని మోదీ అనుకున్నారు. ఆసిమ్‌ మునీర్‌ వంటివారు ఎగిరెగిరిపడుతున్ననేపథ్యంలో, అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదన్నారు మోదీ. పహల్గాంలో పర్యాటకులను కాపాడలేకపోయారన్న అప్రదిష్ఠకు తోడుగా ‘సిందూర్‌’ సందర్భంలో పాక్‌ క్షిపణి, డ్రోన్‌దాడుల అనుభవం కూడా ఉన్నందున, యావత్‌ దేశాన్ని రక్షించడానికి ఆయన సుదర్శన చక్రాన్ని సిద్ధం చేయిస్తున్నారు. పాకిస్థాన్‌కు సింధుజలాలను ధారాదత్తం చేశారంటూ నెహ్రూను తప్పుబడుతున్నవారు ఇంతకాలం దానిని ఎందుకు సరిదిద్దలేదో తెలియదు. రక్షణరంగంలో స్వయం సమృద్ధి, మేడిన్‌ ఇండియా బలం సిందూర్‌ విజయానికి దోహదం చేశాయని మెచ్చుకుంటున్నప్పుడైనా ప్రధానికి నెహ్రూ దార్శనికత గుర్తుకువచ్చిందో లేదో. గగనయాన్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రధానులు వేసిన పునాదులు గుర్తుకువస్తే బాగుండేది. మేడిన్‌ ఇండియా చిప్‌ గురించి మోదీ చేసిన ప్రస్తావనలు విన్న విదేశీయులకు భారత్‌ పదేళ్ళక్రితమే కళ్ళుతెరిచిందన్న భ్రమ కలగవచ్చు. తన పాలన అద్భుతమని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ, గతమంతా శూన్యమని ఇలా నిందలకు పాల్పడటం సముచితం కాదు.

ఎర్రకోటమీద నుంచి ఫలానా విషయాలు మాట్లాడకూడదనో, రాజకీయం చేయకూడదనో నియమం ఏమీ లేదు. మోదీ ఆరెస్సెస్‌నూ, దాని వందేళ్ళ సేవలను మెచ్చుకున్నారు, , దేశనిర్మాణంలో పాలుపంచుకుందని ప్రశంసించారు. పంద్రాగస్టు ప్రసంగంలో ప్రస్తుతిస్తున్నారు కనుక, స్వాతంత్ర్యోద్యమంలో దాని పాత్ర ఏమిటో చెప్పమంటూ విమర్శలూ ప్రశ్నలూ మొదలైనాయి. మోదీ ఉండగా తమకు ఇక ఆరెస్సెస్‌ అక్కరలేదని బీజేపీ నేతలు ఎగిరిపడుతూండటంతో, ఆరెస్సెస్‌ సహాయనిరాకరణతో బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో తన కాళ్ళమీద తాను నిలబడలేకుండా చేసిందని అంటారు. ఆ తరువాత తప్పు గ్రహించి, నాగపూర్‌ పర్యటనలతో లెంపలేసుకుంటే కానీ మహారాష్ట్ర సహా మరికొన్ని అసెంబ్లీలు బీజేపీ ఖాతాలోకి రాలేదు. ఒక్కరే ఎంతకాలం ఏలుతారు, డెబ్బైఐదేళ్ళుకు దిగాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా వినవస్తున్న నేపథ్యంలో, దేశానికి వందనం చేయాల్సిన ఎర్రకోటమీదనుంచి ఆరెస్సెస్‌కు అభివాదం అందించిన ఫలితం రాబోయేరోజుల్లో పలువిధాలుగా ఉండవచ్చు, విజయాలు చేకూర్చవచ్చు.

Updated Date - Aug 16 , 2025 | 04:57 AM