ఆర్‌కామ్‌ది రుణ మోసం
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:24 AM
అనిల్ అంబానీకి చెందిన దివాలా టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణాన్ని మోసపూరిత ఖాతాల్లో చేర్చాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయించింది. అలాగే, ఈ రుణ మోసంపై...
కంపెనీ రుణ ఖాతాను మోసాల జాబితాలో చేర్చాలని ఎస్‌బీఐ నిర్ణయం
అనిల్ అంబానీపైనా ఆర్‌బీఐకి ఫిర్యాదు
బ్యాంక్‌ల నుంచి రూ.31,580 కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన దివాలా టెలికం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణాన్ని మోసపూరిత ఖాతాల్లో చేర్చాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయించింది. అలాగే, ఈ రుణ మోసంపై ఆర్‌బీఐకి పంపనున్న నివేదికలో ఆర్‌కామ్ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీపైనా ఎస్‌బీఐ ఫిర్యాదు చేయనుంది. దీంతో, ఆర్‌కామ్‌కు గతంలో రుణాలిచ్చిన ఇతర బ్యాంక్‌లు సైతం ఎస్‌బీఐ బాటను అనుసరించే అవకాశం ఉంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని అనిల్ అంబానీ అన్నారు. రుణ నిధుల వినియోగంలో సంస్థ నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించడంతో ఆర్‌కామ్ రుణాన్ని మోసపూరిత ఖాతాల జాబితాలో చేర్చాలని ఎస్‌బీఐకి చెందిన మోసాల గుర్తింపు కమిటీ (ఎ్‌ఫఐసీ) నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించి జూన్ 23వ తేదీతో కూడిన లెటర్ ద్వారా ఎస్‌బీఐ తమకు సమాచారం అందించిందని ఆర్‌కామ్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంక్ ఏదైనా కంపెనీకిచ్చిన రుణాన్ని మోసపూరిత ఖాతాల జాబితాలో చేర్చినట్లయితే, ఆ విషయాన్ని 21 రోజుల్లో ఆర్‌బీఐకి రిపోర్ట్ చేయాలి. అలాగే, సీబీఐ లేదా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు బ్యాంక్‌ల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాలు తీసుకున్నాయని ఎస్‌బీఐ తన లేఖలో వెల్లడించింది. పలు బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఆర్‌కామ్ విఫలమవడంతో బ్యాంక్‌లు కంపెనీ రుణ ఖాతాలను 2016 లోనే మొండి పద్దుల జాబితాలో చేర్చాయి. అయితే, ఈ రుణాల వినియోగంలో నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణలపై స్పందించేందుకు గడిచిన రెండేళ్లలో ఆర్‌కామ్‌తో పాటు అనిల్ అంబానీకి పలు అవకాశాలివ్వడం జరిగిందని, వారి నుంచి సరైన స్పందన లభించలేదని ఎస్‌బీఐ పేర్కొంది. గత ఏడాది కెనరా బ్యాంక్ కూడా ఆర్‌కామ్ రుణ ఖాతాను మోసంగా వర్గీకరించింది. కానీ, బాంబే హైకోర్టు బ్యాంక్ నిర్ణయంపై స్టే విధించింది. ఎస్‌బీఐ తాజా చర్యలకు వ్యతిరేకంగా ఆర్‌కామ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
కంపెనీపై దివాలా పరిష్కార చర్యలు
ఆర్‌కామ్‌పై 2019 జూన్ నుంచి దివాలా పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దివాలా పరిష్కార ప్రక్రియకు రుణదాతల కమిటీ (సీఓసీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్ తుది ఆమోదం తెలుపాల్సి ఉంది. ఈ మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం రుణ బకాయిలు రూ.40,413 కోట్లుగా నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 05:24 AM