RBI Monetary Policy 2025: ఆర్‌బీఐ డబుల్ బొనాంజా
ABN, Publish Date - Jun 07 , 2025 | 05:30 AM
రుణగ్రహీతలు, బ్యాంకింగ్ రంగానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బంపర్ బొనాంజా ప్రకటించింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయాలతో గృహ, వాహన, వ్యక్తిగత రుణా లు మరింత చౌకగా లభించనున్నాయి.
రెపో, సీఆర్‌ఆర్‌లో భారీ కోత.. ఇక రుణాలు మరింత చౌక!
రెపో రేటు 0.50 శాతం తగ్గింపు ఫ 5.5 శాతానికి దిగివచ్చిన రెపో
5 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గుదల ఫ బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్ల బూస్ట్
సీఆర్‌ఆర్ ఒక శాతం తగ్గింపు ఫ 3 శాతానికి నగదు నిల్వల నిష్పత్తి
ద్రవ్యోల్బణం అంచనా 3.7 శాతం ఫ జీడీపీ వృద్ధి అంచనా 6.5శాతం
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్‌బీఐ
ఆగస్టు 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష
ముంబై: రుణగ్రహీతలు, బ్యాంకింగ్ రంగానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బంపర్ బొనాంజా ప్రకటించింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయాలతో గృహ, వాహన, వ్యక్తిగత రుణా లు మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే తీసుకున్న రెపో ప్రామాణిక రుణాలపై నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) భారం గణనీయంగా తగ్గనుంది. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను భారీగా పెంచేలా చర్యలు చేపట్టింది. బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపో రేటును 0.50 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. దాంతో రెపో 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. గడిచిన ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రెపో తగ్గుదల. అంతేకాదు, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్‌బీఐ రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఈ ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కోత పెట్టింది. కాగా, బ్యాంక్‌లకు నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దాంతో సీఆర్‌ఆర్ 3 శాతానికి జారుకోనుంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో అదనంగా రూ.2.5 లక్షల కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, సీఆర్‌ఆర్ తగ్గింపు సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో నాలుగు విడతల్లో అమలులోకి రానుంది. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా నిల్వ చేయాల్సిన నగదు నిష్పత్తిని సీఆర్‌ఆర్ అంటారు.
బ్యాంకుల్లో విదేశీ వాటా పరిమితి పెంచం..
దేశీయ బ్యాంకుల్లో విదేశీ యాజమాన్య వాటా పరిమితిని ప్రస్తుమున్న 15 శాతానికి మించి పెంచే ఆలోచన లేదని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని బ్యాంకులు అవసరమే. అయితే, నమ్మకమైన యాజమాన్యాలు, మేనేజర్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశీయ బ్యాంకులో విదేశీ సంస్థ గరిష్ఠంగా 15 శాతం వరకు వాటా కలిగి ఉండవచ్చు. ఇంతకు మించి వాటా పెంపునకు కేవలం అవసరానుగుణంగానే అనుమతించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సీఎస్‌బీ బ్యాంక్‌లో ప్రవాస భారతీయుడు ప్రేమ్‌వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ 51 శాతం వాటా కలిగి ఉంది. తాజాగా, యెస్ బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన ఎస్‌ఎంబీసీ 20 శాతం వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
ఇండ్‌సఇండ్ బ్యాంక్.. ఓకే!
ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన ఇండ్‌సఇండ్ బ్యాంక్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు. ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ బ్యాంక్ ఎండీ, సీఈఓ సుమంత్ కథ్పాలియా రాజీనామా చేయడం జవాబుదారీ చర్యకు మంచి ఉదాహరణగా చూడవచ్చన్నారు. అలాగే, సంక్షోభ కాలంలో బ్యాంక్ నియంత్రణ ప్రశ్నలన్నింటికీ కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు, బ్యాంక్ పై ఎలాంటి చర్య చేపట్టేందుకైనా ఆర్‌బీఐ సంకోచించదని, ఈ విషయంలో ఏమైనా నేరాలు జరిగి ఉంటే చట్టం తన పని చేస్తుందన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా ఇండ్‌సఇండ్ బ్యాంక్ సవాళ్లు ఎదుర్కొంటోంది. తమ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో రూ.2,100 కోట్ల అకౌంటింగ్ వ్యత్యాసాన్ని గుర్తించామని, ఇది బ్యాంక్ విలువను దాదాపు 2.35 శాతం వరకు ప్రభావితం చేయవచ్చని ఈ మార్చిలో ప్రకటించింది. దాంతో బ్యాంక్ షేరు భారీగా క్షీణించడంతో చిన్న మదుపరులు, ఇతర ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది.
