Richest Man : నేపాల్‌లో అత్యంత ధనవంతుడు బినోద్ చౌదరి.. ఆసక్తికర విషయాలు
ABN, Publish Date - Aug 12 , 2025 | 05:14 PM
బినోద్ చౌదరి. నేపాల్‌లో అత్యంత సంపన్నుడు.. ఏకైక బిలియనీర్. వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా, సమాజ సేవకుడిగా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. దక్షిణాసియా వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.
ఇంటర్నెట్ డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 107.1 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశ సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 78 బిలియన్ డాలర్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. పొరుగున ఉన్న నేపాల్ లో అత్యంత సంపన్నుడు ఎవరో తెలుసా.. బినోద్ చౌదరి. ఆయన నికర ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 16,700 కోట్లు.
బినోద్ చౌదరి. నేపాల్‌లో అత్యంత సంపన్నుడు.. ఏకైక బిలియనీర్. వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా, సమాజ సేవకుడిగా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన నేపాల్‌లోని అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు, దక్షిణాసియా వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం 2024లో ఆయన సంపద సుమారు 2 బిలియన్ డాలర్లు (దాదాపు 16,700 కోట్ల రూపాయలు)గా అంచనా వేశారు. ఆయన స్థాపించిన చౌదరి గ్రూప్ (సిజి కార్ప్ గ్లోబల్) ద్వారా వై వై నూడుల్స్ వంటి అనేక బ్రాండ్‌లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.
18 ఏళ్ల వయసులో బినోద్ చౌదరి చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి భారతదేశానికి రావాలనుకున్నారు. అయితే, ఆయన తండ్రికి గుండె జబ్బు రావడంతో, కుటుంబ వ్యాపార బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. ఈ నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చివేసింది.
బినోద్ చౌదరి వ్యాపార జీవితంలో మొదటి స్వతంత్ర వెంచర్ 1973లో కాపర్ ఫ్లోర్ అనే డిస్కోటెక్ కంపెనీ. ఈ వ్యాపారం ఖాట్మాండులో ధనవంతులు, ప్రముఖులను ఆకర్షించి భారీ విజయాన్ని సాధించింది. 1979లో, జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ నేషనల్ పానాసోనిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇది ఆయన మొదటి అంతర్జాతీయ ఒప్పందం.
బినోద్ చౌదరి నాయకత్వంలో, చౌదరి గ్రూప్ 16 వ్యాపార రంగాల్లో 200కు పైగా కంపెనీలతో 32 దేశాల్లో విస్తరించింది. ఈ గ్రూప్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, బయోటెక్ వంటి రంగాల్లో పనిచేస్తుంది. సిజి హాస్పిటాలిటీ, భారతదేశంలోని తాజ్ హోటల్స్‌తో కలిసి 12 దేశాల్లో 134 హోటల్స్, రిసార్ట్‌లను నిర్వహిస్తోంది. 2025 నాటికి 200 హోటల్స్, 2030 నాటికి 650 హోటల్స్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
Updated Date - Aug 12 , 2025 | 05:47 PM