అప్పుల భారం తగ్గించుకోండి..
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:18 AM
చలన (ఫ్లోటింగ్) వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకున్న వారికి ఆర్‌బీఐ ఇటీవల మరోసారి శుభవార్త చెప్పింది. బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాపై వసూలు చేసే రెపో రేటును మరో పావు (0.25) శాతం కుదించింది. దీంతో దాదాపు...
వడ్డీ రేట్లు దిగొస్తున్నాయ్..
దేశంలో వడ్డీ రేట్లు దిగొస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటు మరో పావు శాతం తగ్గించి ఆరు శాతానికి కుదించింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది చివరికల్లా రెపో రేటు మరో అర శాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని గృహ రుణ భారం తగ్గించుకునేందుకు ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...
చలన (ఫ్లోటింగ్) వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకున్న వారికి ఆర్‌బీఐ ఇటీవల మరోసారి శుభవార్త చెప్పింది. బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాపై వసూలు చేసే రెపో రేటును మరో పావు (0.25) శాతం కుదించింది. దీంతో దాదాపు అన్ని బ్యాంకులు తమ రెపో ఆధారిత లేదా ఏదైనా ఇతర ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆఽధారిత గృహ రుణాల వడ్డీ రేట్లనూ కుదిస్తున్నాయి. దాంతో ఈ రుణాల నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) దిగి వస్తున్నాయి. దీన్ని అప్పుల భారం తగ్గించుకునేందుకు ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.
పాక్షిక చెల్లింపు
ఒకవేళ చేతిలో మిగులు నిధులు ఉంటే మీ గృహ రుణంలో కొంత మొత్తాన్ని ముందే పాక్షికంగా చెల్లించడం మంచిది. కాకపోతే ఈ చెల్లింపు మీ నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీయకుండా చూసుకోవాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గడంతో పాటు రుణ చెల్లింపు కాల పరిమితి త్వరగా పూర్తవుతుంది.
ఈఎంఐల కొనసాగింపు
వడ్డీ రేటు తగ్గడంతో ఈఎంఐల భారమూ తగుతుంది. దీనికి మురిసిపోయి ఈఎంఐని కుదించుకోవద్దు. గతంలోలానే ఈఎంఐని కొనసాగించండి. దీంతో అదనంగా చెల్లించే ఈఎంఐ అసలు కింద జమ చేయబడుతుంది. రుణ చెల్లింపు కాల పరిమితి తగ్గుతుంది.
చర వడ్డీ రేట్లు
గృహ రుణం తీసుకునేటప్పుడే చర వడ్డీ రేటును ఎంచుకోవాలి. దీనివల్ల మన దగ్గర మిగులు నిధులు ఉన్నపుడు కొంత రుణాన్ని ముందుగానే చెల్లించవచ్చు. దీనిపై బ్యాంకులు ఎలాంటి పెనాల్టీ చార్జీలు వసూలు చేయవు. ఏటా ఇలా రెండు మూడు చెల్లింపులు చేసినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో వడ్డీ ఖర్చులు ఆదా అవుతాయి.
రీఫైనాన్స్‌కు వెళ్లడం
ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేటుతో దాదాపు అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎ్‌ఫసీ) కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఒకవేళ మీకు గృహ రుణం ఇచ్చిన బ్యాంకు ఆ పని చేయకపోతే.. మీ గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే వేరే బ్యాంకు లేదా హెచ్‌ఎ్‌ఫసీకి మార్చుకోవడం మంచిది. కాకపోతే ఇందుకు మిగిలిన రుణ మొత్తంపై పావు శాతం నుంచి ఒక శాతం వరకు ఖర్చులవుతాయి. టెక్నికల్, లీగల్ చార్జీల కింద రూ.5,000 నుంచి రూ.15,000, అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కింద మరో రూ.1,000 నుంచి రూ.5,000 వసూలు చేస్తారు. సరిగ్గా బేరమాడగలిగితే కొత్త రుణదాతకు ఈ చార్జీలను కొంత వరకు తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ పాత రుణ దాతలు కూడా అదే వడ్డీ రేటుకు సిద్ధపడితే.. రీ ఫైనాన్స్ ప్రయత్నం పక్కన పెట్టడం మంచిది.
పన్ను ప్రయోజనాలు
రుణాన్ని ముందుగానే చెల్లించడం వల్ల పన్ను ప్రయోజనాలు పోతాయనే బెంగ అవసరం లేదు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద యధావిధిగా ఏటా రూ.1.5 లక్షల అసలు, సెక్షన్ 24 (బీ) కింద రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఇందుకోసం చేతిలో డబ్బులు ఉన్నాయి కదాని ఒకేసారి ముందస్తు చెల్లింపులు చేయవద్దు. ఏటా పన్ను పోటు తగ్గేలా కొద్ది కొద్దిగా ముందస్తు చెల్లింపులు చేయడం మంచిది.
పొదుపు
వడ్డీ రేట్లు తగ్గడం మన నెలవారీ బడ్జెట్‌ను కూడా ఆదా చేస్తుంది. దీన్ని తెలివిగా గృహ రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలి. అంతే తప్ప, తగ్గే ఈఎంఐల భారాన్ని వేరే ఖర్చులకు మళ్లించకూడదు.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 20 , 2025 | 04:18 AM