Randstad Employer Brand Research: అత్యంత ఆకర్షణీయ బ్రాండ్లలో టాటా గూగుల్ ఇన్ఫోసిస్
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:57 AM
దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కార్పొరేట్ బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయని ‘రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2025...
రాండ్‌స్టడ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ కార్పొరేట్ బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయని ‘రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2025’ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఉద్యోగులు వృత్తి-వ్యక్తిగత జీవిత సంతులనం, ఈక్విటీ, ఆకర్షణీయ వేతనం సహా అదనపు ప్రయోజనాలు వంటి ఎంప్లాయీ వాల్యూ ప్రపొజిషన్స్ (ఈవీపీ)కు అధిక ప్రాధాన్యమిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆర్థిక సమృద్ధి, వృత్తిలో పురోగతి అవకాశాలు, పేరు ప్రతిష్ఠల విషయంలో టాటా గ్రూప్‌నకు అధిక స్కోర్ లభించిందని, తద్వారా లిస్ట్‌లో టాప్‌లో నిలిచిందని రాండ్‌స్టడ్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే గూగుల్ ఇండియా తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకోగా.. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో సామ్‌సంగ్ ఇండియా, జేపీ మోర్గాన్ చేజ్ 4, 5 స్థానాలను దక్కించుకోగా.. ఐబీఎం, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, డెల్, ఎస్‌బీఐ వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయంది. ఈ జాబితాలోని ఏకైక బహుళజాతి ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అని రిపోర్టు వెల్లడించింది. భారత్‌లో 3,500 మందితో సహా 34 మార్కెట్లలో 1.70 లక్షల మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రాండ్‌స్టడ్ ఈ నివేదికను రూపొందించింది. నివేదికలోని మరిన్ని విషయాలు..
నేటి తరం ఉద్యోగులు యజమాని నుంచి వేతనానికి మించి చాలా ఆశిస్తున్నారు. వృత్తితో పాటు వ్యక్తిగత జీవిత వృద్ధికి మద్దతిచ్చే సమగ్ర, భవిష్యత్ దృష్టితో కూడిన కంపెనీల్లో పనిచేయాలనుకుంటున్నారు.
సర్వేలో పాల్గొన్న వారిని ఆదర్శవంతమైన యాజమాన్యాలపై అభిప్రాయాన్ని కోరినప్పుడు, భారత కంపెనీల్లో వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యం, ఆకర్షణీయ వేతనం.. ప్రయోజనాల వంటి అంశాలు ఇంకా పరిష్కరించాల్సిన అంతరాలుగా కన్పించాయి.
ఈ ఏడాది నివేదిక స్పష్టమైన మార్పును ప్రతిబింబిస్తోంది. నేటితరం ఉద్యోగులు సంప్రదాయ ఉద్యోగాలతో సంతృప్తి చెందడం లేదు. ఈక్విటీ, ఉద్దేశం, అర్ధవంతమైన వృద్ధితో పాటు వృత్తి-వ్యక్తిగత జీవిత ఐక్యతను వారు కోరుకుంటున్నారని రాండ్‌స్టడ్ ఇండియా ఎండీ, సీఈఓ విశ్వనాథ్ పీఎస్ అన్నారు.
ఉద్యోగం మారుతాం..
కొత్త కొలువులోకి మారాలన్న అభిప్రాయం నిలకడగా పెరుగుతూ వస్తోందని, ముఖ్యంగా యువ నిపుణుల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోందని ఈ ఏడాది సర్వేలో వెల్లడైనట్లు రాండ్‌స్టడ్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో 47 శాతం మంది భారత ఉద్యోగులు కొత్త ఉద్యోగంలోకి మారాలని ఆలోచించారని.. జెన్ జెడ్ (51 శాతం), మిలీనియల్స్ (50 శాతం)లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. ఇది యాజమాన్యాలకు మేలుకొలుపు అని విశ్వనాథ్ అన్నారు. కేవలం ప్రోత్సాహకాలతో సరిపెట్టకుండా సంస్థలో విశ్వసనీయత, పారదర్శకత, ఉమ్మడి ప్రయోజనాలతో కూడిన సంస్కృతిని పెంచాలన్నారు. నైపుణ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో ప్రతిభావంతుల కోసం కంపెనీల మధ్య పోటీ మరింత పెరగనుందన్నారు.
వేగంగా పెరుగుతున్న ఏఐ వినియోగం
ఉద్యోగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వినియోగం శరవేగంగా పెరుగుతున్నదని నివేదిక తెలిపింది. భారత ఉద్యోగుల్లో 61 శాతం మంది ఏఐని తరుచుగా ఉపయోగిస్తున్నారు. అందులో మిలీనియల్సే అధికమని, గత ఏడాదితో పోలిస్తే ఏఐ వినియోగం 13 శాతం పెరిగిందని రిపోర్టు పేర్కొంది. తమ పనిపై ఏఐ గణనీయ ప్రభావం చూపిస్తోందని 38 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడినట్లు తెలిపింది.
టాప్-10 బ్రాండ్లు
ర్యాంక్ కంపెనీ
1 టాటా గ్రూప్
2 గూగుల్ ఇండియా
3 ఇన్ఫోసిస్
4 సామ్‌సంగ్ ఇండియా
5 జేపీ మోర్గాన్
6 ఐబీఎం
7 విప్రో
8 రిలయన్స్ ఇండస్ట్రీస్
9 డెల్ టెక్నాలజీస్
10 ఎస్‌బీఐ
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
Updated Date - Jul 23 , 2025 | 04:57 AM