ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dr K Muthyam: ఉద్యమ సాహిత్యానికి జీవగర్ర

ABN, Publish Date - Aug 20 , 2025 | 05:50 AM

తెలుగు సాహిత్యంలో ఉద్యమ సాహిత్యానికి ప్రత్యేక స్థానం కల్పించిన ప్రముఖ పరిశోధకుడు, రచయిత డా కె ముత్యం..

తెలుగు సాహిత్యంలో ఉద్యమ సాహిత్యానికి ప్రత్యేక స్థానం కల్పించిన ప్రముఖ పరిశోధకుడు, రచయిత డా. కె. ముత్యం మన మధ్య నుంచి భౌతికంగా దూరమై నేటికి సంవత్సర కాలం. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా చైతన్యాన్ని రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు. ఆయన జీవితం, రచనలు, పరిశోధనలు అన్నీ తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. 1958 ఏప్రిల్ 14న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాచనపల్లిలో జన్మించిన ముత్యం తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, ఫిలాసఫీ, లింగ్విస్టిక్, ఎంఈడీ, ఎల్ఎల్‌బి విద్యను అభ్యసించి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్సులో శిక్షణ పొందాడు. అనేక కష్టనష్టాలను ఓర్చి ఆఖరికి శాతవాహన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తొమ్మిదేళ్ళపాటు సేవలు అందించాడు. ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్‌యూ అభ్యర్థిగా 1981–82లో ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్‌గా గెలుపొందాడు. అప్పట్లో ఆర్ట్స్‌ కాలేజి ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యేతో సమానమైన గుర్తింపు ఉండేది. ముత్యం విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యే నాటికి బీసీ, ఈబీసీలకు ప్రభుత్వం స్కాలర్షిప్‌లు ఇచ్చేది కాదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను కూడగట్టి ఉద్యమాన్ని లేవదీసి ప్రభుత్వం దిగొచ్చేలా చేసి, విద్యార్థుల డిమాండ్లను పరిష్కరింప చేశాడు. మొట్టమొదటగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్‌లు రావడంలో విద్యార్థి నాయకుడిగా ముత్యానిది కీలక పాత్ర. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బయ్యా సూర్య నారాయణ పర్యవేక్షణలో ‘‘శ్రీకాకుళ ఉద్యమం–సాహిత్యంపై దాని ప్రభావం’’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి పట్టా పొందారు. ఈ పరిశోధన ద్వారా ఉత్తరాంధ్రలో జరిగిన ప్రజా ఉద్యమాలు, వాటి సాహిత్య ప్రతిబింబాలను చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాల్లో విశ్లేషించారు. ఈ పరిశోధనకోసం క్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడింది. పరిశోధన అనంతరం అందుకోసం రికార్డు చేసిన ప్రజా చైతన్య జీవితాలు, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, జానపద ఘట్టాలు తన రచనల రూపంలో జీవం పోసుకున్నాయి. ఈ పాయలో నుంచి వచ్చినవే– ‘శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం’, ‘సునాముది జీవధార’, ‘గరిమెళ్ళ సాహిత్యం – జాతీయోద్యమం’ (రెండు సంపుటాలు), ‘సుబ్బారావు పాణిగ్రాహి జీవితం–చరిత్ర’, ‘బంకుపల్లి మల్లయ్యశాస్త్రి జీవిత దృశ్యం’, గంటి రాజేశ్వరరావు జీవితంపై ‘ప్రవహిస్తున్న జ్ఞాపకం’, ‘స్వాతంత్ర్యోద్యమం – గరిమెళ్ళ’, ‘శిల్లా రాజుల రెడ్డి జీవితం – కవిత్వం’, ‘నేను శ్రీకాకుళం జయమ్మను’... మొదలైన రచనలు.

