సాగు నీటికి కటకట!
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:35 AM
సాగునీటి సమస్య మరింత జఠిలమైంది. సార్వా సాగు సజావుగా సాగుతుందా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురవక, పంట కాల్వల ద్వారా సరిపడినంత నీరందక అన్నదాత అగచాట్లు పడుతున్నాడు.
నారుమళ్లకు అందని నీరు
ఎండిపోతున్న వెదజల్లిన వరి
ఎటు చూసినా ఇంజన్ల సాగే
ముదినేపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి సమస్య మరింత జఠిలమైంది. సార్వా సాగు సజావుగా సాగుతుందా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురవక, పంట కాల్వల ద్వారా సరిపడినంత నీరందక అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. ఒకపక్క నారుమళ్లు ఎండిపోతుం డగా మరోపక్క పొలాలను దుక్కులు చేసుకునేందుకు నీరందని పరిస్థితుల్లో దిక్కులు చూస్తున్నారు. ముదినేపల్లి మండలంలో పోల్‌రాజ్ క్యాంప్‌బెల్, బీఎండీ, గుడివాడ ఛానల్ కింద ఆయకట్టులో వేలాది ఎకరాల ఆయకట్టులో వెదజల్లిన వరిపైరుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. పోల్‌రాజ్ కెనాల్ కింద మరింత దుర్భిక్ష పరిస్థితి నెలకొంది. కనీసం నారుమళ్లను బతికించుకునేందుకైనా కొద్దిపాటి నీరు అందడం లేదు. ముదినేపల్లి, అన్నవరం, వడాలి, చినకామన పూడి, చిగురుకోట తదితర గ్రామాలలో కొంత ఆయకట్టులో వెదజల్లిన సార్వావరి పైరునీరందక ఎండిపోగా, వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఎదుగుబొదుగూ లేకుండా ఉంది. చిన కామనపూడి ఏరియాలోని రైతులు గరువు భూములను దున్ని సిద్ధం చేసుకున్నా నీరందుతుందో లేదోనన్న భయంతో విత్తనాలు వెదజల్లలేదు. సీబీ కెనాల్ కింద కోమర్రు, కాకర వాడ తదితర గ్రామాల్లో భూములను దుక్కులు చేసుకునేం దుకు నీరందడం లేదు. గుడివాడ ఛానల్ కింద నీరందక శివారు ఉన్న చినపాలపర్రు, అత్తివాని చెరువు గ్రామాల ఏరి యాల్లో నారు సిద్ధంగా వున్న నాట్లు వేసేందుకు నీరందడం లేదు. మండలంలో ఏ గ్రామంలో చూసినా మురుగు కాల్వలు, పంటకాల్వల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుకోవాల్సిన పరిస్థితి. ప్రధాన పంటకాల్వలకు చాలీచాలని నీరు విడుదల చేయడంతో బ్రాంచి కాల్వలకు నీరు అందడం లేదు.
నారుమళ్లకు నీరు లేదు
ముదినేపల్లి ఆయకట్టుకు సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం నారుమళ్లకు కూడా నీరు అందడం లేదు. నాట్లు ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కావడం లేదు. బ్రాంచ్ కాల్వలకు అందేలా నీరు విడుదల చేయాలి.
– నిమ్మగడ్డ రవి, రైతు, ముదినేపల్లి
Updated Date - Jul 18 , 2025 | 12:35 AM