American Short Seller: వేదాంత ఓ పేక మేడ
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:45 AM
రెండున్నరేళ్ల క్రితం అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్‌పై అకౌంటింగ్ అక్రమాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అమెరికన్ షార్ట్ సెల్లర్...
భరించలేని స్థాయికి అప్పుల భారం.. రుణదాతలకు గండమే..
అమెరికన్ షార్ట్ సెల్లర్ వైస్రాయ్ రీసెర్చ్ నివేదిక
ఒకదశలో 8ు పతనమైన వేదాంత లిమిటెడ్ షేరు
న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల క్రితం అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్‌పై అకౌంటింగ్ అక్రమాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అమెరికన్ షార్ట్ సెల్లర్ వైస్రాయ్ రీసెర్చ్.. ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ నివేదిక విడుదల చేసింది. వేదాంత గ్రూప్ భరించలేని అప్పులు, నిధుల దోపి డీ, అకౌంటింగ్ అవకతవకల పునాదులపై నిర్మించిన ఓ పేక మేడ అని, ఎప్పుడైనా కూలవచ్చని వైస్రాయ్ రీసెర్చ్ అంటోంది. ఆర్థికంగా నిలకడ తప్పిన, వ్యాపార కార్యకలాపాల్లోనూ రాజీపడిన ఈ గ్రూప్‌తో రుణదాతలకు గండమేనని పేర్కొంది. గ్రూప్ కార్యకలాపాలు పోంజీ స్కీమ్‌ను తలపిస్తున్నాయంది. బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్ హోల్డింగ్ కంపెనీ వేదాంత రిసోర్సె్‌సను (వీఆర్‌ఎల్) సొంత కార్యకలాపాల్లేని ఓ పరాన్న జీవిగా అభివర్ణించింది. అప్పులు తిరిగి చెల్లించేందుకు ఈ కంపెనీ భారత అనుబంధ విభాగమైన వేదాంత లిమిటెడ్ నిధులను క్రమంగా పీల్చి పిప్పి చేస్తోందంటూ బుధవారం విడుదల చేసిన 85 పేజీల నివేదికలో వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వీఆర్‌ఎల్‌కు చెందిన బాండ్లు, ఇతర రుణ సాధనాలపై షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్లు వెల్లడించింది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు
గత 4 ఆర్థిక సంవత్సరాల్లో వేదాంత లిమిటెడ్ రూ.75,800 కోట్ల డివిడెండ్ చెల్లించగా.. గ్రూప్‌నకు చెందిన మరో కంపెనీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) రూ.57,300 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది. కాగా, వేదాంత లిమిటెడ్ జరిపిన డివిడెండ్ చెల్లింపుల్లో ఈక్విటీ వాటాకు అనుగుణంగా 56.38 శాతం నిధులు మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్‌కు (వీఆర్‌ఎల్) లభించాయి. హెచ్‌జెడ్‌ఎల్ డివిడెండ్ చెల్లింపుల్లోనూ 61.62 శాతం వీఆర్‌ఎల్‌కే దక్కాయి.
గత మూడేళ్లలో డివిడెండ్ చెల్లింపుల కారణంగా వేదాంత లిమిటెడ్ నగదు ప్రవాహ లోటు 560 కోట్ల డాలర్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి వేదాంత లిమిటెడ్ నికర రుణ భారం దాదాపు 200 శాతం పెరిగి 670 కోట్ల డాలర్లకు చేరుకుంది. నగదు నిల్వలు క్షీణించడంతో కంపెనీ మరిన్ని రుణాలను సేకరించే సామర్థ్యాన్ని, నిర్వహణ మూలధన వస్తువులను నగదీకరించుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది.
అదే సమయంలో వీఆర్‌ఎల్ రుణ వడ్డీ వ్యయాలు ఏటా 20 కోట్ల డాలర్ల చొప్పున పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 490 కోట్ల డాలర్ల స్థూల రుణంపై 15.8 శాతం వార్షిక వడ్డీ భారంతో మొత్తం వడ్డీ వ్యయాలు 83.5 కోట్లకు చేరాయని కంపెనీ వెల్లడించింది.
వేదాంత కీలక అనుబంధ సంస్థల్లో ఆర్థికంగా లాభదాయకం కాని ఆస్తులు, వెల్లడించని అప్పులు, వ్యవస్థాగత మోసం, పాలన వైఫల్యాలున్నట్లు మా ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. వేదాంత గణాంకాలన్నీ అభూత కల్పనలే.
ఆ ఆరోపణలు నిరాధారం: వేదాంత
వేదాంత గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వైస్రాయ్ రీసెర్చ్‌వి నిరాధార ఆరోపణలని, తమను సంప్రదించకుండానే ఎంపిక చేసిన తప్పుడు సమచారంతో నివేదికను విడుదల చేసిందని అంటోంది. ఇది తమ గ్రూప్‌ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమేనని పేర్కొంది.
వేదాంత షేరు ఢమాల్
వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో వేదాంత లిమిటెడ్ షేరు బీఎ్‌సఈలో ఒకదశలో 7.71 శాతం పతనమై రూ.421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కాస్త కుదురుకుని చివరికి 3.38 శాతం నష్టంతో రూ.440.80 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,022 కోట్ల మేర తగ్గి రూ.1.72 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 05:45 AM