ఎన్ఎస్ఈలో మంగళవారం బీఎస్ఈలో గురువారం
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:25 AM
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజులు మారబోతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ కాంట్రాక్టుల ముగింపు రోజు...
ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజుల్లో మార్పులు
ఆమోదం తెలిపిన సెబీ.. సెప్టెంబరు 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజులు మారబోతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ కాంట్రాక్టుల ముగింపు రోజు గురువారం కాగా, మంగళవారానికి మార్చేందుకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. అలాగే, బీఎస్ఈలో ప్రస్తుతం ఈ కాంట్రాక్టుల ముగింపు రోజు మంగళవారం కాగా, గురువారానికి మారనుంది. 2025 సెప్టెంబరు 1న లేదా ఆ తర్వాత ముగియనున్న కొత్త ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టులన్నింటికీ ఈ మార్పు వర్తించనుంది. ఆగస్టు 31న లేదా అంతకంటే ముందు ముగియనున్న కాంట్రాక్టులకు మాత్రం ప్రస్తుత ముగింపు షెడ్యూలే వర్తిస్తుందని స్టాక్ ఎక్స్చేంజీలు స్పష్టం చేశాయి. వచ్చే నెల 1 నుంచి ఇండెక్స్ ఫ్యూచర్స్‌పై కొత్త వీక్లీ కాంట్రాక్టులను ప్రవేశపెట్టబోవడం లేదని బీఎ్‌సఈ వెల్లడించింది. అలాగే, ఇప్పటికే ప్రవేశపెట్టిన కాంట్రాక్టుల్లో లాంగ్ డేటెడ్ ఇండెక్స్ ఆప్షన్‌తో కూడిన వాటికి కూడా ప్రస్తుత షెడ్యూల్‌లో మార్పు ఉండదని ఎక్స్ఛేంజీలు తెలిపాయి.
ముగింపు రోజుల్లో మార్పు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలు సమగ్ర వివరాలతో కూడిన సర్క్యులర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఎక్స్ఛేంజీల్లో అన్ని ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజును మంగళవారం లేదా గురువారానికి పరిమితం చేయాలంటూ గత నెలలో సెబీ ఆదేశించింది. అలాగే, ఏదైనా కాంట్రాక్టును ప్రవేశపెట్టేటప్పుడు లేదా ముగింపు రోజును మార్చేటప్పుడు తన అనుమతి తీసుకోవాలని ఎక్స్చేంజీలను సెబీ కోరింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టు ముగింపు రోజుల్లో ఎక్స్ఛేంజీలు కోరిన మార్పులకు సెబీ తాజాగా ఆమోదం తెలిపింది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 18 , 2025 | 05:25 AM