సుప్రీం లో టెల్కోలకు చుక్కెదురు
ABN, Publish Date - May 20 , 2025 | 03:44 AM
దేశంలోని టెలికాం కంపెనీల (టెల్కో)కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తమ సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)పై చెల్లించాల్సిన బకాయిల నుంచి మినహాయింపు ఇప్పించాలన్న వొడాఫోన్ ఐడియా...
ఏజీఆర్ బకాయిల రద్దుకు నో
ప్రభుత్వం ఆదుకుంటే అడ్డురాం
న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం కంపెనీల (టెల్కో)కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తమ సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)పై చెల్లించాల్సిన బకాయిల నుంచి మినహాయింపు ఇప్పించాలన్న వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, టాటా టెలిసర్వీసెస్ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయ స్థానం తోసిపుచ్చింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఆర్ బకాయిలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టెల్కోలు పొరపాటుగా అర్థం చేసుకున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఈ పిటిషన్లు చూస్తుంటే ఆందోళన, ఆశ్చర్యం కలుగుతోంది. ఒక బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ) ఇలాంటి పిటిషన్ దాఖలు చేస్తుందని ఊహించలేం. ఈ పిటిషన్‌ను మేము డిస్మిస్ చేస్తున్నాం’ అని వొడాఫోన్ ఐడియాకు సుతిమెత్తగా చీవాట్లు పెట్టింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న టెల్కోలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే తాము అడ్డురామని వొడాఫోన్ కంపెనీ తరఫున వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గికి ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆదుకోవాలని ఉన్నా ఏజీఆర్ బకాయిలపై 2021 జూలైలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అందుకు అడ్డంకిగా ఉందని రోహత్గి ధర్మాసనానికి చెప్పారు. దాంతో ధర్మాసనం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు కొత్త చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందనే ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ కేసు
కేంద్ర టెలికాం శాఖ (డాట్) తమ సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కించేటప్పుడు ప్రధాన వ్యాపారం ఆదాయాన్ని తప్ప, ఇతర ఆదాయాలను లెక్కలోకి తీసుకోకూడదని టెల్కోలు గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. అయితే 2021 జూలైలో కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.93,000 కోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలను 10 సంవత్సరాల్లో ఏటా 10 శాతం చొప్పున చెల్లించాలని ఊరట ఇచ్చింది. ఆ విషయంలో కూడా వొడాఫోన్ ఐడియా విఫలమైంది. దీంతో ఈ బకాయిల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం కంపెనీ మూలధనం (ఈక్విటీ)లో తన వాటాగా మార్చుకుంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ఈక్విటీలో ప్రభుత్వానికి 48.99 శాతం వాటా ఉంది. 2021 జూలై నాటి తీర్పును సమీక్షించాలని వొడాఫోన్ ఐడియా ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశే మిగిలింది. ఈ విషయంలో వొడాఫోన్‌కు మినహాయింపు ఇస్తే దాన్ని తమకూ వర్తింప చేయాలని ఎయిర్‌టెల్, టాటా టెలిసర్వీసెస్ సుప్రీంకోర్టును కోరాయి. అయితే సుప్రీంకోర్టు సోమవారం ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు.
షేర్లు ఢమాల్
సుప్రీం తీర్పుతో వొడాఫోన్ ఐడియా షేర్లు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎ్‌సఈలో ఒక దశలో కంపెనీ షేర్లు 12.21 శాతం నష్టపోయి రూ.6.47 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకాయి. చివరికి 8.68 శాతం నష్టంతో రూ.6.78 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ షేర్ల మార్కెట్ విలువ రూ.6,933.95 కోట్లు తగ్గి రూ.72,914.86 కోట్లకు చేరింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇండస్ టవర్స్ షేర్లు 2.87 శాతం, టాటా టెలీ షేర్లు 0.46 శాతం నష్టపోయాయి. ఎయిర్‌టెల్ షేర్లలోనూ తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చివరికి 0.17 శాతం స్వల్ప లాభంతో రూ.1,817.40 వద్ద ముగిశాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 20 , 2025 | 03:44 AM