YSRCP coordinators: కలెక్టరేట్లలో ఇంకా వైసీపీ కో-ఆర్డినేటర్లు
ABN, Publish Date - May 26 , 2025 | 02:52 AM
గ్రామ-వార్డు సచివాలయ శాఖలో వృథాగా కొనసాగుతున్న వైసీపీ అనుకూల కో-ఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. ఎలాంటి అర్హతలు లేకుండా నియమితులైన వీరిని తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
పనీ లేదు.. సాంకేతిక సహకారమూ లేదు
ఖాళీగా ఉంటూ నెలనెలా జీతాలు డ్రా
గ్రామ, వార్డు సచివాలయ శాఖకు భారం
ఆ కో-ఆర్డినేటర్లంతా వైసీపీ కార్యకర్తలే
కూటమి వచ్చినా ఇంకా కొనసాగింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో వైసీపీ అనుకూల అధికారులు, అప్పట్లో నియమించిన వైసీపీ కన్సల్టెంట్లు కొనసాగుతుండగా.. మరోవైపు జిల్లాల్లో కూడా వైసీపీ అనుకూల కో-ఆర్డినేటర్లు ఇంకా తిష్ఠ వేశారు. పని లేకపోయినా జీతాలు తీసుకుంటూ, గ్రామ, వార్డు సచివాలయ శాఖకు భారంగా మారారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖను వైసీపీకి అనుబంధ సంస్థగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్లను నియమించి, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఆ నెట్‌వర్క్‌కు రామ్ ఇన్ఫోటెక్ ద్వారా ప్రభుత్వ నిధులు దోచిపెట్టింది. అప్పట్లో వలంటీర్లను సమన్వయం చేసేందుకు, వారు వాడుతున్న యాప్‌ల్లో సమస్యలను పరిష్కరించేందుకు, గ్రామ, వార్డు సచివాలయాలకు సాంకేతిక సహకారం అందించేందుకు జిల్లాకు ఒక కో-ఆర్డినేటర్, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ చొప్పున మొత్తం 52 మందిని నియమించారు. అందరినీ వైసీపీ కార్యకర్తలనే నియమించుకున్నారు. కో-ఆర్డినేటర్, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్‌కు రూ.40 వేల దాకా జీతమిచ్చి ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కూర్చోబెట్టారు. అయితే వారిని నియమించినప్పటి నుంచి వారి సేవలు ఉపయోగించుకున్న దాఖలాల్లేవు.
వలంటీర్లను తొలగించినా, పని లేకపోయినా ఇంకా కలెక్టర్ కార్యాలయాల్లో కో-ఆర్డినేటర్ ముసుగు వేసుకున్న వైసీపీ కార్యకర్తలు కొనసాగుతున్నారు. వారి సహకారాన్ని ఒక్క గ్రామ, వార్డు సచివాలయం కూడా తీసుకోవడం లేదు. అయినా నెలనెలా వారు జీతాలు మాత్రం డ్రా చేసుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా వారిని కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు, రాతపరీక్షలు నిర్వహించకుండా నియామకం చేపట్టారు. కేవలం వైసీపీ నేతలు సూచించిన కార్యకర్తలనే నియమించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పైనుంచి కింది దాకా వైసీపీ అధికారులు ఉండటంతోనే, కో-ఆర్డినేటర్ల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయాల్లో వైసీపీకి అండదండగా నిలుస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ పార్టీకి సమాచారమిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో డైరెక్టర్ కార్యాలయం నుంచి కింది దాకా సంస్కరించాల్సిన అవసరముందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 02:52 AM