Nepals First Dawn of Modernity: తొలి ప్రభాతంలో ఆధునిక నేపాల్
ABN, Publish Date - Sep 06 , 2025 | 02:40 AM
మధ్య తరగతి, ఆంగ్ల భాషా ప్రావీణ్య, వృత్తి నిపుణుల కుటుంబాల నేపథ్యమున్న భారతీయులు తమ మాతృభూమేతర దేశాల గురించి తెలుసుకోదలిచినప్పుడు సర్వసాధారణంగా వారి ఆసక్తి పాశ్చాత్య దేశాల పైనే ఉంటుంది...
మధ్య తరగతి, ఆంగ్ల భాషా ప్రావీణ్య, వృత్తి నిపుణుల కుటుంబాల నేపథ్యమున్న భారతీయులు తమ మాతృభూమేతర దేశాల గురించి తెలుసుకోదలిచినప్పుడు సర్వసాధారణంగా వారి ఆసక్తి పాశ్చాత్య దేశాల పైనే ఉంటుంది. సహజంగానే అమెరికా, ఇంగ్లాండ్‌లను వారు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఫ్రాన్స్, ఇటలీ కూడా భారతీయుల శ్రద్ధకు నోచుకుంటాయి.
పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ఆ పాశ్చాత్య దేశాల గురించి చాలా తెలుసుకున్నాను. అదృష్టవశాత్తు నేను పెరిగిన పరిసరాలు నాకు సమీపంలో ఉన్న ఇతర దేశాలపై శ్రద్ధాసక్తులను జనింపచేశాయి. నేను తొలుత ప్రస్తావించిన నేపథ్యం నుంచి వచ్చిన భారతీయులు సాధారణంగా ఈ సమీప దేశాల పట్ల ఉదాసీనవైఖరి చూపడం కద్దు. ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాలతో పాటు నా స్వస్థలం డెహ్రాడూన్ కూడా 18వ శతాబ్ది తుదినాళ్లలో నేపాల్ గూర్ఖా రాజ్యం అధీనంలోకి వెళ్లాయి. గూర్ఖాల నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారి అనేక సైనిక పటాలాలకు డెహ్రాడూన్ ప్రధాన స్థావరంగా ఉండేది. ఆ సైనికులలో అత్యధికులు నేపాలీలు. ఈ కారణంగా డెహ్రాడూడ్‌లో ఉన్న సైనిక పటాలాల పేర్లలో ‘గూర్ఖా’ అనే పదం తప్పనిసరిగా ఉండేది. నా బాల్యంపై నేపాలీ ప్రభావం విస్తృతమైనది, విస్మరించలేనిది.
నేను చదివిన పాఠశాల, 1950ల్లో తమ స్వదేశం నేపాల్ నుంచి పరారై వచ్చిన కులీన రాణాలు స్థాపించింది. మా ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లే మార్గం పొడుగునా నేపాలీ భాషీయుల ఆవాసాలు ఉండేవి. క్రీడలలో నా తొలి ఆరాధ్యుడు నేపాలీ సంతతికి చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ ఆటగాడు రామ్‌బహదూర్ చెట్రి. ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ ముగిసిన అనంతరం కలకత్తా నుంచి డెహ్రాడూన్‌కు వచ్చి మా బాబాయితో కలిసి ఏర్పాటు చేసిన క్రికెట్ క్లబ్‌ను ఆయనే నిర్వహిస్తుండేవారు. ఈ అనుబంధాల కారణంగా యవ్వనంలోను ఆ తరువాత నేను చాలాసార్లు నేపాల్‌ను సందర్శించాను. నా నేపాలీ స్నేహితులలో ఒకరు ఖాట్మండులో ఒక పత్రికా సంపాదకుడుగా ఉన్నాడు.
ఈ అనుబంధాల కారణంగానే, నేపాల్ చరిత్రపై ఇటీవల ప్రచురితమైన ‘Nepal in the Long 1950s’ చాలా ఆసక్తితో చదివాను. ప్రత్యోష్ అన్టా, లోక్‌రంజన్ పరజూలి, మార్క్ లైష్టీ ఈ విశిష్ట గ్రంథ సంపాదకులు. రాణాల పాలన నుంచి నేపాల్ విముక్తమైన అనంతర కాలంలో ఆ హిమాలయ రాజ్యంలో సంభవించిన మార్పులను ఈ పుస్తకంలోని వ్యాసాలు వివరించాయి. 19వ శతాబ్దంలో నేపాల్ రాజకీయాలను శాసించిన రాణాలు స్వతంత్ర ఆలోచనా ధోరణులను, సృజనాత్మక స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించారు. రాణాల పాలనా శృంఖలాల నుంచి బయటపడిన తరువాత నేపాల్‌లో చోటుచేసుకున్న సాంస్కృతిక వికాసాన్ని, సామాజిక మార్పులను ఈ పుస్తకం విపులీకరించింది.
