రూ.6.83 లక్షల కోట్లు
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:32 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..? ఈ ఫిబ్రవరి నాటికి ఆర్‌బీఐ 879 టన్నులు పోగేసింది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఈ నిల్వల ప్రస్తుత విలువ 7,999 కోట్ల డాలర్లు...
ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం విలువ ఇది
879 టన్నులకు చేరిన నిల్వలు
మన విదేశీ మారక నిల్వల్లో
11.4 శాతానికి పెరిగిన వాటా
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..? ఈ ఫిబ్రవరి నాటికి ఆర్‌బీఐ 879 టన్నులు పోగేసింది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఈ నిల్వల ప్రస్తుత విలువ 7,999 కోట్ల డాలర్లు. అంటే, మన కరెన్సీలో దాదాపు రూ.6.83 లక్షల కోట్లు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలను వివిధీకరించడంతో పాటు మారకం రేటు హెచ్చుతగ్గుల కారణంగా నిల్వల విలువ తగ్గకుండా ఉండేందుకు ఆర్‌బీఐ గడిచిన కొన్నేళ్లుగా పసిడి నిల్వలను వేగంగా పెంచుకుంటూ వస్తోంది. గత ఏడాది చివరి నాటికి మన ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 11.4 శాతానికి పెరిగింది. 2019లో ఇది కేవలం 6.7 శాతంగా ఉంది.
2024లో 72.6 టన్నులు కొనుగోలు
ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం.. గత సంవత్సరంలో ఆర్‌బీఐ 72.6 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. తద్వారా వీటి నిల్వలను మరో 9 శాతం పెంచుకుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు 2024లో మొత్తం 1,045 టన్నుల బంగారాన్ని పోగేయగా.. అందులో ఆర్‌బీఐదే రెండో అత్యధిక కొనుగోలు. గత ఏడాదిలోని 12 నెలల్లో 11 నెలలు ఆర్‌బీఐ ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.
2023లో పోగేసిన 16 టన్నులతో పోలిస్తే, 2024లో ఆర్‌బీఐ నాలుగు రెట్లకు పైగా బంగారం కొనుగోలు చేసింది.
ఇంతక్రితం 2021లోనూ ఇదే స్థాయిలో కొనుగోళ్లు జరిపింది. ఆ ఏడాది నిల్వలను 77.5 టన్నుల మేర పెంచింది.
ఈ ఏడాదిలోనూ మొదటి రెండు నెలల్లో (జనవరి, ఫిబ్రవరి) 2.8 టన్నులు కొనుగోలు చేసింది.
ఆర్‌బీఐ సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లన్నీ పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఏటా 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిపాయి.
పసిడి కొనుగోళ్లు (టన్నులు)
ఏడాది ఆర్‌బీఐ ప్రపంచ దేశాల
సెంట్రల్ బ్యాంక్‌లు
2021 77.5
2022 33.3 1,082
2023 16.2 1,037
2024 72.6 1,045
2025 2.8 44
(ఫిబ్రవరి వరకు)
3,300 డాలర్లు దాటిన ఔన్స్ గోల్డ్
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు 3,300 డాలర్లు దాటేసింది. గురువారం ఒక దశలో ఔన్స్ ధర 3,371 డాలర్ల వద్ద సరికొత్త ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ట్రంప్ సుంకాలు, వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాలు పసిడిని రోజుకో రికార్డు స్థాయికి చేరుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గోల్డ్ రేటు 25 శాతం పెరిగింది. 2024లోనూ 28 శాతం ఎగబాకింది. 2023లో 15 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన ఏడాది కాలంలో ఔన్స్ గోల్డ్ 1,000 డాలర్ల మేర పెరిగింది. పసిడి చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన వార్షిక ధర పెరుగుదల. మాంద్యం భయాలు, డాలర్ బలహీనపడుతుండటం, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లతో మున్ముందు బంగారం ధర మరింత ఎగబాకేందుకే అవకాశాలెక్కువని బులియన్ విశ్లేషకులు అంటున్నారు. సుంకాల విధ్వంసం తీవ్రతరమైతే ఈ ఏడాది చివరినాటికి ఔన్స్ గోల్డ్ 4,500 డాలర్ల వరకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్జాతీయ ఆర్థిక సలహాల సంస్థ డెవేర్ గ్రూప్ అంటోంది.
సంవత్సరాల వారీగా
ఈ నెలలో ఔన్స్ గోల్డ్ ధర
ఏప్రిల్ డాలర్లు
2021 1,725
2022 1,920
2023 2,000
2024 2,350
2025 3,300
67,783 కోట్ల డాలర్లకు ఫారెక్స్ నిల్వలు
ఈ నెల 11తో ముగిసిన వారంలో మన విదేశీ మారక నిల్వలు మరో 156.7 కోట్ల డాలర్ల మేర పెరిగి మొత్తం 67,783.50 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఫారెక్స్ నిల్వలు పెరగడం వరుసగా ఇది ఆరో వారం. కాగా, గత సెప్టెంబరులో నిల్వలు ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 70,488.5 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఆ తర్వాత కాలంలో మళ్లీ తగ్గుతూ వచ్చిన నిల్వలు గత నెల నుంచి కాస్త పుంజుకున్నాయి.
బంగారం దిగుమతులు 19% అప్
గత నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 192.13 శాతం పెరిగి 447 కోట్లకు డాలర్లకు చేరాయని కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు వేగంగా పెరగడం దిగుమతుల విలువ పెరుగుదలకు కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో పసిడి దిగుమతులు 27.27 శాతం పెరిగి 5,800 కోట్ల డాలర్లకు చేరాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి దిగుమతులు 4,554 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు పెరిగాయి. ఈ సమయంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరుండటంతో మదుపరులు పసిడిలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు.
మార్చిలో 447 కోట్ల డాలర్లకు చేరిక
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 19 , 2025 | 04:32 AM