Justice Sudarshan Reddy: సంక్లిష్ట తరుణంలో సరైన ఎంపిక
ABN, Publish Date - Sep 03 , 2025 | 05:45 AM
ప్రపంచంలో అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు పెద్దల సభకు అధ్యక్షత వహించడమంటే చిన్న విషయం కాదు. అందుకు అర్హతలతో పాటు యోగ్యతలూ...
ప్రపంచంలో అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు పెద్దల సభకు అధ్యక్షత వహించడమంటే చిన్న విషయం కాదు. అందుకు అర్హతలతో పాటు యోగ్యతలూ ముఖ్యమే. చట్టసభల ఔన్నత్యాన్ని ఉద్దీపింపజేసే ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నిక ఒక కీలక సందర్భం! కొన్ని విషయాల్లో నిర్ణయాలు ఎంత ప్రధానమో అందుకు సంబంధించిన సానుకూల సంకేతాలను ముందుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళడమూ అంతే ప్రధానం. అర్ధాంతరంగా ఖాళీ ఏర్పడటంతో ఇప్పుడు జరుగుతున్న భారత ఉపరాష్ట్రపతి పదవి- ఎన్నిక ప్రక్రియ కూడా అటువంటిదే! ప్రతిపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడం ద్వారా ఒక గొప్ప సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రజాస్వామ్య పద్ధతులు పలుచబారుతున్న సంక్లిష్ట సమయమిది. దేశ అత్యున్నత చట్టసభల్లో రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను నిర్వహించే విపక్షాలను నిర్లక్ష్యం చేస్తున్న గడ్డురోజులివి. సరిగ్గా ఇప్పుడే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వంటి న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ విధేయుడి అవసరం ఉన్నత చట్టసభలకు ఎంతగానో ఉన్నది. పార్టీలకు అతీతంగా సభను నడిపే సభాపతిని ఎన్నుకునే ప్రక్రియలో పార్టీ సరిహద్దులు దాటి ఆత్మప్రబోధానుసారం ఓటు వేసైనా యోగ్యుడైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత గౌరవ సభ్యులపైన ఉంది.
ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎన్నికైతే, ఆయనే స్వయంగా వెల్లడించినట్టుగా, రాజ్యసభ అధ్యక్ష హోదా నిర్వహణ ఆయన ఇదివరకు నిర్వహించిన న్యాయ ప్రక్రియకు కొనసాగింపు వంటిదే! ప్రజాపక్షం వహించి నిర్భీతితో ఇచ్చే తీర్పులాగా నిర్ణయాన్ని ప్రకటించడమే సభా నిర్వహణలో చుక్కాని. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సామాజిక దృక్పథాన్ని, మానవ హక్కుల చేతనను జోడించి భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన ఆయన గతం ఇక్కడ పనికొస్తుంది. ఇటువంటి విషయాల్లో జస్టిస్ కృష్ణ అయ్యర్, జస్టిస్ భగవతి వంటి కోవిదుల తరగతికి చెందినవారాయాన. ప్రజాస్వామ్య పాలనా విధానంపై విశ్వాసమూ, రాజ్యాంగం పట్ల సంపూర్ణ విధేయతా, సామాజిక న్యాయం పట్ల నిస్సందేహమైన నిబద్ధతా, జనహితంలో విలక్షణమైన దార్శనికతా ఆయనలో కనిపిస్తాయి. నా స్వీయానుభవమే ఒకటి మీతో పంచుకుంటాను. 1989లో నేను తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. నా నియోజకవర్గ పరిధిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ పేరిట, జిల్లా కలెక్టర్ అనుమతితో, మండల అధికారులను వెంట తీసుకొని గ్రామ గ్రామం తిరుగుతూ గ్రామ సభలు ఏర్పాటు చేసేవాళ్ళం. పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తెస్తూ ఆ సమస్యల్ని పరిష్కరించేవాళ్ళం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ప్రతిపక్షం ఓర్వలేక నా పైన, దీనికి అనుమతిచ్చిన జిల్లా అధికారులపైన కోర్టులో కేసు వేసింది. మేం అధికార దుర్వినియోగం చేస్తున్నామన్నది వారి అభియోగం. అప్పుడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి న్యాయవాదిగా నా కేసు వాదించారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రజాసేవకు నిలబడటం, ప్రభుత్వాధికారుల సేవల్ని అందుకు వినియోగించడం రాజ్యాంగబద్ధమనే అంశం ప్రాతిపదికగా ఆయన తన వాదనలను వినిపించారు. మేం కేసు గెలిచాం. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించాలన్న విశాల ప్రజాస్వామ్య దృక్పథాన్ని ఆయన తన ఆలోచనా ధోరణిగా అలవర్చుకొని, నేటి వరకూ కొనసాగిస్తూనే ఉన్నారు.