ఖాట్మండులోని చరిత్రాత్మక టీ దుకాణం ‘తిలౌరి మైలాకో పసల్’ గురించి ప్రవాస్ గౌతమ్ రాసిన కథనం ఈ పుస్తకంలోని మొదటి వ్యాసం. తేనేటి సేవనం సంప్రదాయ నేపాలీ సంస్కృతిలో భాగం కాదు. ప్రపంచ యుద్ధాలలో సుదూర దేశాలకు వెళ్లిన గూర్ఖా సైనికులు తమకు అలవాటయిన తేనీటి సేవనాన్ని మాతృభూమికి పరిచయం చేశారు. ప్రస్తావిత టీ షాప్‌కు ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలతో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి అభిమానులు నిత్యం వస్తుండేవారు. రాజకీయ పరిణామాల గురించి చర్చించేందుకు, తమ ఉద్యమ కార్యకలాపాలను నిర్ణయించుకునేందుకు ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు ‘తిలౌరి మైలాకో పసల్’కు వచ్చేవారు. ఇక ఫుట్‌బాల్ ఆటగాళ్లు, మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ అయిపోయిన తరువాత విధిగా అక్కడకు వస్తుండేవారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో పాటు సినిమాల గురించి వారు మాట్లాడుకునేవారని గౌతమ్ రాశారు (ఖాట్మండులో సినిమా థియేటర్లు 1950ల తొలినాళ్లలో ప్రారంభమయ్యాయి).
ఖాట్మండు లోయలోని ఇతర ప్రదేశాలలో టీషాప్‌ల వలే కాకుండా ‘తిలౌరి మైలాకో పసల్’ కస్టమర్లలో అన్ని కులాలవారు ఉండేవారు. దుకాణ యజమానులు అయిన సోదరులు ఉదార భావాలు ఉన్న ప్రగతిశీలురు. అది వారికి వ్యాపార లబ్ధిని సమకూర్చింది. అయినప్పటికీ సంప్రదాయ సామాజిక వివక్షలు కొనసాగుతూనే ఉండేవి. అగ్ర కులాల విద్యావంతులు ఆ విశాల టీ షాప్ లోపల రుచికరమైన తేనేటిని సేవిస్తుండగా కింది కులాల శ్రామికులు సాధారణంగా దుకాణం వెలుపలే టీ తాగి వెళ్లిపోతుండేవారు.
1950ల్లో ఆర్థికాభివృద్ధే ప్రధాన లక్ష్యమయిన తరుణంలో నేపాలీల ఆలోచనలను ‘బికాస్’ లేదా అభివృద్ధి భావన అమితంగా ప్రభావితం చేసిందని బన్దన గ్యావలీ తన వ్యాసంలో పేర్కొన్నారు. పొరుగున ఉన్న భారత్, వలసపాలన నుంచి విముక్తి పొందుతున్న అనేక ఆసియా, ఆఫ్రికన్ దేశాల వలే నేపాల్ కూడా మరిన్ని రహదారులు, మరిన్ని ఫ్యాక్టరీలు, విద్యుదుత్పాదన కేంద్రాలకు, మహానగరాల నిర్మాణానికి ఆరాటపడింది. వాటిని సమకూర్చుకోవడమే ‘అభివృద్ధి’ అని విశ్వసించింది. పెట్టబడిదారీ అనుకూల, సామ్యవాద అనుకూల వర్గాలు రెండిటికీ ఇటువంటి దార్శనికతే కలిగి ఉండేవి. కాకపోతే పెట్టుబడిదారీ విధాన అనుకూలురు మార్కెట్ ఆధారంగానే అటువంటి అభివృద్ధి సిద్ధిస్తుందని విశ్వసించేవారు. సామ్యవాద సానుకూలురు కార్మికవర్గ రాజకీయ పక్షం నాయకత్వంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమని వాదిస్తుండేవారు (బన్దన ప్రస్తావించని ఒక విశేషం ఉన్నది. 1950ల్లోను, ఆ తరువాయి దశాబ్దంలోను అటు నేపాల్‌లోను, ఇటు భారత్‌లోను చాలా మంది తల్లిదండ్రులు తమ మగబిడ్డలకు బికాస్ లేదా దాని సంస్కృత రూపమైన వికాస్ అని నామకరణం చేసేవారు).
రాణాల పాలన ముగిసిన అనంతరం నేపాలీల మేధో వికాసం, నవ్య సాహిత్య జాగృతి గురించి ప్రత్యోష్ తన వ్యాసంలో వివరించారు. ‘నేపాల్ సాంస్కృతిక్ పరిషద్’ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సంస్థ ప్రచురించే ఒక పత్రికలో నేపాల్ చరిత్ర, సంస్కృతిపై విపుల, పరిశోధనాత్మక వ్యాసాలు వెలువడుతుండేవి. ఆ పత్రిక తొలి సంపాదకీయం ఇలా పేర్కొంది: ‘నేపాల్‌లో కొత్త యుగం ఆరంభమయింది. జాతి తన స్వాభిమానాన్ని కాపాడుకునేందుకు, మరింత సమున్నత సంస్కృతిని సృష్టించేందుకు తమ పూర్వీకుల సాంస్కృతిక, సాహిత్య కృషి గురించి తప్పక తెలుసుకోవలిసిన అవసరమున్నది’.
