ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shahs Remarks on Salwa Judum Verdict: సల్వాజుడుం తీర్పుపై రాజకీయ దాడి

ABN, Publish Date - Aug 27 , 2025 | 12:18 AM

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎన్డీఏ కూటమికి ఆందోళన కలిగిస్తున్నట్లుంది. లేదంటే సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోం మినిస్టర్ అంత తీవ్రంగా ఆరోపణలు చేయవలసిన...

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎన్డీఏ కూటమికి ఆందోళన కలిగిస్తున్నట్లుంది. లేదంటే సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోం మినిస్టర్ అంత తీవ్రంగా ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి నక్సలైట్ల మద్దతుదారు అనీ, అందుకే సల్వాజుడుంను నిషేధిస్తూ తీర్పు ఇచ్చారనీ, ఈ తీర్పు ఇవ్వకపోతే 2020 వరకే దేశంలో నక్సలిజం అంతం అయ్యేదనీ హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులలో లోపాలు ఉంటే ఎత్తి చూపడం తప్పు ఏమీ కాదు. కానీ ఎటువంటి ఆధారాలూ చూపకుండా, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఉద్దేశాలను అంటగడుతూ వ్యక్తిగత దాడి చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాగల నేరం! ఇంతకూ సల్వాజుడుం అంటే ఏమిటో, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుదర్శన్‌రెడ్డి దానిపైన ఇచ్చిన తీర్పు ఏమిటో ఒకసారి చూద్దాం. 2005లో బస్తర్‌లో నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కొంతమంది స్థానిక ఆదివాసీ యువకులను చేరదీసి, వారికి తుపాకులు ఇచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్‌పీఓలు)గా నియమించింది. వీరూ, స్థానిక పెత్తందారులూ కలసి మావోయిస్టు పార్టీకి చెందిన సంఘాలు ఉన్న గ్రామాలపైన దాడులు చేశారు. హత్యలు, అత్యాచారాలు చేశారు. గ్రామాలకు గ్రామాలను తగులబెట్టారు. బలవంతంగా దాదాపు లక్ష మంది ఆదివాసీలను ‘సల్వాజుడుం శిబిరాలు’ పేరిట కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి వేధించారు. ఒక లెక్క ప్రకారం రెండేళ్ళలో 600 గ్రామాలను తగులబెట్టి, 23 సల్వాజుడుం శిబిరాలలో యాభై వేలమంది ప్రజలను బలవంతంగా ఉంచారు. ఈ ఎస్‌పీఓల నాయకత్వంలో జరిగిన ఈ దాడులకు ‘సల్వాజుడుం’ అని పేరు పెట్టారు. ఈ పదానికి ‘శాంతి కొరకు పోరాటం’ అని అర్థం చెప్పుకున్నారు. కానీ దాని అసలు అర్థం బలి కోసం చేసే వేట. సల్వాజుడుం వలన హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని స్థానిక పత్రికలు ఎన్నో వార్తలు ప్రచురించాయి. దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేశాయి.

