ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The New Dawn of the Postal Service: కొత్త పొద్దులో తపాలాభారతి

ABN, Publish Date - Aug 24 , 2025 | 12:52 AM

ఘన చరిత్ర కలిగిన తపాలా శాఖ ఎట్టకేలకు నిద్రావస్థను వీడి ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలతో పోటీకి దీటుగా డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తోంది. దశలవారీగా దేశమంతటా పోస్టాఫీసుల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ చేపట్టారు

న చరిత్ర కలిగిన తపాలా శాఖ ఎట్టకేలకు నిద్రావస్థను వీడి ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలతో పోటీకి దీటుగా డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తోంది. దశలవారీగా దేశమంతటా పోస్టాఫీసుల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ చేపట్టారు. నగదు రహిత ఆన్‌లైన్‌ చెల్లింపులకు మార్గం సుగమమైంది. మరోపక్క లాభసాటి కాదనుకుంటున్న రిజిస్టర్డ్‌ పోస్టు విత్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ సర్వీసు ఈ నెలాఖరు నుంచి రద్దు చేస్తున్నారు. గతంలో రద్దు చేసిన రిజిస్టర్డ్‌ బుక్‌పోస్ట్‌ స్థానంలో ఈ ఏడాది మే 1 నుంచి జ్ఞాన్‌ పోస్ట్‌ సర్వీసును ప్రవేశపెట్టారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఇ–కామర్స్‌ తరహాలో ఆదివారాలు, సెలవు రోజుల్లోనూ బట్వాడాకు పథకాలు రచిస్తున్నారు. లాభాలే లక్ష్యం చేసుకోకుండా, సామాన్యుడిపై భారం మోపకుండా సేవల నాణ్యతను పెంచడం ఇప్పుడు తపాలాశాఖ ముందున్న సవాలు. భారతదేశ తపాలా శాఖకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ 1774 మార్చిలో, ఈస్టిండియా కంపెనీ వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం మొదటిసారి తపాలా సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. లార్డ్‌ డల్‌హౌసి 1850లో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు 1854లో పోస్టాఫీస్‌ చట్టాన్ని తెచ్చారు. బెంగాల్‌ ప్రధాన కేంద్రంగా 700 పోస్టాఫీసులు హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేసేవి. సంస్థాన ప్రాంతాలు సహా దేశమంతటా ఒకే టారిఫ్‌, పోస్టల్‌ స్టాంపులతో ఏకీకృత సేవలకు ఈ చట్టం వీలు కల్పించి ఆధునిక తపాలా వ్యవస్థకు పునాది వేసింది. నాటి నుంచి అంచెలంచెలుగా విస్తరిస్తూ దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. తపాల సేవలకే పరిమితం కాకుండా, స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్లు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకూ తపాలా శాఖ ద్వారా సేవలు అందుతున్నాయి.

మారిన అవసరాలు, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని 2023లో ఇండియన్‌ పోస్టాఫీస్‌ చట్టాన్ని కొత్తగా తెచ్చారు. 2024 జూన్‌ 18 నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ద్వారా డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వ ఆమోదంతో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి పోస్టల్‌ డైరెక్టర్‌ జనరల్‌కు అధికారాలు కట్టబెట్టింది. పాత చట్టంలో ప్రతి నిర్ణయానికీ పార్లమెంటరీ ఆమోదం పొందాల్సి వచ్చేది. సిబ్బంది జవాబుదారీకి సంబంధించి కొత్త చట్టంలో వెసులుబాటు కల్పించడంపై ఆక్షేపణలు వచ్చాయి. తపాలా ద్వారా పంపే వస్తువుల నష్టం, ఆలస్యం, సరైన చిరునామాదారుకు చేర్చకపోవడం వంటి పొరపాట్లకు సిబ్బందిని జవాబుదారీతనం నుంచి తప్పించారు. దురుద్దేశపూర్వకంగా తప్పు చేసే వారికి మాత్రం ఇది వర్తించదు. లయబిలిటీ క్లాజును తొలగించడం సిబ్బందిలో ఉపేక్షకు, నిర్లక్ష్యానికీ దారితీయవచ్చనే విమర్శలు వచ్చాయి. సర్వీసుల నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. డిజిటల్‌ చెల్లింపులకు ఇంతకాలానికి పోస్టాఫీసుల్లో వెసులుబాటు కలిగింది. అయితే కొత్త టెక్నాలజీకి పూర్తిగా సిబ్బంది సన్నద్ధం కాకపోవడం, అన్ని పోస్టాఫీసుల్లో అప్‌డేషన్‌ పూర్తికాకపోవడంతో సర్వీసులు నత్తనడకన సాగుతున్నాయి. మరో పక్క యాభై ఏళ్లుగా అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్‌ పోస్ట్‌ విత్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ సర్వీసును 2025 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఉపసంహరించుకుంటున్నారు. ఈ సర్వీసును స్పీడ్‌ పోస్ట్‌లో విలీనం చేస్తున్నట్లు తపాలాశాఖ ప్రకటించింది. ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థ పోటీ కారణంగా రిజిస్టర్డ్‌ పోస్టుల సంఖ్య 25 శాతం తగ్గింది. దీనికి తోడు డిజిటల్‌ ఎడాప్షన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటివరకూ లీగల్‌ నోటీసులను, ఉద్యోగ నియామక పత్రాల వంటి డాక్యుమెంట్లను రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారానే పంపేవారు. ఈ సర్వీసు ద్వారా పొందే ఎక్‌నాలెడ్జిమెంట్‌కు చట్టబద్ధత ఉంది. కోర్టులు కూడా నోటీసు అందినదనడానికి దీన్ని రుజువుగా పరిగణించేవి. స్పీడ్‌ పోస్ట్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌కు ఈ విధమైన చట్టబద్ధత ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. స్పీడ్‌ పోస్ట్‌ టారిఫ్‌, దూరాన్ని బట్టి మారుతుంది. కనుక కస్టమర్లపై అదనపు భారం పడుతుంది.