ముత్యం సాహిత్య కృషిని నిశితంగా పరిశీలిస్తే– శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంగా ఎంత రాశారో అంతే ఉధృతంగా తెలంగాణ ప్రాంత సాహిత్య కృషి గురించీ రాశారు. చిందు యక్షగాన కళాకారిణి చిందుల ఎల్లమ్మ జీవితాన్ని ‘నేను చిందుల ఎల్లమ్మను’ పేరుతో రచించారు. ఈ పుస్తకం పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం. కానీ రచయితగా డా. కె ముత్యంను ఇంటర్మీడియట్ బోర్డు గుర్తించకపోవడం విచారకరం. ఇట్లా తెలంగాణ భాషా, చరిత్ర, సామాజిక, సాంస్కృతిక అంశాలపై ఎన్నో పుస్తకాలు తెచ్చారు. అట్లనే ‘చిందుల ఎల్లమ్మ యాది’, ‘తెలంగాణ శాస్త్రాలు’ పేరుతో నిజామాబాద్ ప్రాంత ఐదువేల సామెతలు సేకరించి ముద్రించాడు. ‘శాయరి రామాయణం’ (ప్రాంతీయ సంప్రదాయ సాహిత్యం) కొత్త ఛందస్సును వెలుగులోకి తెచ్చాడు. ఇంకా ‘మట్టి రంగును ఎంచుకున్న కుంచె’, ‘బాచనపల్లి–తెలంగాణలో ఒక గుట్టల కింద పల్లె’, ‘సర్వదేవభట్ల రామనాథం జీవితం’, ‘పిండిప్రోలు’, ‘సోయం గంగులు’, ‘మేర మల్లేశం’, ‘పోరాట పాటలు’, ‘బత్తుల వెంకటేశ్వరరావు జీవన రేఖలు’... ఇవన్నీ తెలంగాణ ప్రాంతం నేపథ్యంగా వచ్చిన రచనలే. నిజామాబాద్ ప్రాంత జానపద పాటలను సేకరించి పెట్టాడు. ఇవి ఇంకా ముద్రణలోకి రావాలి. ఇక శాతవాహన యూనివర్సిటీ తెలుగు విభాగం నుంచి తొమ్మిదేళ్ళ కాలంలో నాలుగు జాతీయ సెమినార్లు నిర్వహించి తెలంగాణ భాషను, చరిత్రను, సంస్కృతిని, అలభ్య గ్రంథాలను, శాసనాలను గ్రంథస్థం చేసాడు. ఆ క్రమంలోనే ఎందరో విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరిశోధనలో శిక్షణ ఇచ్చాడు. బొడ్రాయి, గ్రామ దేవతల ఔన్నత్యాన్ని, అలభ్య గ్రంథాలను, శాసనాలను విద్యార్థుల చేత శోధింపచేశాడు. శాతవాహన యూనివర్సిటీ తెలుగు విభాగం తరఫున ‘ఉత్తర తెలంగాణ సంస్కృతి చరిత్ర’ (2011), ‘నేటి ప్రపంచీకరణలో తెలంగాణ భాష, తెలుగు భాష, గిరిజన భాషలు, ప్రామాణికత–అమలు–అస్తిత్వం’, ‘ఉత్తర తెలంగాణ పల్లె సంస్కృతి– శాతవాహన పరిశోధన వ్యాసాలు’, ‘తెలంగాణలో అలభ్య శాసనాలు, గ్రంథాలు’ (2019) అనే ఉత్తమ గ్రంథాలను ప్రచురించాడు.

అలాగే ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’లో శిక్షణ పొందిన ముత్యం ప్రజా కళాకారుల సాంస్కృతికోద్యమ కృషిని డాక్యుమెంటరీల రూపంలో ప్రజలకు అందించారు. ‘జన జీవన గానం’ పేరుతో ప్రజా కళాకారుడు కానూరి వెంకటేశ్వరరావు జీవితాన్ని చిత్రించాడు. ‘కొండవీడు’ పేరుతో రెడ్డి రాజుల పౌరుషాన్ని, ఔన్నత్యాన్ని నిర్మించాడు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ లఘుచిత్రంగా రెండు నంది అవార్డులు ప్రకటించింది. నిజామాబాద్ ప్రాంత గ్రామ దేవత ‘చిలుకల చిన్నమ్మ’ జాతర మహాత్మ్యాన్ని రికార్డు చేశాడు. అంతే కాదు, సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో జ్వాలాముఖి మొదలైన వారితో ‘శ్రీకృష్ణుని బాల్య క్రీడలు’, ‘బెజ్జమహాదేవి’, ‘తిలక్–ఆర్తగీతం’, ‘శ్రీశ్రీ కవిత్వం’ మొదలైన ఆడియో వీడియో పాఠాలు చెప్పించాడు. వీటిలో కొన్ని టీవీలో ప్రసారమైనాయి. జీవిత చివరి అంకంలో ఆరోగ్యం సహకరించకున్నా, మంచం మీద ఉండి లేవలేని స్థితిలో కూడా మిత్రుల, విద్యార్థుల, కుటుంబ సహకారంతో ఏడెనిమిది పుస్తకాలు రచించాడు. ‘‘మీకు పానం బాగలేకున్న ఎందుకు రాసుడు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా,’’ అని ఎవరైనా అంటే, ‘‘ప్రజా జీవితంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలు వృథా కావడం నాకు ఇష్టం లేదు. నా బాధ్యతగా రాస్తున్న. మనం రాయకపోతే ఇంకెవరూ రాయరు,’’ అని సున్నితంగా బదులిచ్చి, మరణించే వరకు రాస్తూనే ఉన్నారు. ‘‘స్వేచ్ఛ కోసం మృతి చెందినవారు మౌనంగా నిద్రించరు; వాళ్ల స్వరం రచయితల గళంలో ప్రతిధ్వనిస్తుంది’’ అని సల్మాన్ రష్దీ అన్న మాటల్ని నిజం చేసిన గొప్ప రచయిత ముత్యం. ఆయన రచనలపై యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు జరగాలి.

-డా. జీడి రమేష్ (నేడు డా. కె ముత్యం ప్రథమ వర్ధంతి)

Updated Date - Aug 20 , 2025 | 05:50 AM