2007లో సల్వాజుడుం వ్యవహారాలను, దానికి ప్రభుత్వ మద్దతును సవాలు చేస్తూ ప్రముఖ విద్యావేత్త నందినీ సుందర్; సుప్రసిద్ధ విశ్రాంత పాలనాధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ; చరిత్ర పరిశోధకులు రామచంద్ర గుహ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుదర్శన్‌రెడ్డి, సహ న్యాయమూర్తి సురేందర్ సింగ్ నిజ్జర్‌లు కలిసి సుదీర్ఘమైన వాదప్రతివాదాలు విన్న తర్వాత, 2011లో సల్వాజుడుం పైన చరిత్రాత్మకమైన తీర్పును ఇచ్చారు. తుది తీర్పు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌సింగ్‌ నిజ్జర్‌లు మాత్రమే గాక, అంతకు ముందు విచారించిన న్యాయమూర్తులు– జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్ కపాడియా, జస్టిస్ అఫ్తాబ్ అలంలు కూడా ప్రభుత్వమే ప్రజలకు ఆయుధాలు ఇచ్చి హింసకు ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేశారు. ఏమీ తెలియని ఆదివాసీ యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా చేసి, వారికి ఆయుధాలను ఇచ్చి మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ముందు నిలబెట్టడాన్ని ఈ తీర్పు తప్పుపట్టింది: ‘‘వారిని కేవలం తాత్కాలికంగా నియమించడం, గౌరవవేతనం మాత్రమే ఇవ్వడం ఆర్టికల్స్ 21, 14లను భంగపరచడమే! వారికి సాధారణ పోలీసులతో సమానమైన బాధ్యతలు ఇచ్చి, వారికన్నా ప్రమాదకరమైన పరిస్థితులలో నిలబెట్టి ఈ విధులు నిర్వర్తించడం ఆర్టికల్ 14కు వ్యతిరేకం. ఇతర పోలీసుల కన్నా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సిన ఈ ఎస్‌పీఓలకు వారి కంటే తక్కువ వేతనం ఇవ్వడం వారి జీవితం విలువను కించపరచడమే! వారి పేదరికాన్నీ, ఆవేశాన్నీ, క్రూర సామాజిక స్థితికి బాధితులై పగతీర్చుకోవాలన్న వారి తపననీ వాడుకుని ఆ యువకులను ప్రమాదకరమైన ఇలాంటి పనుల్లో నియమించడం అంటే– వారి మనోభావాలను దుర్వినియోగం చేయడమే!’’ అని ఈ తీర్పు నిర్ధారించింది. ‘నక్సలైటు వ్యతిరేక ఫిరంగులకు ఈ ఆదివాసీ యువకులను గ్రాసంగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వాడుకుంటున్నదా?’ అని కూడా ప్రశ్నించింది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలు విద్యార్థులకు చెందిన స్కూళ్లను, హాస్టళ్లను, అంగన్వాడీ భవనాలను వెంటనే ఖాళీ చేయాలని కూడా కోర్టు తన తీర్పులో చెప్పింది. దీనిపై స్పందిస్తూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం భద్రతాదళాల స్వాధీనంలో ఏ భవనాలూ లేవనీ, అన్నిటినీ ఖాళీ చేశామనీ చెప్పింది. కాని పరిశీలనలో ఆ భవనాలన్నీ భద్రతాదళాల స్వాధీనంలోనే ఉన్నాయని తేలింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విడిగా మరో ప్రమాణ పత్రం సమర్పించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి సమయాన్ని కోరింది. సుప్రీంకోర్టు వల్లనే భద్రతా బలగాలు ఇతర ప్రభుత్వ విభాగాల భవనాలను ఖాళీ చేశాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఛత్తీస్‌గఢ్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకం ఆగిపోవటం వల్లనే నక్సలిజం కొనసాగింది అన్నది అమిత్ షా ఆరోపణ. కానీ ఈ తీర్పుతో ఎస్‌పీఓల వ్యవస్థ ఆగిపోలేదు. ప్రత్యేక ఛత్తీస్‌గఢ్‌ పోలీసు చట్టాన్ని తీసుకువచ్చి రకరకాల పేర్లు మార్చి, రూల్స్‌ మార్చి అటువంటి వ్యవస్థలనే ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఎస్‌పీఓల వ్యవస్థ ఆ తర్వాత డీఆర్‌జీగా అవతారం ఎత్తింది. కాబట్టి అమిత్ షా ఆరోపణలకు ఎటువంటి ఆధారమూ లేదు. ఈ వ్యవస్థ ఆగలేదు కాబట్టే– సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని నందినీ సుందర్, రామచంద్ర గుహ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి స్పందిస్తూ సుప్రీంకోర్టు జూలై 24, 2012లో ప్రస్తుత పరిస్థితిని వివరించాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం తను చేయాలనుకున్నదే చేసింది. ఎంతో అనుభవం ఉన్న న్యాయవాదుల బృందం, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు, సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, ఒక చరిత్రాత్మకమైన తీర్పు... ఇవేవీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను ఆపలేకపోయాయి.

ఇంతకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నక్సలైట్ల పక్షం తీసుకున్నారనే వాదనలో నిజం ఎంత ఉన్నదో వారు ఇచ్చిన తీర్పులోని మరొక భాగం చూస్తే అర్థమవుతుంది. తీర్పులోని 68వ పాయింట్ ఇలా చెబుతోంది: ‘‘మావోయిస్టు లేదా నక్సలైట్ హింస వల్ల ఛత్తీస్‌గఢ్‌ రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నది వాస్తవమేనని మేము గుర్తించాం. ఎన్నో సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కొన్ని విధానాలు నక్సల్ హింసకు కారణం అయినప్పటికీ, నక్సలైట్ హింసను మేము క్షమించలేం. రాజ్యాన్ని కూలదోయడం, రాజ్య ప్రతినిధులను చంపడం, అమాయక పౌరులను హింసించడం అంటే చట్టబద్ధమైన జీవన విధానాన్ని ధ్వంసం చేయడమే. ఇటువంటి హింసాయుత తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడిన దేశ ప్రజలకు భద్రత కల్పించవలసిన నైతిక రాజ్యాంగపరమైన బాధ్యత రాజ్యంపైన ఉంది. ఇది ప్రాథమిక అవసరం అని కూడా మేము భావిస్తున్నాం’’. తీర్పులోని ఈ చిన్న భాగం చూసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నక్సలైట్ల పక్షం వహించారన్న ఆరోపణలు అవాస్తవాలని తెలిసిపోతుంది. అమిత్ షా ఆరోపణ ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే.

-లంకా పాపిరెడ్డి

Updated Date - Aug 27 , 2025 | 12:18 AM