గతంలో రద్దు చేసిన రిజిస్టర్డ్‌ ప్రింటెడ్‌ బుక్‌ పోస్ట్‌ స్థానే 2025 మే 1వ తేదీ నుంచి జ్ఞాన్‌ పోస్ట్‌ పేరుతో కొత్త పోస్టల్‌ సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. అయితే జ్ఞాన్‌ పోస్ట్‌కు తగినంత ప్రచారం కల్పించకుండా గుట్టుగా ఉంచడంతో రచయితలు, పబ్లిషర్ల వినియోగానికి పూర్తిగా రాలేదు. యూనివర్శిటీలు, గుర్తింపు పొందిన బోర్డుల స్టడీ మెటీరియల్‌ను పోటీ పరీక్షలు రాసేవారు చదివే పాఠ్యపుస్తకాలను జ్ఞాన్‌ పోస్ట్‌ ద్వారా పంపవచ్చు. సామాజిక, సాంస్కృతిక, మత అంశాలతో ప్రచురించిన పుస్తకాలను ఈ జ్ఞాన్‌ పోస్ట్‌ ద్వారా చేరవేయవచ్చు. 300 గ్రాముల వరకు రూ.20తో మొదలయ్యే టారిఫ్‌ 5 కిలోలకు గరిష్ఠంగా రూ.100 వసూలు చేస్తారు. జీఎస్టీ అదనం. పీరియాడికల్స్‌ను మాత్రం అనుమతించరు. రచయితలు, ప్రచురణకర్తలకు కాస్తంత ఊరట కలిగించే జ్ఞాన్‌ పోస్ట్ సర్వీసులకు పలుచోట్ల తపాలా సిబ్బంది మోకాలడ్డుతున్నారు. ఒక పుస్తకం మాత్రమే పంపాలనీ, నాలుగువైపులా బుక్‌ పాకెట్‌ తెరచి ఉంచాలనీ, ఇలా ఎవరికి తోచిన రూల్స్‌ వారు చెప్తూ వేధిస్తున్నారు. ఐదు కిలోల వరకు పంపే వెసులుబాటును నీరుగారుస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ–కామర్స్‌ సంస్థలతో పోటీపడేందుకు తపాలాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఒక షిఫ్ట్‌లోనే పోస్ట్‌మెన్‌ బట్వాడా విధులు నిర్వరిస్తున్నారు. దీన్ని మూడు షిఫ్ట్‌లకు పెంచి, ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా బట్వాడా చేసి ఆదాయం పెంచుకోవాలని తపాలాశాఖ యోచిస్తోంది. దీంతో పాటు ఇతర ఆదాయం పెంపు మార్గాలపైనా తపాలా శాఖ దృష్టి పెట్టనుంది. లాభసాటిగా లేని గ్రామీణ పోస్టాఫీసులను మూసివేయడమో, సమీప పోస్టాఫీసుల్లో విలీనం చేయడమో జరగవచ్చు. అంతగా వినియోగంలో లేని మనియార్డర్‌, పోస్ట్‌కార్డ్‌, ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ మునుముందు రోజుల్లో కనుమరుగు కావచ్చు. శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకాలను చేపట్టి, భవనాల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినప్పుడే తపాలా శాఖ ఆశించిన లక్ష్యాలు సాధించగలదు.

-గోవిందరాజు చక్రధర్‌

Updated Date - Aug 24 , 2025 | 12:52 AM