నేపాల్‌లో తొలి ఆధునిక విశ్వవిద్యాలయం సంస్థాపన గురించి లోక్ రంజన్ తన వ్యాసంలో వివరించారు. రాజు త్రిభువన్ పేరిట ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. ‘ఆరంభం నుంచి భారతీయులు, అమెరికన్లకు తమ అధికారాన్ని, ప్రభావాన్ని నెరపేందుకు ఈ విశ్వవిద్యాలయం ఒక నెలవు అయిందని వ్యాస రచయిత వ్యాఖ్యానించాడు. పట్నా విశ్వవిద్యాలయాన్ని ఆదర్శంగా తీసుకుని త్రిభువన్ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధిపరచాలని పలువురు సూచించారు. అయితే ఈ సూచనను ఒక విద్యావేత్త తీవ్రంగా ఖండిస్తూ ఇరవయో శతాబ్ది తుదినాళ్లలో ఏర్పాటు చేసుకునే విశ్వవిద్యాలయాన్ని భారతీయ విశ్వవిద్యాలయాలను గుడ్డిగా అనుకరించడాన్ని భారతీయ విద్యావేత్తలు కూడా హర్షించరని పేర్కొన్నారు. ఖాట్మండులో విదేశీ పర్యాటకులకు సేవలు అందిస్తున్న ఒక హోటల్‌ను నిర్వహించే రష్యన్ వ్యాపారవేత్త గురించి ఒక ఆసక్తికరమైన వ్యాసమున్నది. భూ సంస్కరణలు, అమెరికా సహాయం గురించి కూడా విపుల వ్యాసాలు ఉన్నాయి.
ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఆధునిక నేపాల్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. 1950ల్లో భారత్‌లో సంభవించిన పరిణామాల గురించి కూడా అటువంటి పుస్తకం నొకదాన్ని తీసుకువస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నా మనసులో మెదిలింది. ఆ స్వాతంత్ర్య తొలి దశాబ్దంలో కలకత్తా, ఢిల్లీ, బాంబే, బెంగళూరులో కఫేలు, కాఫీ హౌస్‌లు మేధావుల సమావేశాలు, చర్చలకు నెలవులుగా ఉండేవి. అటువంటి నెలవులు గురించి అధ్యయనం చేయడం విలువైన చారిత్రక కర్తవ్య నిర్వహణ అవుతుంది. అలాగే నేపాలీ పత్రికల గురించి ప్రత్యోష్ రాసిన వ్యాసం ఉత్కృష్ట అధ్యయనాలకు ఉపథ నిర్దేశం చేసిన బాంబే జర్నల్ ‘ఎకనమిక్ వీక్లీ’ (తదనంతర కాలంలో ఇది ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీగా పునరుత్థానమయింది) చరిత్రను శోధిస్తే స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో మేధో చింతన ఆవిర్భావం, అది పరిణమించిన రీతులపై కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. త్రిభువన్ విశ్వద్యాలయంపై వ్యాసం చదివిన తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల ఏర్పాటు, భారతదేశ, విశాల ప్రపంచ ఆర్థిక జీవనంపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు ఇంకా ఎందుకు జరగలేదని నేను ఆశ్చర్యపోయాను. అలాగే రష్యన్ వ్యాపారవేత్తపై వ్యాసం చదివిన తరువాత సుప్రసిద్ధ తాజ్, ఒబెరాయి హోటళ్ల చరిత్రపై పరిశోధనలు జరగవలసి ఉందనే భావన కలిగింది.
నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలను చులకనగా చూడడాన్ని, వాటి పట్ల అహంకారపూరిత వైఖరి ప్రదర్శించడాన్ని మన పాలకపక్ష రాజకీయవేత్తలు విడనాడాలని సంవత్సరం క్రితం ఇదే కాలమ్ (ఆగస్టు 24, ‘విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి’)లో రాసిన వ్యాసంలో నేను వాదించాను. ‘Nepal in the Long 1950s’ చదివిన తరువాత ఆ వాదనకు ఇలా ముక్తాయింపు ఇవ్వదలిచాను: ఇరుగు పొరుగు దేశాల గురించి మరింత విస్తృతంగా, సమగ్రంగా మనం అధ్యయనం చేయాలి. తద్వారా, ఆర్థిక, విదేశాంగ విధాన ప్రయోజనాలతో సంబంధం లేకుండా భారతదేశమూ, భారతీయులూ విశేషంగా లబ్ధి పొందుతారు.
-రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - Sep 06 , 2025 | 02:40 AM