Selling Car-Tips: కారును విక్రయిస్తున్నారా.. మంచి ధర రావాలంటే ఇలా చేయండి
ABN, Publish Date - Jul 28 , 2025 | 09:01 AM
కారును విక్రయించదలిచిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ధరకు వాహనాన్ని అమ్మొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: సొంత కారు గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది పాతబడక తప్పదు. క్రమం తప్పకుండా కారును సర్వీసింగ్‌కు ఇస్తున్నా సరే ఒక్కోసారి కారుపై పడే గీతలు, సొట్టలు వంటివి మన దృష్టిని దాటిపోతాయి. ఇక కారు అమ్మాల్సిన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఆశించిన దాని కంటే తక్కువకే వెహికిల్‌ను విక్రయించాల్సి వస్తుంది. ఇలాంటి బెడద లేకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
కారు మెయిన్‌టెనెన్స్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు. కారు కంపెనీ సూచించిన దాని ప్రకారం, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి. చిన్న చిన్న సొట్టలు, అద్దాలు పగలడం వంటి లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. కారు అమ్మే సమయంలో ఇవి చాలా అక్కరకు వస్తాయి. మంచి ధరకు కారును విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.
కారులో యాక్సెసరీలు బాగుంటే మంచి ధరకు వాహనాన్ని విక్రయించొచ్చు. అధునాతన ఫీచర్లు, టెక్నాలజీ ఉన్న కార్లపై కొనుగోలుదార్లు ఆసక్తి ప్రదర్శిస్తారు. కాస్త ఎక్కువ ధర చెల్లించైనా సరే వాటిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆధునిక ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్స్, బ్లూ టూత్ కనెక్టివిటీ, బ్యాకప్ సెన్సర్లు, కెమెరా, నావిగేషన్ సిస్టమ్స్ వంటివి ఉంటే కారును అధిక ధరకు విక్రయించవచ్చు.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. కార్లకూ ఇది వర్తిస్తుంది. కారు పాతది అయినప్పటికీ కాస్త ఆకర్షణీయంగా కనబడితే మంచి ధరకు విక్రయించే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, కారుకు క్రమం తప్పకుండా వాషింగ్, వ్యాక్సింగ్ వంటివి చేయిస్తే పర్యావరణ ప్రభావం తగ్గుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కారు రంగును బట్టి కూడా ధర నిర్ణయమవుతుంది. ఈ అంశం వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే అయినా తెలుపు, నలుపు, సిల్వర్ రంగులో ఉన్న కార్లు అధిక ధరలకు విక్రయమవుతాయని అనేక మంది చెబుతున్నారు. కాబట్టి, ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తే కార్లను మంచి ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.
ఇవీ చదవండి:
మైనర్లకూ పాన్ కార్డు ఇస్తారని తెలుసా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
Updated Date - Jul 28 , 2025 | 09:08 AM