Majnu Ka Tila Delhi: ప్రతీకారం.. 6 నెలల చిన్నారిని కూడా వదలలేదు..
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:28 AM
Majnu Ka Tila Delhi: ఆపరేషన్ చేసే బ్లేడ్‌తో సోనాల్‌ను బెదిరించి చేతులు కాళ్లు కట్టేశాడు. నోటికి ప్లాస్టర్ వేశాడు. రష్మీ చిన్న కూతురి నోటికి కూడా ప్లాస్టర్ వేశాడు. మొదట సోనాల్ గొంతును బ్లేడుతో కోసి చంపేశాడు. తర్వాత చిన్నారి గొంతు కూడా కోసి చంపేశాడు.
న్యూఢిల్లీ: ఓ యువకుడు ప్రతీకారం కోసం 6 నెలల చిన్నారిని హత్య చేశాడు. గొంతు కోసి మరీ అత్యంత పాశవికంగా చంపేశాడు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్‌వాణీకి చెందిన నిఖిల్‌కు అదే ప్రాంతానికి చెందిన సోనాల్‌తో 2023లో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలకే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఓ సంవత్సరంపాటు సహజీవనం చేశారు.
ఈ నేపథ్యంలోనే సోనాల్ గర్భం దాల్చింది. ఇద్దరికీ పెళ్లికాకపోవటం, ఆర్థికంగా జీవితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో బిడ్డను కంటే పెంచలేమని భావించారు. అబార్షన్ చేయించాలాని అనుకున్నారు. అయితే, అబార్షన్ చేయించటం కుదరలేదు. దీంతో 2024లో సోనాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను నిఖిల్, సోనాల్ కలిసి రూ.2 లక్షలకు అమ్మేశారు. ఆ డబ్బులతో ఇద్దరూ ఢిల్లీ వచ్చి స్థిరపడ్డారు. ఢిల్లీలోని మజ్ను కా తిల్లా ఏరియాలో ఉంటున్నారు. ఢిల్లీకి వచ్చిన కొంతకాలానికి సోనాల్‌కు రష్మీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
సోనాల్ తరచుగా రష్మీ ఇంటికి వెళుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే సోనాల్‌కు రష్మీ భర్త దుర్గేష్‌తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచుగా వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. అయితే, ఈ వ్యవహారం నిఖిల్‌కు తెలిసిపోయింది. దీంతో సోనాల్, నిఖిల్ మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి. గొడవలు తారాస్థాయికి చేరడంతో సోనాల్.. నిఖిల్‌ను వదిలిపెట్టి రష్మీ ఇంటికి వెళ్లింది. రష్మీ కూడా సోనాల్‌ను తన ఇంట్లో ఉండేందుకు అంగీకరించింది. అయితే, రష్మీ ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే సోనాల్ గర్భవతి అని తెలిసింది. దీంతో నిఖిల్ ఎంతో సంతోషించాడు.
ఎలాగైనా సోనాల్‌ను తన దగ్గరకు తెచ్చుకుని, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కావాలని అనుకున్నాడు. అయితే, నిఖిల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సోనాల్ అబార్షన్ చేయించుకుంది. దీంతో నిఖిల్ బాగా కృంగిపోయాడు. సోనాల్ అబార్షన్ చేయించుకోవడానికి దుర్గేష్ కారణమని భావించాడు. సోనాల్‌ను చంపడానికి నిశ్చయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రష్మీ, దుర్గేష్‌లు తమ పెద్ద కూతురుని స్కూలు నుంచి తీసుకురావడానికి వెళ్లారు. ఇంట్లో సోనాల్, రష్మీ చిన్న కూతురు మాత్రమే ఉన్నారు.
ఇదే అదునుగా భావించిన నిఖిల్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆపరేషన్ చేసే బ్లేడ్‌తో సోనాల్‌ను బెదిరించి చేతులు కాళ్లు కట్టేశాడు. నోటికి ప్లాస్టర్ వేశాడు. రష్మీ చిన్న కూతురి నోటికి కూడా ప్లాస్టర్ వేశాడు. మొదట సోనాల్ గొంతును బ్లేడుతో కోసి చంపేశాడు. తర్వాత చిన్నారి గొంతు కూడా కోసి చంపేశాడు. తన బిడ్డ భూమ్మీద పడకుండానే చచ్చిపోవడానికి కారణమైన దుర్గేష్ మీద పగతోనే అతడి కూతుర్ని చంపేశాడు. ఈ దారుణం తరువాత నిఖిల్ పరారయ్యాడు. కాసేపటి తరువాత ఇంటికి వచ్చిన రష్మీ, దుర్గేష్‌లు అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అతడు ఊర్లు మారుతూ ఉన్నాడు. చివరగా తన సొంతూరుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా రెండు హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
Updated Date - Jul 10 , 2025 | 02:05 PM