Priority Sector Lending: మరికొంత కాలం లాభాలపై ఒత్తిడి తప్పదు
ABN, Publish Date - Jul 28 , 2025 | 02:12 AM
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ లాభాలపై ఒత్తిడి తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం పరిమితికి మించి ఇచ్చిన ప్రాధాన్యతా రుణాల్లో మరికొంత మొత్తాన్ని ఈ త్రైమాసికంలో అమ్మకానికి పెడుతోంది. బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు...
అమ్మకానికి ప్రాధాన్యతా రంగ రుణాలు
కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ లాభాలపై ఒత్తిడి తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం పరిమితికి మించి ఇచ్చిన ప్రాధాన్యతా రుణాల్లో మరికొంత మొత్తాన్ని ఈ త్రైమాసికంలో అమ్మకానికి పెడుతోంది. బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు ఈ విషయం వెల్లడించారు. జూన్ త్రైమాసికంలోనూ ఈ అధిక ప్రాధాన్యతా రంగ రుణాల్లో కొన్ని రుణాలను విక్రయించడం ద్వారా కెనరా బ్యాంక్ రూ.1,248 కోట్ల కమీషన్ ఆదాయం ఆర్జించింది. అయినా జూన్ త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంక్ మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రుణాల వాటా 45.63 శాతం వరకు ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన 40 శాతం కంటే ఇది 5.63 శాతం ఎక్కువ. ఈ అధిక ప్రాధాన్యతా రుణాలను కొనేందుకు మార్కెట్లో అనేక బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు రాజు చెప్పారు.
వడ్డీ రేట్లే సమస్య: వడ్డీ రేట్లు తగ్గడం వల్లే బ్యాంక్ లాభాలపై ఒత్తిడి పెరిగిందని ఎండీ, సీఈఓ రాజు చెప్పారు. ఆర్‌బీఐ కీలక రెపో రేటు ఈ ఏడాది ఫిబ్రవరి-జూన్ మధ్య ఒక శాతం తగ్గించింది. దీంతో కెనరా బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) జూన్ త్రైమాసికంలో 2.75 శాతానికి పడిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఆగస్టు లేదా అక్టోబరులో జరిగే సమావేశాల్లోనూ ఆర్‌బీఐ రెపో రేటు మరింత తగ్గిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే సెప్టెంబరు త్రైమాసికంలో 2.75 శాతం ఎన్‌ఐఎం కొనసాగించడం కష్టమవుతుందన్నారు. అయితే అక్టోబరు, మార్చి త్రైమాసికాల్లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉందని సత్యనారాయణ రాజు తెలిపారు.
భారత ఆర్థికానికి ఢోకా లేదు
ఎంపీసీ సభ్యుడు నగేశ్ కుమార్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ శక్తివంతంగా పురోగమిస్తున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం పైబడిన వృద్ధి రేటు సాధించే విషయంలో ఎలాంటి సవాలు ఎదురయ్యే స్థితి లేదని ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు నగేశ్ కుమార్ అన్నారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ రుణ సంక్షోభంతో పాటు అధిక ద్రవ్యోల్బణం, వృద్ధిలో మందగమనం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం వెలుగుదివ్వెగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. దేశీయ వినియోగమే భారత్‌కు బలమని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో వృద్ధి మరింత వేగం అందుకోవడంతో పాటు అది 7-7.5 శాతానికి కూడా చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం వినియోగదారుల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2 శాతానికి దిగివచ్చిందని, ఎంపీసీ అనుసరించిన విధానపరమైన వైఖరే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. మరో రెపో రేటు కోత అనేది విభిన్న స్థూల ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉంటుందని అంటూ ద్రవ్యోల్బణం 2 శాతానికి దిగివచ్చినంత మాత్రాన ఎల్లకాలం అక్కడే స్థిరంగా ఉండిపోతుందని అర్ధం కాదన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఎంపీసీ సమీక్ష ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
Updated Date - Jul 28 , 2025 | 02:13 AM