విశాఖలో జిప్సమ్ ప్లాస్టర్ తయారీ ప్లాంట్
ABN, Publish Date - May 14 , 2025 | 05:05 AM
ఫాస్ఫో జిప్సమ్ ఆధారిత హరిత భవన సామగ్రి తయారీ, విక్రయం కోసం సకర్ణి ప్లాస్టర్‌తో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసుకునేందుకు కోరమాండల్ కెమికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జేవీలో...
కోరమాండల్, సకర్ణి గ్రూప్ భాగస్వామ్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫాస్ఫో జిప్సమ్ ఆధారిత హరిత భవన సామగ్రి తయారీ, విక్రయం కోసం సకర్ణి ప్లాస్టర్‌తో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసుకునేందుకు కోరమాండల్ కెమికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జేవీలో భాగంగా విశాఖపట్టణంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ ప్లాంట్‌కు సమీపంలోనే జిప్సమ్ ప్లాస్టర్ తయారీకి ఒక అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఎరువుల తయారీ ద్వారా అందుబాటులోకి వచ్చే అనుబంధ ఉత్పత్తి జిప్సమ్ ఈ ప్లాంట్‌కు ముడిసరకుగా ఉపయోగపడుతుంది. కేంద్రప్రభుత్వ సర్కులర్ ఎకానమీ లక్ష్యాలకు దీటుగా సుస్థిర హరిత భవన ఉత్పత్తుల తయారీ కోసం దేశంలో ఏర్పాటవుతున్న తొలి భారీ వెంచర్ ఇదే. కోరమాండల్ గ్రూప్ వ్యవసాయ ఉపకరణాల వ్యాపార విభాగం నుంచి తన పరిధిని విస్తరించుకుని ఇతర వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించేందుకు, తద్వారా దీర్ఘకాలిక విలువ సృష్టించేందుకు ఈ ఒప్పందం సహాయకారి అవుతుంది. అలాగే సాకర్ణి గ్రూప్ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించి సరికొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు, జిప్సమ్ ప్లాస్టర్ పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుంది. వేగంగా విస్తరిస్తున్న జిప్సమ్ ప్లాస్టర్ పరిశ్రమలోని అవకాశాలను రెండు కంపెనీలు కైవసం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
కోరమాండల్ తయారీ సామర్థ్యాలు, సకర్ణి మార్కెట్ ఆధిపత్యం రెండింటినీ ఉపయోగించుకోవడం ద్వారా వేగంగా విస్తరిస్తున్న గృహనిర్మాణం, మౌలిక వసతుల రంగాలకు అత్యున్నత నాణ్యత గల, పర్యావరణ మిత్రమైన జిప్సమ్ సొల్యూషన్లు అందుబాటులోకి తేగలుగుతామని కోరమాండల్ ఇంటర్నేషనల్ సీఈఓ శంకర సుబ్రమణియన్ అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 14 , 2025 | 05:05 AM