ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Eluru: ‘బెకెమ్‌’ మట్టి దందా!

ABN, Publish Date - Jan 03 , 2025 | 05:52 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ఇసుక నుంచి బెరైటీస్‌ వరకూ... క్వార్ట్జ్‌ నుంచి గ్రానైట్‌ వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు, వారికి కొమ్ముకాసే కంపెనీలు అడ్డగోలుగా దోచుకొని రూ.కోట్లు దండుకున్నారు.

  • ‘బెకెమ్‌’ మట్టి దందా!ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా ఎర్రమట్టి దోపిడీ

  • లీజు తీసుకుంది ఒకచోట.. తవ్వకాలు మరోచోట

  • పర్మిట్లను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ

  • పాక్షిక నిజాలతోనే గనుల శాఖ డీడీ నివేదిక

  • 36.68 కోట్ల జరిమానా.. మంత్రి కొల్లు వద్ద అప్పీల్‌

  • తెర వెనుక సెటిల్‌మెంట్‌కు రంగంలోకి పెద్దలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ఇసుక నుంచి బెరైటీస్‌ వరకూ... క్వార్ట్జ్‌ నుంచి గ్రానైట్‌ వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ నేతలు, వారికి కొమ్ముకాసే కంపెనీలు అడ్డగోలుగా దోచుకొని రూ.కోట్లు దండుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్‌ రాఘవాపురం, ఐఎస్‌ జగన్నాథపురం గ్రామాల్లో ఎర్రమట్టి దోపిడీ కలకలం రేగింది. జగన్‌ ప్రభుత్వంలో ఈ రెండు గ్రామాల్లోని భూముల్లో బెకెమ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఎర్రమట్టి మైనింగ్‌ చేపట్టింది. గనులశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కొండలు, చెట్లు, భూమి ఆనవాళ్లు కూడా కనిపించనంతగా తవ్వకాలు చేసింది. లీజులు తీసుకున్నచోటే కాకుండా, అసైన్డ్‌ సాగు భూముల పరిధిలోనూ ఈ కంపెనీ తవ్వకాలు చేసిందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయినా గత ప్రభుత్వంలో ఆ కంపెనీవైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మట్టి అక్రమ తవ్వకాలపై ఆధారాలతో సహా స్థానిక రైతులు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గత నవంబరు 8న ఆయన ఐఎస్‌ జగన్నాథపురం, ఐఎస్‌ రాఘవాపురంలోని మైనింగ్‌ ప్రాంతాలను సందర్శించారు.


ఆక్కడ అడ్డగోలుగా జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలను చూసి విస్మయానికి గురయ్యారు. వెంటనే మైనింగ్‌ దందాపై విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత అక్రమాలు గుర్తించడానికి జరిగిన విచారణ అష్టవంకరలు తిరిగింది. ఎర్రమట్టి తవ్వకాల్లో అక్రమాలపై బెకెమ్‌ ఇన్‌ఫ్రాకు గనులశాఖ డీడీ నోటీసులు ఇచ్చారు. పర్మిట్లు దుర్వినియోగం చేశారని, పరిమితికి మించిన తవ్వకాలు చేశారన్న అభియోగాలపై సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే తాము అక్రమ మైనింగ్‌ చేయలేదని, లీజు ప్రాంతంలోనే తవ్వకాలు చేశానని సంస్థ బదులిచ్చింది. ఈ వాదన సంతృప్తికరంగా లేదని, అక్రమాలు జరిగాయని డీడీ నిర్ధారించారు. ‘‘20.95 ఎకరాల పరిధిలో 6,15,683 క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టిని అక్రమంగా తవ్వి తీసుకెళ్లారు. ఇందుకు రూ.34.13 కోట్ల పెనాల్టీ విధిస్తున్నాం. 1.48 ఎకరాల పరిధిలో పర్మిట్లను దుర్వినియోగం చేసి 2,470 క్యూబిక్‌ మీటర్ల మేర అక్రమంగా మట్టి తవ్వకాలు చేసినందుకు రూ.8.13లక్షల జరిమానా విధిస్తున్నాం. మరో 6.18ఎకరాల్లో ట్రాన్సిట్‌ పర్మిట్లు దుర్వినియోగం చేసి 74,875 క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి తవ్వకాలు జరిగాయి. ఇందుకు రూ.2.46 కోట్ల పెనాల్టీ విధిస్తున్నాం. మొత్తం 28.61 ఎకరాల పరిధిలో 6,93,028 క్యూబిక్‌ మీటర్ల మేర ఎర్రమట్టి తవ్వితీశారు. కాబట్టి మొత్తంగా రూ.36.68 కోట్ల పెనాల్టీని 15 రోజుల్లో చెల్లించాలి’ అని గత నవంబరు 22న బెకెమ్‌ ఇన్‌ ఫ్రాకు డిమాండ్‌ నోటీసు జారీ చేశారు.


గనుల మంత్రి వద్ద అప్పీల్‌

డిమాండ్‌ నోటీసులనూ బెకెమ్‌ గనుల శాఖ మంత్రి వద్ద ఉండే ప్రత్యేక అధికారాల కోర్టులో అప్పీల్‌ చేసింది. నోటీసు కాలపరిమితి తీరిపోయినా ఈ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు ఇవ్వలేదు. కేసును కంపెనీకి అనుకూలంగానే సెటిల్‌ చేయాలన్న ఒత్తిళ్లు ఆయనపై చాలా బలంగా ఉన్నట్లు తెలిసింది. గత రెండు నెలలుగా మంత్రి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారని నిగ్గుతేల్చినా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.


గనుల అధికారి విన్యాసాలు

‘ఐఎస్‌ జగన్నాథపురంలోని రెవెన్యూ సర్వే నం.425లో ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టేందుకు బెకెమ్‌ ఇన్‌ఫ్రా అనుమతులు తీసుకుంది. కానీ లీజు పొందిన చోట కాకుండా, అదే సర్వే నం. పరిధిలో ఉన్న మరో భూమిలో తవ్వకాలు చేపట్టింది. అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6.15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టిని తవ్వి తీసుకెళ్లింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు’ అని ఏలూరు కలెక్టర్‌ ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను పవన్‌ ఆదేశించారు. అయితే తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, పెద్దల సిఫారసులతో ఆయన వాస్తవాలను తొక్కిపెట్టి పరిమిత నిజాలతోనే నివేదిక ఇచ్చారు. తొలుత చిన్నచిన్న తప్పులు జరిగాయని, పెద్దగా అక్రమాలే లేవన్నట్లుగా నివేదిక ఇచ్చారని తెలిసింది. తర్వాత ఆ రిపోర్టును మరోసారి తిరగరాశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఇచ్చిన నివేదికలో తప్పనిసరి పరిస్థితుల్లో కళ్లముందు కనిపించే కొన్ని నిజాలు, మైనింగ్‌ దోపిడీ గురించి కొన్ని అంకెలను పొందుపరిచారు. అయితే, మైనింగ్‌ అనుమతులు ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ తవ్వారన్న విషయంలో నిర్దిష్టమైన వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇక ఐఎస్‌ జగన్నాథపురంలో తవ్వకాల ప్రస్తావనే లేదు. కేవలం ఐఎస్‌ రాఘవాపురంలోని సర్వే నం.425 చుట్టూ నివేదికను తిప్పారు. ఇదంతా ఆ కంపెనీకి పరోక్షంగా మేలుచేసేలా ఉందన్న విమర్శలున్నాయి.

Updated Date - Jan 03 , 2025 | 05:53 AM