Boycotting Assembly: అసెంబ్లీ మీద అలిగితే నష్టం ఎవరికి
ABN, Publish Date - Sep 18 , 2025 | 06:14 AM
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఒక కోటి, ముప్పయ్ రెండు లక్షల, ఎనభై నాలుగు వేల, నూట ముప్పయ్ నాలుగు...
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఒక కోటి, ముప్పయ్ రెండు లక్షల, ఎనభై నాలుగు వేల, నూట ముప్పయ్ నాలుగు (1,32,841,34) ఓట్లు లభించాయి. 2019–2024 మధ్యకాలంలో పాలనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుని అంతటి భారీ స్థాయిలో ‘క్లెప్టోక్రసీ’ని తలపించే రీతిలో పాలన సాగించినప్పటికీ నలభై శాతం మంది ప్రజలు జగన్ వెంట నడిచారు. ఇది చిన్న విషయం కాదు. జనసేన పేరుతో ప్రజా జీవితంలోకి 2014లో మహా దూకుడుగా అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ వెంట దశాబ్దం తరువాత కూడా ఆరేడు శాతానికి మించి ఓటర్లు నడవలేదు. అందుకే, జగన్ వెంట నడిచిన 40 శాతం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాల్సిన నైతిక బాధ్యత జగన్ పార్టీకి ఉన్నది. వారి పొలాలకు నీరు సక్రమంగా అందుతున్నదా, వారి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా, వాళ్ళ పిల్లలకు ‘తల్లికి వందనం’ నిధులు లభించాయా, వారికి ఆరోగ్యశ్రీ సహాయం లభిస్తున్నదా, వారి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయా, పోలీస్ స్టేషన్లలో వారికి ఏమైనా అన్యాయాలు జరుగుతున్నాయా... వంటి సవాలక్ష అంశాలపై ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోతే నిలదీయాల్సిన అవసరాన్ని జగన్ పార్టీ గుర్తించిందా? మరి వీటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! ఆ నిలదీతకు అసెంబ్లీ సమావేశాలకు మించిన వేదిక భారత ప్రజాస్వామిక వ్యవస్థలో మరొకటి ఏముంది?
జగన్ పార్టీకి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు. పులివెందుల నుంచి ఎన్నికైన వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డిని మినహాయిస్తే రేగం మస్త్యలింగం (అరకు వ్యాలీ), మస్త్యరస విశ్వేశ్వరరాజు (పాడేరు), తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), దాసరి సుధ (బద్వేల్), ఆకేపాటి అమరనాథరెడ్డి (రాజంపేట), వై. బాలనాగిరెడ్డి (మంత్రాలయం), బి. విరూపాక్షి (ఆలూరు), పి. ద్వారకానాథరెడ్డి (తంబళ్లపల్లి)... వీరంతా శాసనసభ సమావేశాల్లో పాల్గొనడానికి చట్టపరమైన, లేదా – న్యాయపరమైన అడ్డంకులు ఏమీలేవు. మిగిలిన 164 శాసనసభ్యులకు లభించే సమస్త వసతులు, జీతభత్యాలు, వసతి, సెక్యూరిటీ సదుపాయం– ఈ పదకొండుమందికీ లభిస్తున్నాయి. వీరు పదకొండుమందే అయినప్పటికీ, జగన్ పార్టీకి ఓటేసిన కోటీ ముప్పై లక్షల మందికి పైగా ఓటర్లకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని మరిచిపోకూడదు. శాసనసభలో మాట్లాడే అంశాలకు చట్టబద్ధత ఉంటుంది. శాశ్వతత్వం ఉంటుంది. ఆ మాటలు సభ రికార్డులలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ ప్రసంగాలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. అందుకే, ‘సభకు హాజరవ్వండి’ అంటూ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వైసీపీ సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సభలోకి రాకుండా, హాజరు పట్టీల్లో సంతకాలు