క్రిప్టోలతో ఆర్థిక స్థిరత్వానికి భంగం
బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. అవి దేశ ఆర్థిక స్థిరత్వానికి భంగం వాటిల్లవచ్చని మల్హోత్రా అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్రిప్టోలపై ముసాయిదా చర్చాపత్రం రూపొందించే పనిలో ఉంది.
ఏకగ్రీవ నిర్ణయం కాదు..
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పరపతి సమీక్షలో భాగంగా మూడు రోజుల పాటు సమావేశమైంది. మార్కెట్లో ధరలు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి దోహదపడేలా కీలక వడ్డీ (రెపో) రేటును అర శాతం తగ్గించాలన్న ప్రతిపాదనకు ఐదుగురు సభ్యులు ఓటేయగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించారు.
భవిష్యత్‌పై తటస్థ వైఖరి
కీలక వడ్డీ రేటుపై భవిష్యత్ వైఖరిని ఆర్‌బీఐ సానుకూలం నుంచి తటస్థ స్థాయికి మార్చింది. అంటే, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాల డేటా ఆధారంగా భవిష్యత్‌లో రేట్లను మరింత తగ్గించడం లేదా పెంచే అవకాశాలుంటాయి. మున్ముందు వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకున్న అవకాశాలు పరిమితమేనని ఆర్‌బీఐ గవర్నర్ సంకేతాలిచ్చారు.
తదుపరి సమీక్ష తేదీల మార్పు
ఆగస్టులో నిర్వహించే సమీక్ష తేదీలను ఆర్‌బీఐ సవరించింది. ఈ మార్చిలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారంగా.. ఆగస్టు 5-7 తేదీల్లో ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ, పాలనపరమైన అవసరాల కారణంగా తదుపరి సమీక్ష సమావేశ తేదీలను ఆగస్టు 4-6 తేదీలకు మార్చడం జరిగిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం నామమాత్రమే
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై నామమాత్రమేనని ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు. ఉద్రిక్తతల సమయంలో ఉత్తర భారతంపై కొంత ప్రభావం పడిందన్నారు. ఎందుకంటే, ఆ సమయంలో విమానాశ్రయాలు మూతపడ్డాయి. విమాన ప్రయాణాలు తగ్గాయి. వస్తు సరఫరాకు కొంత ఆటంకం కలిగింది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణంపై దాని ప్రభావం లేదన్నారు. ఈ ఏప్రిల్ 22న పహల్గాంలో తీవ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఇందుకు కారణమైన పాకిస్థాన్ తీవ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సేన ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ మే 7న పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్రవాదులకు చెందిన 9 స్థావరాలను ధ్వంసం చేసింది. కాగా, దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలపైనా మల్హోత్రా స్పందించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వృద్ధి- ద్రవ్యోల్బణం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్‌బీఐ గతంలో ప్రకటించిన 6.5 శాతాన్ని యథాతథంగా కొనసాగించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, స్థిరత్వాన్ని ప్రదర్శించడంతోపాటు అంతర్జాతీయ అనిశ్చితులను అవకాశాలుగా మలుచుకోనుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను గతంలో ప్రకటించిన 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యల్ప ద్రవ్యోల్బణ అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కీలక ఉత్పత్తుల ధరలు అదుపులోనే ఉండవచ్చని ఆర్‌బీఐ భావిస్తోంది.
Updated Date - Jun 07 , 2025 | 05:35 AM