బజాజ్ చేతికి కేటీఎం
ABN, Publish Date - May 23 , 2025 | 04:43 AM
రుణాల ఊబిలో కూరుకుపోయి కష్టాలు పడుతున్న ఆస్ట్రియాకు చెందిన బైక్‌ల తయారీ కంపెనీ కేటీఎంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు బజాజ్ ఆటో ప్రకటించింది...
మెజారిటీ వాటాల కొనుగోలుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: రుణాల ఊబిలో కూరుకుపోయి కష్టాలు పడుతున్న ఆస్ట్రియాకు చెందిన బైక్‌ల తయారీ కంపెనీ కేటీఎంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు బజాజ్ ఆటో ప్రకటించింది. తమ పూర్తి యాజమాన్య సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా ఈ కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే 80 కోట్ల యూరోల (రూ.7,765 కోట్లు) రుణ ప్యాకేజి సమకూర్చినట్టు తెలిపింది. అన్ని రకాల అనుమతులు సాధించినట్టయితే కేటీఎంలో ప్రస్తుతం మైనారిటీ వాటాలున్న బజాజ్ మెజారిటీ వాటాలతో ఆ కంపెనీ యజమానిగా మారుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఉమ్మడి అభివృద్ధి కార్యక్రమం కింద భారత్ కేంద్రంగా నిర్వహిస్తున్న కేటీఎం వ్యాపారాల్లో వేగం పెంచే కృషిని కొనసాగిస్తామని బజాజ్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఉభయ సంస్థలు ఉమ్మడిగా బైక్‌ల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కేటీఎం రుణ పునర్నిర్మాణానికి, వ్యాపారాల కొనసాగింపునకు తాము సమకూర్చిన నిధులు ఉపయోగపడతాయని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. ఆ 80 కోట్ల యూరోల్లో 20 కోట్ల యూరోలు ఇప్పటికే అందించామని, మిగతా సొమ్మును త్వరలో సమకూరుస్తామని కూడా పేర్కొంది. అత్యం త కీలక దశలో నిధులు సమకూర్చడంతో పాటు యాజమాన్య బాధ్యతలు కూడా చేపట్టడం ద్వారా కేటీఎం భవిష్యత్తును నిర్దేశించగల శక్తిగా బజాజ్ నిలుస్తుందని కంపెనీ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 23 , 2025 | 04:43 AM