ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Formation: ఆకాంక్షకు తగ్గ అభివృద్ధి జరిగిందా

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:53 AM

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యిన నేపథ్యంలో, ఉద్యమ లక్ష్యాల సాధనపై విమర్శనాత్మకంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చోటుచేసుకున్నా, నియామకాలు, ఆర్థిక స్థితి, పరిపాలనలో అసమతుల్యతలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యం ఏ మేరకు నెరవేరిందన్న మూల్యాంకనం చేయాల్సి ఉంది. రాష్ట్రం కోసం జరిగిన పోరాటం చరిత్రాత్మకమైనది. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని ఇవ్వాలనే డిమాండ్ చేశాయి. ఆ రకంగా చూసినప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం విలక్షణమైనది. ఇటీవలి కాలంలో అత్యంత శాంతియుతంగా జరిగి సజావుగా లక్ష్యాన్ని సాధించిన ఉద్యమం ఇదే. శ్రీకాంతాచారి లాంటి యువకులు ఆత్మబలిదానం చేసుకున్నప్పటికీ హింసకు ఏ మాత్రం తావు లేకుండా జరిగిన ఉద్యమం ఇది. ఆధునిక పోరాటాలకు ఇదొక మోడల్‌. నిజానికి తెలంగాణ చరిత్ర పోరాటాలమయం. 1945లో సాయుధ పోరాటాన్ని జరపాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నది తెలంగాణ. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇక్కడ భావనాత్మక సంఘర్షణ తొణికిసలాడింది. 1948 సెప్టెంబర్ 17 విలీనం– ఇక్కడి ప్రజలకు ఒక గుర్తుంచుకోవలసిన రోజు. 1952 దాకా దాదాపు మిలిటరీ పరిపాలనే కొనసాగింది. ఇంకొక ప్రధాన ఘట్టం 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. తదనంతరం 1957లో ముల్కీ ఉద్యమం కూడా విద్యావంతులను పట్టి కుదిపేసింది. దీని వైఫల్యసాక్ష్యంగా 1969లో ‘జై తెలంగాణ’ ఈ ప్రాంతాన్ని అట్టుడికేటట్టు చేసింది. 2000 సంవత్సరం నుంచి మొదలైన మలిదశ ఉద్యమం ఈ పోరాటాల మేలిమిని స్వీకరించిందన్నట్టుగా అత్యంత శాంతియుతంగా నడిచి, ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకొని ఒక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అయితే తెలంగాణ ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్యసాధన తొవ్వలోనే నడుస్తున్నదా అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాషకు న్యూనత లేకుండా పోయింది, గౌరవం పెరిగింది. ఏ సినిమాలలో తెలంగాణ భాష చిన్నతనానికి గురైందో, అదే తెలుగు సినిమాలలో తెలంగాణ భాషను హీరోలు కూడా మాట్లాడడం మొదలైంది. తెలంగాణ భాష ఉన్న సినిమాలే హిట్ అవ్వడం కూడా ఎవరూ కాదనలేని సత్యం. తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడి సాహిత్య వాతావరణాన్ని ఉద్దీపింపజేశాయి. భౌతికపరమైన అభివృద్ధిని కూడా గమనించవలసి ఉంది. హైదరాబాదు, దాని పరిసరాలలో రోడ్లు విస్తరించబడ్డాయి. ఫ్లైఓవర్లు నిర్మించబడ్డాయి. అండర్ పాస్‌లు కొత్తగా తొవ్వబడ్డాయి.


ఇరవైనాలుగు గంటలు విద్యుత్ సరఫరా నిరాఘాటంగా జరిగింది. ఇవి కాకుండా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకు వచ్చిన ఒక నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు రంగాలలో ఆశించిన మేరకు అభివృద్ధి జరిగిందా అనే ప్రశ్నకు ఏకవాక్య సమాధానం లేదు. మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువులను కాలువ నీటితో నింపడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలనే ప్రయత్నం కొంతమేరకు సఫలీకృతమైంది. ఈ చిన్న విజయాలను అపహాస్యం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇక నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలోని ఆర్థిక వనరులన్నీ మన రాష్ట్రానికే వాడుకునే సౌకర్యం ఒకటి ఉందని సంతోషపడవచ్చు. కానీ కేవలం రూ.75 వేల కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలగాణ రాష్ట్రం, ఈ రోజు ఆరు లక్షల 70 వేల కోట్లకి చేరుకుందని తలుచుకున్న ప్రతి విద్యావంతుడు ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక అస్తవ్యస్తతను తప్పించుకోవడానికి ఉద్యోగుల విరమణ వయసును 58 నుంచి 61కి పెంచడం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక మూడవ ప్రధాన నినాదం నియామకాలు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, మైనారిటీల గురుకులాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యను అందించే లక్ష్యంలో భాగంగా ఉపాధ్యాయులను, లెక్చరర్లను కొంతమందిని నియమించారు. నీటిపారుదల శాఖకు కొంతమంది సహాయ ఇంజనీర్లను కూడా నియమించారు. రెవెన్యూ శాఖను గ్రామస్థాయిలో తొలగించడంలో భాగంగా వ్యవసాయ శాఖకు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను కొంతమందిని నియమించారు. కానీ గ్రూపు వన్, టు, త్రీ నియామకాలు ఏవీ చేపట్టకపోవడం నిరుద్యోగ యువతకు అశనిపాతంగా మారింది. ఇప్పుడిప్పుడే గ్రూప్ వన్, టు, ఉద్యోగాలు నియమించే ప్రక్రియలో పురోగతి కనిపిస్తున్నది. ఏ స్థాయిలో ఉద్యమ ఆకాంక్షలు ఉండేవో ఆ స్థాయిలో అభివృద్ధి జరిగింది అని మాత్రం చెప్పలేం. లాభ నష్టాలతోపాటు ప్రత్యేకంగా చెప్పవలసిన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాష్ట్ర ఆవిర్భావానంతరమే సృష్టించబడ్డాయి.


పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించడం శాస్త్రీయ దృక్పథంతో చేసిన వికేంద్రీకరణ అనిపించుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. పది మండలాలు కలిగిన ములుగు లాంటి జిల్లాలు, 30 మండలాలు కలిగిన నల్లగొండ లాంటి జిల్లాలకు ఒకే స్థాయి కలిగిన అధికార యంత్రాంగాన్ని నియమించడం ఎంత మేరకు సబబు? అన్ని జిల్లాలు చేసినప్పుడు వాటికి సరిపడా ఉద్యోగ నియామకాలు చేయలేదు. కేవలం 10 మండలాలు ఉన్న జిల్లాలకు కూడా అదే స్థాయి ఐడీఓసీలను నిర్మించడం ప్రజాధనాన్ని సద్వినియోగపరచడమేనా అనే ప్రశ్న కూడా ఉంది. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా తొలగించడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను తెచ్చే నిర్ణయం. ఇప్పుడు గ్రామానికి రెవెన్యూ రికార్డుల సజీవచిట్టా పహాణి లేదు. వాటిని నిర్వహించే వీఆర్ఓ లేడు. అటు గ్రామాధికారికి ఇటు తహసిల్దార్‌కు సహకరించే గ్రామ సేవకులు కూడా లేరు. ఇంతగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను నిర్మూలించడం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ జరగలేదు. దీన్ని పునర్నిర్మించడం కూడా అంత సులభం కాదు. ఇట్లా ఆలోచించినప్పుడు తెలంగాణ పరిపాలన మీద ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

- ఏనుగు నరసింహారెడ్డి

Updated Date - Jun 01 , 2025 | 12:55 AM