Supreme Uncertainty: సుప్రీం సందిగ్ధత ఎన్నికలకు శాపం
ABN, Publish Date - Aug 26 , 2025 | 05:07 AM
ఎన్నికల కమిషన్ (ఈసీ ఇంతగా వివాదాస్పదమై పలచనైపోయిన సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ లేదనుకుంటాను. ఒకవైపు ఎన్నికలు చేరువలో ఉన్న బిహార్‌లో ఉన్నట్టుండి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతున్నది....
ఎన్నికల కమిషన్ (ఈసీ) ఇంతగా వివాదాస్పదమై పలచనైపోయిన సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ లేదనుకుంటాను. ఒకవైపు ఎన్నికలు చేరువలో ఉన్న బిహార్‌లో ఉన్నట్టుండి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతున్నది. ఇంకొకవైపు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పరిశోధించి బయటపెట్టిన భారీ దొంగ ఓట్ల బండారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పును సూచిస్తూ కమిషన్ తలదించుకోవలసిన పరిస్థితిని కలిగించింది. ఈ రెండు ఉదంతాల్లోనూ అది కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది.
ఏ పార్టీ, లేదా ఏ శక్తి, వ్యక్తి ఒత్తిడికీ లొంగకుండా సర్వ స్వతంత్రంగా పని చేయడానికే ఈసీకి రాజ్యాంగ హోదా కల్పించారు. ఎన్నికల నిలువుటద్దంలో ప్రజల తీర్పును యథాతథంగా ప్రస్ఫుటింపజేయవలసిన గురుతర బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు దీనికి అప్పగించారు. అందుకు విరుద్ధంగా అది డూడూ బసవన్న అయిపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తున్నది. శేషన్ హయాంలో మితిమించిన కాఠిన్యం, ఇప్పుడు శ్రుతిమించిన దాసోహం. ప్రజాస్వామ్యంలోని సున్నితత్వాన్ని హరించిన శేషన్‌ను భరించగలిగాం గాని, జ్ఞానేశ్ వెన్నెముకలేమి దుర్భరంగా ఉన్నదని ప్రజలు, విజ్ఞులు వాపోతున్నారు.
రాజ్యాంగం 324 అధికరణ ఎన్నికల సంఘానికి ప్రాణం పోసింది. ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసనసభలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి పదవులకు నిష్పాక్షిక, నిర్భయ వాతావరణంలో ఎన్నికలు జరిపించడం ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత. ఇంకా ఆయా ఎన్నికలకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడం, ఎన్నికల్లో పార్టీలకు ప్రవర్తనా నియమావళి (కోడ్) విడుదల చేయడం, అభ్యర్థుల ప్రచార ఖర్చుపై పరిమితి విధించడం, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వంటి ఆధునిక సాంకేతిక సాధనాలను ప్రవేశపెట్టడం, నోటా మాదిరి విధానాలను చేర్చి ప్రజాస్వామ్య నైశిత్యానికి పదునుపెట్టడం, అభ్యర్థుల క్రిమినల్ నేపథ్యాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం ఎన్నికల కమిషన్‌కు గల ఇతర అధికారాలు.
ఈ కమిషన్ 1950లో నెలకొన్నది. 1989లో ఓటింగ్ కనీస వయసును 21ఏళ్లకు బదులు 18 సంవత్సరాలు చేశారు. అప్పుడు తొలిసారిగా ఏకసభ్య కమిషన్ ముగ్గురు సభ్యుల వ్యవస్థగా మారింది. ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండే జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయి. ఎన్నికల నిష్పాక్షికతను కాపాడి ఓటు పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడవలసిన అవసరాన్ని గుర్తించి ఎన్నికల సంఘాన్ని ఇంతటి ఉన్నత స్థానంలో ఉంచారు. ఇప్పుడు అందుకు విరుద్ధమైన పరిస్థితులు తలెత్తడం ఆందోళనకరం. ఎన్నికల కమిషన్ ఎంత నిష్పక్షపాతంగా ఉండాలో సుప్రీంకోర్టు అనేకసార్లు విశదీకరించింది. ఇంత ప్రాధాన్యం కలిగిన ఎన్నికల కమిషన్‌కు కమిషనర్లను నియమించే ప్రక్రియ చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో ఉంది. దానికి స్వస్తి చెప్పేందుకు సుప్రీంకోర్టు సాగించిన ప్రశంసాపాత్రమైన కృషి విఫలమై తిరిగి కేంద్రం గుత్తాధిపత్యానికే దారితీసింది. ఇదే ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌ను ఏరికోరి నియమించుకునే అధికారాన్ని మోదీ ప్రభుత్వానికి ఇచ్చింది.
