అండమాన్‌లో ఓఎన్‌జీసీకి జాక్‌పాట్
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:35 AM
అండమాన్ సముద్ర జలాల్లో భారీ చమురు నిక్షేపాలు బయటపడినట్టు సమాచారం. ఈ సముద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఇండియా...
1,160 కోట్ల బ్యారళ్ల చమురు నిక్షేపాలు
పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ వెల్లడి
న్యూఢిల్లీ: అండమాన్ సముద్ర జలాల్లో భారీ చమురు నిక్షేపాలు బయటపడినట్టు సమాచారం. ఈ సముద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ జరుపుతున్న అన్వేషణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సముద్ర జలాల్లో దాదాపు 1,84,440 కోట్ల లీటర్ల (సుమారు 1,160 కోట్ల బ్యారళ్లు)కు సమానమైన భారీ చమురు నిక్షేపాలు గురించిన శుభవార్త త్వరలోనే దేశ ప్రజలకు అందిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నిక్షేపం ఇటీవల దక్షిణ అమెరికాలోని గయానాలో కనుగొన్నంత భారీ స్థాయిలోనే ఉంటుందన్నారు. దీంతో దేశ చమురు, గ్యాస్ ఉత్పత్తిలో అండమాన్ నికోబార్ దీవులు కూడా చేరనున్నాయి.
హెస్ కార్పొరేషన్, చైనాకు చెందిన సీఎన్‌ఓఓసీ కంపెనీలు గయానాలో ఇటీవల 1,160 కోట్ల పీపాల భారీ చమురు నిక్షేపాన్ని కనుగొన్నాయి. దీంతో చమురు నిక్షేపాలపరంగా గయానా ప్రపంచంలో 17వ స్థానానికి చేరింది.
వెలికితీత ఖర్చే
అయితే అండమాన్ సముద్రంలో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత అంత తేలిక కాదని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో బావి తవ్వకం కోసం ఎంతలేదన్నా 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.850 కోట్లు) వరకు ఖర్చవుతుందన్నారు. గయానాలోనూ కొత్త చమురు, గ్యాస్ నిక్షేపాల ఆచూకీ కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చింది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీతో పాటు ఒక్కో బావి తవ్వకం కోసం 10 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఓఎన్‌జీసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి కోసం రూ.37,000 కోట్ల ఖర్చు చేసింది. ఇందులో పెద్ద మొత్తం అండమాన్, నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకం కోసం ఖర్చు చేసినట్టు అధికార వర్గాలు చెప్పాయి.
చమురుకు ఢోకా లేదు
మరోవైపు మన దేశంలో ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మూడు నెలల అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నట్టు తెలిపాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించడం విశేషం. అయితే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే మాత్రం మన చమురు సరఫరాలకు ముప్పు తప్పకపోవచ్చన్నారు. ఆ ప్రమాదం లేనంత వరకు పీపా చమురు ధర కూడా 75 డాలర్లు మించక పోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ వారం కీలక భేటీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అధికార, వాణిజ్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. నౌకాయాన కంపెనీలు, కంటైనర్ కంపెనీలు, ఎగుమతిదారుల, వాణిజ్యంతో సంబంధం ఉన్న ఇతర సంస్థల ప్రతినిధులనూ ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ భర్త్‌వాల్ చెప్పారు. తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం భారత-అమెరికా మధ్య జరుగుతున్న చర్యలు జూలై 9 లోగానే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 17 , 2025 | 01:35 AM