హైదరాబాద్ రక్షణ కంపెనీల హవా
ABN, Publish Date - May 15 , 2025 | 03:41 AM
‘ఆపరేషన్ సిందూర్’తో హైదరాబాద్‌లో ఉన్న రక్షణ రంగంలోని కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్‌తో పాటు ప్రైవేట్ రంగంలోని...
హైదరాబాద్ ‘రక్షణ’ కంపెనీల హవా
ఆపరేషన్ సిందూర్‌తో ఆర్డర్ల వెల్లువ
వారం వారం సరఫరాలు షురూ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ‘ఆపరేషన్ సిందూర్’తో హైదరాబాద్‌లో ఉన్న రక్షణ రంగంలోని కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్‌తో పాటు ప్రైవేట్ రంగంలోని ఎంటార్ టెక్నాలజీస్, అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, అస్త్రా మైక్రోవేవ్, కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, అనంత్ టెక్నాలజీస్, రఘవంశీ, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు సైనిక దళాల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో ఈ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ విడి భాగాలు తమ సత్తా చాటాయి. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పాక్‌తో కాల్పుల విరమణ కుదిరినా, అది తాత్కాలికమేనని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు, డ్రోన్లను పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శరవేగంగా సరఫరాలు
గతంలో సైనిక దళాల నుంచి వచ్చిన ఆర్డర్లను కంపెనీలు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేసేందుకు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు కొద్ది నెలల్లోనే సరఫరాలు పూర్తి చేయాలని సైనిక దళాలు కోరుతున్నాయి. దీంతో వారాంతాల్లో కూడా పని చేస్తూ, ఏ వారానికి ఆ వారం సరఫరాలు చేయాల్సి వస్తోందని బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైల్స్, డ్రోన్లకు అవసరమైన కీలక విడిభాగాలు సరఫరా చేసే ఒక కంపెనీ అధినేత చెప్పారు.
మరిన్ని ఆర్డర్లు
ఇక భారత్‌లో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా దాన్ని పాక్ ప్రభుత్వ దాడిగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇదే సమయంలో కీలక రక్షణ స్థావరాలు, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందుకు అవసరమైన డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోళ్లపై ఉన్నత సైనికాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని యాంటీ డ్రోన్ల వ్యవస్థలను తయారు చేసే ఒక కంపెనీ అధినేత చెప్పారు. పాక్ సైన్యం నుంచి గతంలోలా భూతలం నుంచి నుంచి కాకుండా ఇక గగనతలం నుంచే అసలు ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఎంటార్‌కు రూ.34 కోట్ల ఆర్డర్
ఎంటార్ టెక్నాలజీస్ సంస్థ కొత్తగా రూ.34 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ కింద ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఏరోస్పేస్, కాలుష్య రహిత ఇంధన రంగాలకు కీలకమైన ఇంజనీరింగ్ ఉత్పత్తులు సరఫరా చేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 15 , 2025 | 03:42 AM