Mutual Fund: శామ్‌కో ఎం.ఎఫ్. నూతన లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్ ఆవిష్కరణ
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:31 PM
భారతీయ ఆర్థిక మార్కెట్లో నూతన శకానికి నాంది పలుకుతూ, శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించింది.
ముంబై: భారతీయ ఆర్థిక మార్కెట్లో నూతన శకానికి నాంది పలుకుతూ, శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించింది. గడచిన ఎనిమిది నెలలుగా గణనీయమైన కరెక్షన్ చూసిన మార్కెట్లు ప్రస్తుతం క్రమంగా పుంజుకునే సంకేతాలు చూపుతున్న వేళ, మూమెంటం పెట్టుబడి వ్యూహాలకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, స్థిరత్వం అందిచే లార్జ్ క్యాప్ స్టాక్స్, వృద్ధి అవకాశాలు కల్పించే మిడ్‌క్యాప్ కంపెనీల మేళవింపుతో ఈ వినూత్న ఫండ్‌ను శామ్‌కో పరిచయం చేసింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్.ఎఫ్.ఓ.) 2025 జూన్ 5న ప్రారంభమై, 2025 జూన్ 19న ముగుస్తుంది. శామ్‌కో సొంత C.A.R.E. (క్రాస్ సెక్షనల్, అబ్జల్యూట్, రెవెన్యూ, ఎర్నింగ్స్ మూమెంటం) వ్యూహంతో ఈ ఫండ్ పనిచేస్తుంది. లార్జ్ & మిడ్‌క్యాప్ విభాగంలో ఇలాంటి వ్యూహంతో పనిచేస్తున్న ఏకైక ఫండ్ ఇదే కావడం విశేషం. ఈ ఎన్.ఎఫ్.ఓ. ద్వారా పెట్టుబడిదారులు కనీసం రూ. 5,000 ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. లేదా నెలకు రూ. 500 నుండి సి.ఐ.పి. (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) రూపంలో (కనీసం 12 వాయిదాలు) పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్‌కు నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ (టి.ఆర్.ఐ.) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.
ఈ ఫండ్‌ను నిరాలీ భన్సాలీ, ఉమేష్ కుమార్ మెహతా, ధవళ్ జి. ధనాని సంయుక్తంగా నిర్వహిస్తారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా దేశంలోని టాప్ 250 కంపెనీల నుంచి ఎంపిక చేసిన సంస్థల స్టాక్స్‌తో ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా, లార్జ్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కనీసం చెరో 35 శాతం పెట్టుబడులను కేటాయించేలా ఈ ఫండ్ రూపొందించారు. "వైట్-బాల్ క్రికెట్‌లో బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్ కలయిక అయిన 'BASRA', ఒక ఆటగాడు చూపే ప్రభావాన్ని వివరిస్తుంది. అలాగే పెట్టుబడి విజయవంతం కావాలంటే స్థిరత్వం (యావరేజ్), మూమెంటం (స్ట్రైక్ రేట్) మధ్య సమతౌల్యం ఉండాలి. మా కొత్త ఫండ్ మధ్యేమార్గంగా, ఇదే కలయికతో సుస్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడుతుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ, నిలకడగా ఫలితాలనిచ్చే విధంగా మా C.A.R.E. మూమెంటం స్ట్రాటెజీని రూపొందించాం" అని శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విరాజ్ గాంధీ పేర్కొన్నారు.
ఈక్వస్ ఏరోస్పేస్ ఐపీఓ పత్రాలు దాఖలు
ఏరోస్పేస్, వినియోగదారుల రంగాలకు ప్రెసిషన్ తయారీ సేవలు అందిస్తున్న ఈక్వస్ లిమిటెడ్, తమ ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి రహస్యంగా సమర్పించింది. జూన్ 3, 2025న ఈ ప్రకటన చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 200 మిలియన్ డాలర్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తున్నారు. సంస్థలో ప్రముఖ ప్రపంచ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈక్వస్ మొత్తం ఆదాయం రూ. 988 కోట్లుగా నమోదైంది. కేపెక్స్ ప్రాజెక్టుల పూర్తి, ఏరోస్పేస్ విభాగంలో పెరుగుతున్న ఆర్డర్ల కారణంగా మధ్యకాలంలో వార్షిక ఆదాయం 45% వృద్ధి చెందుతుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది.
Updated Date - Jun 04 , 2025 | 10:31 PM