పెట్టేసి, దొంగల్లా వైసీపీ సభ్యులు వెళ్లిపోతున్నారని స్పీకర్ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్య తమకు ఎంత చిన్నతనమో వైసీపీ సభ్యులు ఆలోచించుకోవాలి. వారికే కాదు – వారు శాసనసభకు ఎన్నికవ్వడానికి, ఆ పార్టీకి ఓటేసిన కోటీ ముప్పయ్ రెండు లక్షల మంది ఓటర్లకూ చిన్నతనమే కదా! చట్టసభ పట్ల నమ్మకం అనేదే లేకపోతే, వారికి భారత ప్రజాస్వామ్యం మీదే నమ్మకం లేదని అనుకోవాలి. శాసనసభకు హాజరు కాకూడదు అనుకుంటే, సభ్యులుగా ఎందుకు ప్రమాణస్వీకారం చేసినట్టు! ప్రమాణ స్వీకారం కూడా బహిష్కరించి ఉంటే ఇక ఈ విషయంలో చర్చ అన్న ప్రసక్తే ఉండేది కాదు. చింతకాయల అయ్యన్నకు వైసీపీపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమూ ఉండేది కాదు. ఇంతకీ, ఈ పదకొండుమందీ సభకు ఎందుకు రాలేకపోతున్నారు? తాము గత శాసనసభ సమావేశాల్లో చంద్రబాబును ఘోరంగా అవమానించిన ఘటనతో వారికి ఇప్పుడు సభలో కూర్చోడానికి మొహాలు చెల్లడం లేదని ఎవరైనా ఆక్షేపిస్తే సమాధానం చెప్పగలిగిన స్థితిలో వైసీపీ ఉండాలి కదా! ఇటువంటి రాజకీయ పరిస్థితి ఎదురవుతుందని కలలో సైతం అనుకోని వైసీపీ నాయకులకు ఇప్పుడు ఇది మింగుడు పడడం లేదా? ఇదే మరి ఖర్మ సిద్ధాంతం అంటే! ‘రేపు’ అనేది ఒకటి ఉంటుందనేది గుర్తుపెట్టుకోనందువల్లే వైసీపీ నేతలకు ఈ పరిస్థితులు ఎదురయ్యాయాన్న వ్యాఖ్యానాలు విస్తృతంగా వినబడుతున్నాయి.
కానీ శాసనసభ మీద అలగడం కాదు కదా వైసీపీ పార్టీ చేయవలసింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడిని చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలి. 1995 నుంచి 2004 వరకు ఏకబిగిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఏనాడూ శాసనసభ మీద అలగలేదు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఆ సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రులైన రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను ఆయన ఎదుర్కొన్నారు. మళ్ళీ 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నుంచి 2024 వరకు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు హాజరై ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది ఒక్కసారే కదా? ఈ ఓటమిని హుందాగా తీసుకుని, 151 నుంచి 11కు ఎందుకు వచ్చామో నిజాయితీగా ఆత్మ విమర్శ చేసుకుని, మళ్ళీ 150కి రావడానికి ఏమి చేయాలో అది చెయ్యకుండా శాసనసభపై అలగడంతో వైసీపీ డొల్లతనం బయటపడడం లేదా!? శాసనసభకు వెళ్ళగూడదని వైసీపీకి చెందిన పదకొండుమంది శాసనసభ్యులూ నిజంగా భావిస్తూ ఉంటే, ఆ విషయాన్ని నిజాయితీగా ప్రకటించి, తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడం సబబుగా ఉంటుంది. సభ్యత్వం ద్వారా లభించిన అన్నిటినీ తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పడం నిజాయితీగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో చేసే పోరాటాలకు ఒక నైతిక బలం ఉంటుంది. లేకపోతే, అయ్యన్నపాత్రుడు పదే పదే చెప్పినట్టుగా వైసీపీ దుష్కీర్తిని మూటగట్టుకున్నట్టు అవుతుంది. తమకు 2024 ఎన్నికల్లో ఓటేసిన కోటీ ముప్పయ్ రెండు లక్షల ఎనభైయ్ వేల మంది ఓటర్లకూ ద్రోహం చేసినట్టేనన్న భావం సమాజంలో కలుగుతుంది.
--భోగాది వేంకటరాయుడు
Updated Date - Sep 18 , 2025 | 06:14 AM