ఎన్నికల కమిషనర్లుగా సీనియర్ ఐఏఎస్‌లను, కేంద్ర కేబినెట్ సెక్రటరీలుగా పనిచేసిన వారిని, ఆ స్థాయి ఇతరులను నియమించేవారు. అందుబాటులోని ఇటువంటివారిలో తమకు ఇష్టులైన వ్యక్తులను సీఈసీలుగా, ఈసీలుగా ప్రధానమంత్రులు సిఫారసు చేయడం, వారిని రాష్ట్రపతి నియమించడం ఆనవాయితీగా చాలాకాలం పాటు కొనసాగింది. అయితే ఈ విధానాన్ని సవాలు చేస్తూ 2015లో రిటైర్డ్ ఐఏఎస్ అనూప్ బరన్వాల్ దాఖలు చేసిన జనహిత వ్యాజ్యం ఈ వ్యవహారాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ, ఎవరి జోక్యానికీ అతీతంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలని ఈ పిటిషన్‌లో కోరారు. అప్పటికున్న నియామక విధానం ఎన్నికల స్వచ్ఛతను, నిష్పాక్షికతను హరిస్తున్నదని పిటిషనర్ వాదించారు. వాస్తవానికి ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి అనుసరించవలసిన పద్ధతిని నిర్దేశిస్తూ పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని చేయాలని రాజ్యాంగం 342(2) 53(3)(బి)లు సూచిస్తున్నాయి. అటువంటి చట్టం లేకపోవడాన్ని ఆసరా చేసుకుని కేంద్ర పాలకులు ఇంతటి ముఖ్యమైన విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2023లో తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి తగినవారిని రాష్ట్రపతికి సిఫారసు చేయడానికి ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో ఒక కమిటీని వేయాలని స్పష్టం చేసింది. పార్లమెంటు ఒక చట్టం చేసేవరకు ఈ కమిటీ కొనసాగాలని చెప్పింది.
స్వేచ్ఛతో కూడిన, స్వచ్ఛమైన ఎన్నికలకు నిష్పాక్షిక సీఈసీ అత్యంత అవసరమన్న ధర్మాసనం సందేశానికి విరుద్ధంగా కేంద్రం అతి తెలివిని ప్రదర్శించింది. కమిషనర్లుగా నియామకానికి తగినవారిని సిఫార్సు చేసే కమిటీ నుంచి సీజేఐని తొలగిస్తూ పార్లమెంటు చేత చట్టం చేయించింది. ఈ చట్టం ప్రకారం ప్రధాని, ఒక కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకానికి పేర్లను సిఫారసు చేస్తుంది. ఆ విధంగా కేంద్ర పాలకులు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో తమ నిరంకుశ నిర్ణయానికి దారి చేసుకున్నారు. ఈ చట్టాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయా ఠాకూర్ 2024 జనవరిలో సుప్రీంకోర్టులో దావా దాఖలు చేశారు. ఆ తర్వాత ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ దీనిని (ఎడిఆర్) సవాలు చేసింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. కానీ కేంద్ర చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
పార్లమెంట్‌కు, న్యాయవ్యవస్థకు పోటీ సృష్టించిన ఈ కేసులో చొరవ చూపడానికి సుప్రీంకోర్టు వెనుకాడుతున్నదని, దానివల్ల ఎన్నికలు కేంద్ర పాలకుల చేతిలో మైనపు ముద్దలా తయారై ప్రజాస్వామ్య ధర్మానికి తీవ్ర విఘాతం కలుగుతున్నదని భావించక తప్పడం లేదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నికల వ్యవస్థ పాలకుల పంజరంలో చిలుక కావడం దారుణం. దీని ఫలితమే ప్రస్తుత సీఈసీ నిర్వాకం. 2024 సార్వత్రక ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. మరో కమిషనర్ సతీశ్‌చంద్ర పాండే అప్పటికే రిటైర్ అయ్యారు. కేంద్రం ఈ సందును ఉపయోగించుకుని జ్ఞానేశ్ కుమార్‌ను, సుఖ్‌వీర్‌సింగ్‌ను ఎన్నికల కమిషనర్లుగా నియమింపజేసింది. ఆ తర్వాత జ్ఞానేశ్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ చేశారు. ఇంతలోగా జస్టిస్ ఖన్నా విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవడం, కేసు మరో ధర్మాసనానికి వెళ్లడం జరిగిపోయాయి. దీనితో ఈ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకుండా, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ కేంద్రం నిరంకుశాధిపత్యంలోనే కొనసాగుతున్నది.
సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ తదుపరి సార్వత్రక ఎన్నికలకు తెరలేవడానికి ముందు వరకు కొనసాగుతారు. ఎన్నికల కమిషనర్లకు సమాన హోదా లేదు, ముగ్గురినీ రాష్ట్రపతే నియమిస్తున్నప్పటికీ సీఈసీని తొలగించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉద్వాసన చెప్పే పద్ధతినే అనుసరించవలసి వుండగా, ఎన్నికల కమిషనర్లను మాత్రం సీఈసీ సిఫార్సుల మేరకు తప్పించాల్సి ఉంటుంది. ఇది కమిషనర్లను సీఈసీ చెప్పుచేతల్లో ఉంచుతుంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి పార్లమెంట్ చేసిన చట్టంపై ఖన్నా ధర్మాసనం స్టే విధించి ఉన్నా, దానిని రద్దు చేసినా ఈ దుస్థితి తొలగి ఉండేది. ఉన్నత న్యాయమూర్తుల నియామకం విషయంలో ప్రభుత్వం పార్లమెంటు ద్వారా నెలకొల్పిన జాతీయ న్యాయ నియామక కమిషన్‌ను కొనగోటితో తొలగించి కొలీజియంను కాపాడుకున్న సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సీజేఐని తిరిగి చేర్పించే విషయంలో ఇంతగా వెనుకాడడం దేశ ప్రజాస్వామ్యాన్ని కంపింపజేస్తున్నది. ఇప్పటికైనా అత్యున్నత న్యాయ స్థానం కర్తవ్య స్పృహతో ఈసీల నియామక నిరంకుశ చట్టాన్ని రద్దు చేసి ఎన్నికల సంఘాన్ని జోక్యానికి, చొరబాటుకు వీలులేని దుర్భేద్య వ్యవస్థగా చేస్తుందని ఎదురు చూద్దాం.
-గార శ్రీరామమూర్తి సీనియర్ పాత్రికేయులు
Updated Date - Aug 26 , 2025 | 05:07 AM