మిడ్‌వెస్ట్ నుంచి రేర్ ఎర్త్ మాగ్నెట్స్
ABN, Publish Date - Jun 10 , 2025 | 04:40 AM
ఆటోమొబైల్స్, విండ్ టర్బైన్స్, సెమీకండక్టర్లలో విరివిగా ఉపయోగించే అరుదైన లోహాల మాగ్నెట్స్ ఉత్పత్తికి హైదరాబాద్‌కు చెందిన మిడ్‌వెస్ట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ (ఎంఏఎం) సిద్ధమవుతోంది....
డిసెంబరుకల్లా ఉత్పత్తి ప్రారంభం
చైనా కుయుక్తులకు చెక్ !
ఆటోమొబైల్స్, విండ్ టర్బైన్స్, సెమీకండక్టర్లలో విరివిగా ఉపయోగించే అరుదైన లోహాల మాగ్నెట్స్ ఉత్పత్తికి హైదరాబాద్‌కు చెందిన మిడ్‌వెస్ట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ (ఎంఏఎం) సిద్ధమవుతోంది. హైదరాబాద్ సమీపంలో ఏటా 500 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పా టు చేయనున్న ఈ ప్లాంటులో డిసెంబరు నాటికల్లా ఉత్పత్తి ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ కథనం వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లతో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,000 టన్నులకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోందని తెలిపింది. ఈ మాగ్నెట్ల ఉత్పత్తికి కీలక ముడి పదార్ధమైన మొనాజైట్‌ను శ్రీలంకలోని ఎంఏఎం సొంత గనుల నుంచి దిగుమతి చేసుకుంటుంది. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తిలో పేరొందిన మిడ్‌వెస్ట్ లిమిటెడ్‌కు ఎంఏఎం అనుబంధ సంస్థ.
తీవ్ర కొరత:ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తిలో ప్రస్తుతం చైనాదే హవా. ప్రపంచం ఉత్పత్తిలో చైనా వాటా 80 శాతానికిపైగా ఉంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చైనా వీటి ఎగుమతులను నిషేధించింది. మన దేశానికి చేసే ఎగుమతులపైనా అనేక ఆంక్షలు విఽధించి వీటి సరఫరాను కట్టడి చేస్తోంది. ఈ దెబ్బకు అమెరికా, యూర్‌పలోని కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి నిలిపి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో మిడ్‌వెస్ట్ దేశీయంగా వీటి ఉత్పత్తికి సిద్ధమవుతోంది.
దేశీయ టెక్నాలజీ: ఈ మాగ్నెట్ల ఉత్పత్తికి అవసరమైన కీలక ఖనిజాల ప్రాసెసింగ్ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నది. ఇందుకు అవసరమైన టెక్నాలజీని కూడా మిడ్‌వెస్ట్.. హైదరాబాద్‌లోని నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ (ఎన్‌ఎంటీడీసీ) నుంచే సమకూర్చుకుంది. ఈ మాగ్నెట్ల సరఫరా కోసం కంపెనీ ఇప్పటికే దేశంలోని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు, విండ్ టర్బైన్ కంపెనీలు, ఎంఆర్‌ఐ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 10 , 2025 | 04:40 AM