ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా
ABN, Publish Date - Jun 29 , 2025 | 02:57 AM
వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా...
వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా చేస్తే కష్ట సమయాల్లో అక్కరకు రాకపోగా మన జేబుకే చిల్లు పడే ప్రమాదం ఉంది.
చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండానే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు. పాలసీ షరతులు, పరిమితుల గురించి పెద్దగా తెలుసుకోకుండానే ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి పాలసీలు తీసుకుంటున్నారు. పాలసీ తీసుకున్నాం, ఇక ఏ ఆరోగ్య సమస్య వచ్చినా బీమా కంపెనీనే భరిస్తుందనే భ్రమల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో చాలా మంది స్విగ్గీ, జొమాటాలో బిర్యానీ లేదా ఇతర తినుబండారాలు ఆర్డర్ చేసినంత ఈజీగా ఆరోగ్య బీమా పాలసీలు కొనేస్తున్నారు. ఆ పాలసీ షరతులు ఏంటి? కవరేజీ పరిమితులు, మినహాయింపుల గురించి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో చేరేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిమితులు, మినహాయింపులను అడ్డుపెట్టుకుని బీమా కంపెనీలూ క్లెయిమ్స్‌కు సారీ చెబుతున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అవేమిటంటే..
అవగాహన
ఆరోగ్య బీమా అనేది ఒక భరోసా. అయితే వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీల ఏజెంట్లు ఇప్పుడు దీన్ని కూడా వస్తువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పాలసీ తీసుకునే వ్యక్తికి పెద్దగా అవగాహన లేకపోతే లేని ప్రయోజనాలను ఉన్నట్టు చెప్పి మరీ అంటగడుతున్నారు. కాబట్టి కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తి లేదా వ్యక్తులు పాలసీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం పాలసీ షరతులు, కవరేజీ పరిమితులు, మినహాయింపులను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థంగాకపోతే ఎవరైనా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
ఇప్పటికే ఉన్న వ్యాధులు
దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ అనుమతించవు. కనీసం రెండు మూడేళ్ల తర్వాతే ఇందుకు అనుమతిస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే కవరేజీ కావాలంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువ చెల్లించాలి.
మెటర్నిటీ ట్రీట్‌మెంట్లు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే మెటర్నిటీ ట్రీట్‌మెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేకపోతే బీమా కంపెనీలు ఇందుకు అనుమతించవు. ఒకవేళ అనుమతించినా అందుకు సవాలక్ష పరిమితులు, ఆంక్షలు పెడుతుంటాయి.
ఆధునిక ట్రీట్‌మెంట్లు
ఆరోగ్య సమస్యలతో పాటు ట్రీట్‌మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడు అధునాతన రోబోటిక్ సర్జరీలు, జన్యు (జెనెటిక్) పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. పాలసీ తీసుకునేటప్పుడే ఇవి కూడా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.
మానసిక రుగ్మతలు
మానసిక రుగ్మతలకు కూడా ఆరోగ్య బీమా వర్తింప చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆప్షన్ ఒకటి ఉందనే విషయాన్ని బీమా కంపెనీలు పెద్దగా పాలసీదారులకు చెప్పడం లేదు. మానసిక ఒత్లిళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ కింద ఈ రుగ్మతలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
గదుల అద్దె
కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరక తప్పదు. అయితే ఇందుకు అయ్యే రూమ్ రెంట్‌పై బీమా కంపెనీలు అనేక పరిమితులు పెడుతుంటాయి. ఆ పరిమితికి మించి రూమ్ రెంట్ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని పాలసీదారులే భరించాలి. కొన్ని బీమా కంపెనీలు రూమ్ రెంట్ ఎంత ఉన్నా, అది పాలసీ కవరేజీకి లోబడి ఉంటే చాలని చెబుతున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే పాలసీదారులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే జేబుకు చిల్లు పడుతుంది.
ఓపీడీ, వ్యాధి నిర్ధారణ
ఇవాళ ఔట్ పేషెంట్ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా పెద్దభారంగా మారాయి. పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్ కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే ఈ ఖర్చులకూ కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే బీమా కంపెనీలు ఒక పరిమితి వరకే ఈ ఖర్చులను అనుమతిస్తాయి.
ఇతర జాగ్రత్తలు
పాలసీ తీసుకునే ముందే పాలసీ బ్రోచర్‌ను కాకుండా పాలసీ పూర్తి డాక్యుమెంట్ తీసుకుని చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
పాలసీ ద్వారా ఏయే సమస్యలకు కవరేజీ లభించదో ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి.
బీమా కంపెనీల పరిభాష అందరికీ అర్థం కాదు. పాలసీలో పేర్కొనే సబ్ లిమిట్స్, కో-పే, వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
వివాహం, పిల్లలు పుట్టినప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.
మీ ఆరోగ్య బీమా పాలసీ కంపెనీ, పాలసీ వివరాలపై కుటుంబసభ్యులకు ముందుగానే పూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విషయాలు చక్కబెట్టాల్సిందే వారే.
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అవసరమైనప్పుడు జేబులో పైసా ఖర్చు చేయకుండా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కవచ్చు. లేకపోతే ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇవీ చదవండి:
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు
ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 02:57 AM