1971లో న్యాయవాద వృత్తి చేపట్టిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి న్యాయరంగంలో వివిధ హోదాలకు ఎదిగారు. రాజ్యాంగ సంబంధపు అంశాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులపై వాదించటంలోను, ప్రజాప్రయోజన వ్యాజ్యాల విషయంలోను ఆయనకు మంచి పేరుండేది. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) చైర్మన్‌గా సేవలందించారు. 1995లో హైకోర్టు జడ్జిగా, 2007 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2011 వరకు పని చేశారు. రాజకీయ ప్రభావాలకు న్యాయ వ్యవస్థ లోను కాకూడదన్న బలమైన నమ్మికతో సుదర్శన్‌రెడ్డి పదవీ కాలమంతా వృత్తి నిబద్ధతకు కట్టుబడే నడచుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఆయన వెలువరించిన పలు తీర్పులు న్యాయవాదులకు, వృత్తి నిపుణులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఛత్తీస్‌గఢ్ ‘సల్వజుడుం’ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం సభ్యుడిగా ఆయన వెలువరించిన తీర్పు చరిత్రలో నిలుస్తుంది. తీవ్రవాదానికి పోటీగా గిరిజన పౌరుల చేతికి ఆయుధాలిచ్చి, రాజ్యమే దళాలను ఏర్పాటు చేయటం, హింస –ప్రతిహింసలో ప్రజలను భాగస్వాముల్ని చేయటం అధర్మమూ, ప్రమాదకరమేగాక రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన ఈ తీర్పులో విస్పష్టంగా పేర్కొన్నారు. న్యాయహోదా ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో క్రియాశీలంగా ఉంటూ ప్రజాస్వామ్య ఉద్యమాలకు ప్రత్యక్ష- పరోక్ష మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. సమయం, సందర్భం, పౌరుల అవసరాల్ని బట్టి గొంతు విప్పడం కూడా ఆయన్ని ప్రజాక్షేత్రంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయన ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలన గతి తప్పుతున్నప్పుడు ఆయనేం మౌనంగా లేరు. ప్రజాభిప్రాయాన్ని తన వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా ప్రతిబింబిస్తూనే వచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పదకొండేళ్ల పాలనలో వివిధ ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతూ వస్తున్నాయి. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) విభాగం వంటి సంస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దురుపయోగపరుస్తున్నారు. చివరకు భారత ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల విశ్వసనీయతను కూడా స్వార్థంతో భంగపరుస్తున్నారు. చట్ట సభల నిర్వహణ సజావుగా లేదు. విపక్షాల గొంతు నొక్కి, ఏకపక్షంగా ప్రజావ్యతిరేక, రాజ్యాంగ ప్రతికూల బిల్లుల్ని తెచ్చి ఆమోదింపజేసుకుంటున్నారు. ఇదే తీరు నియంత్రణ లేకుండా కొనసాగితే రాజ్యాంగానికి రక్షణ లేకపోగా ప్రజాస్వామ్యమే గంపగుత్తగా ప్రమాదంలో పడే ఆస్కారం ఉంది. ఇటువంటి సంక్లిష్ట, సంక్షుభిత సమయాల్లోనే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వంటి జనహిత, ప్రజాస్వామ్య వాదుల నాయకత్వం చట్ట సభలకు వన్నె తెస్తుంది. పార్టీలకతీతంగా ఆత్మప్రబోధానుసారం నిర్ణయం తీసుకొని భారత చట్టసభల ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి సభ్యులకు ఇది ఒక గొప్ప అవకాశం. -
-డా. జి. చిన్నారెడ్డి ఉపాధ్యక్షుడు,
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం
Updated Date - Sep 03 , 2025 | 05:45 AM