Term Insurance: పిల్లల భవిష్యత్తుకు 'టర్మ్' భద్రత... బజాజ్ అలయంజ్ లైఫ్ సర్వే
ABN, Publish Date - Jun 19 , 2025 | 10:36 PM
భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటీవల పిక్సిస్ గ్లోబల్, క్వాల్స్.ఏఐ కలిసి నిర్వహించిన బజాజ్ అలయంజ్ లైఫ్ ఉమెన్ టర్మ్ సర్వే 2025 ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
పుణె: భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటీవల పిక్సిస్ గ్లోబల్, క్వాల్స్.ఏఐ కలిసి నిర్వహించిన బజాజ్ అలయంజ్ లైఫ్ ఉమెన్ టర్మ్ సర్వే 2025 ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సర్వేలో మెట్రో, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల నుండి వెయ్యి మందికి పైగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే మహిళలు పాల్గొన్నారు. వారి ఆర్థిక ప్రాధాన్యతలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే సన్నద్ధత, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు పాటించే వ్యూహాలు ఈ సర్వేలో అంచనా వేశారు.
ఆర్థిక ప్రాధాన్యతలలో మార్పు...
ఈ సర్వే ప్రకారం, మహిళల ఆర్థిక ప్రాధాన్యతలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. పిల్లల భవిష్యత్తు, విద్యా వ్యయాలు, ఆరోగ్యం ప్రధాన అంశాలుగా మారాయి. తమ పిల్లల భవిష్యత్తు రక్షణకు ఆర్థిక సాధనాలలో మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వైద్యపరమైన అనూహ్య ఖర్చుల వల్ల తమ కుటుంబాల పొదుపుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని 53 శాతం మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొన్నారు. తమ టర్మ్ ప్లాన్‌లో అంతర్గతంగా హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు తప్పనిసరిగా ఉండాలని 50 శాతం మంది తెలిపారు. పిల్లల చదువు ప్రయోజనాలు కూడా టర్మ్ ప్లాన్‌లో భాగంగా ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు.
ఈ వివరాలు, ఆర్థికంగా స్వతంత్ర మహిళలు, బీమాను కేవలం జీవిత రక్షణకు మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి కూడా ఉపయోగపడే సాధనంగా పరిగణిస్తున్నారని ధృవీకరిస్తాయి. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ మాట్లాడుతూ, "బజాజ్ అలయంజ్ లైఫ్ ఉమెన్ టర్మ్ సర్వే 2025 ప్రకారం మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్‌ను కేవలం లైఫ్ కవరేజీగా మాత్రమే చూడటం లేదు. తమ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణమైన కీలకమైన, సమగ్రమైన ఆర్థిక సొల్యూషన్‌గా పరిగణిస్తున్నారు. టర్మ్ ప్లాన్ కవరేజీ పిల్లల ఆర్థిక భవిష్యత్తు, ఆరోగ్య సమస్య సంబంధిత వ్యయాలు, తీవ్ర అనారోగ్యాలు, కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక భద్రత అందించేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడంలో మహిళా కస్టమర్లకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంలో ఈ అంశాలు మాకు తోడ్పడతాయి" అని అన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 10:36 PM