హైదరాబాద్ టు అడిస్ అబాబా
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:13 AM
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్ నుంచి అడిస్ అబాబాకు నేరుగా విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. మంగళవారం నుంచి ఈ డైరెక్ట్ విమాన సేవలను...
విమాన సర్వీస్ ప్రారంభించిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్
మెడికల్ టూరిజానికి ఊతం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్ నుంచి అడిస్ అబాబాకు నేరుగా విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. మంగళవారం నుంచి ఈ డైరెక్ట్ విమాన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ సర్వీసెస్) టెక్లెహమ్మన్నోత్ జీ యోహన్నెస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వారానికి మూడు సార్లు (సోమ, బుధ, శనివారం), అడిస్ అబాబా నుంచి మంగళ, గురు, శని వారాల్లో ఈ విమాన సర్వీ్‌సను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ఇప్పటికే భారత్‌లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాల నుంచి వారానికి 50 ప్రయాణికుల, కార్గో విమాన సర్వీసులను నిర్వహిస్తోందన్నారు.
వృద్ధికి అపార అవకాశాలు: భారత్‌లో మెడికల్ టూరిజం శరవేగంగా వృద్ధి చెందుతూ వస్తుండటం ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు ఎంతగానో కలిసిరానుందని యోహన్నెస్ తెలిపారు. ఇందుకు తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక సేవలను అందించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రధాన హాస్పిటల్స్‌తో ఇప్పటికే చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మెడికల్ టూరిజం ప్యాకేజీ పేరుతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నట్లు యోహన్నెస్ తెలిపారు. కాగా హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో కార్గో సేవలను ప్రారంభించాలని చూస్తున్నామన్నారు. కొవిడ్ సమయంలో పాక్షికంగా ఫార్మా ఉత్పత్తులను రవాణా చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో ఫార్మా సహా ఐటీ సంబంధిత ఎగుమతి సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 18 , 2025 | 05:13 AM