BSE CEO Sundararaman Ramamurthy: మదుపరులూ మోసపోవద్దూ
ABN, Publish Date - Apr 25 , 2025 | 05:03 AM
బీఎస్ఈ సీఈఓ సుందరరామన్ రామమూర్తి సూచన: మదుపరులు జాగ్రత్తగా, అవగాహనతో ట్రేడింగ్ చేయాలి. చెప్పిన మాటలకోసం కాకుండా విశ్లేషణతో పెట్టుబడి పెట్టాలి.
అర్థం చేసుకుని ట్రేడింగ్ చేయండి
బీఎస్ఈ ఎండీ,సీఈఓ సుందరరామన్ రామమూర్తి
కోల్‌కతా: స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రిటైల్ మదుపరులు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఈ ఎండీ, సీఈఓ సుందరరామన్ రామమూర్తి హెచ్చరించారు. స్పష్టమైన అవగాహన, బాధ్యతలు గుర్తెరిగి పెట్టుబడులు పెట్టాలని కోరారు. లేకపోతే కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే మదుపరులను కాపాడడం రెగ్యులేటరీ సంస్థలకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘మీకు అర్థమైతేనే ట్రేడింగ్ చేయండి. లేదా అర్థం చేసుకుని ట్రేడింగ్ చేయండి. లేకపోతే సమస్యలు తప్పవు’ అన్నారు. కోల్‌కతా చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక సదస్సులో బీఎస్ఈ ఎండీ ఈ హెచ్చరికలు చేశారు.
చెప్పుడు మాటలు వినొద్దు
చాలా మంది రిటైల్ మదుపరులు తాము కొనే కంపెనీల షేర్లపై కనీస కసరత్తు కూడా చేయకుండా.. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు విని పెట్టుబడులు పెట్టడాన్ని బీఎస్‌ఈ చీఫ్ తప్పుపట్టారు. కూరగాయలు కొనేటప్పుడే అవి బాగున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తాం. అలాంటిది జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని ఎవరో చెప్పిన మాటలు విని పెట్టుబడి పెట్టడం ఏ మాత్రం సరికాదు’ అన్నారు. చిన్న మదుపరులు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి బదులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయాలని సూచించారు. మళ్లీ ఇందులో ఏదో ఒక ప్రత్యేక సెక్టార్‌కు చెందిన ఫండ్స్‌లో కాకుండా లార్జ్ క్యాప్ లేదా మల్టీ అసెట్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదని రామమూర్తి అన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 05:03 AM