YSRCP Advocates: కోర్టులోకి రాకుండా మీడియాను అడ్డుకోండి
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:34 AM
కోర్టు హాలులోకి మీడియా ప్రతినిధులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీకి చెందిన న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావును కోరారు.
వైసీపీ న్యాయవాదుల ఫిర్యాదు
ఎలా నియంత్రించాలో మీరే చెప్పండి: కోర్టు
విజయవాడ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కోర్టు హాలులోకి మీడియా ప్రతినిధులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీకి చెందిన న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావును కోరారు. మద్యం కేసు నిందితులను కోర్టుకు హాజరుపరిచినప్పుడు ఈ విజ్ఞప్తి చేశారు. కోర్టు విషయాలు ముందుగానే మీడియాకు లీకవుతున్నాయని, లోపల జరిగే దాన్ని వక్రీకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి స్పందిస్తూ.. లీకుల విషయాల్లో ఎవరిని తప్పు పడతామని, లోపలకు రాకుండా మీడియాను ఎలా నియంత్రించాలో చెప్పండని ప్రశ్నించారు.
బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా
లిక్కర్ కేసు నిందితుల పిటిషన్లను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. డి.వాసుదేవరెడ్డి, డి.సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఐదో తేదీకి వాయిదా పడింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమెహనరెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ నాలుగో తేదీకి, బాలాజీ కుమార్, నవీన్‌కృష్ణ బెయిల్ పిటిషన్లు ఏడో తేదీకి వాయిదా పడ్డాయి. బాలాజీ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న రూ.3.5 లక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ ఏడో తేదీకి వాయిదా పడింది. చెరుకూరి వెంకటేశ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది.
భగవంతుడు మా వైపు ఉన్నాడు: చెవిరెడ్డి
మద్యం కేసులో తమను అన్యాయంగా ఇరికించారని, భగవంతుడు తమ వైపు ఉన్నాడని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ లోపలికి వెళ్లారు. ఈ కేసులో తన పాత్ర లేదన్నారు. అక్రమ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కోర్టులోనూ ఇదే ప్రస్తవన చేశారు.
Updated Date - Aug 02 , 2025 | 06:35 AM