Governor Abdul Nazeer: ఆధునిక భారత నిర్మాణానికి యువతే సారథులు
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:34 AM
ఆధునిక భారత నిర్మాణానికి యువత సారథులుగా మారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కోరారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవం సందర్భంగా...
మానవీయ విలువలు, వ్యవసాయంతో పాటు ఏఐ డిజైన్‌పై విద్యార్థులు అధ్యయనం చేయాలి: గవర్నర్
ఘనంగా విజ్ఞాన్స్ వర్సిటీ 13వ స్నాతకోత్సవం
గుంటూరు(విద్య), ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆధునిక భారత నిర్మాణానికి యువత సారథులుగా మారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కోరారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడారు. విజ్ఞాన్‌లో విద్యార్థులు ఇంజనీరింగ్‌తో పాటు మానవీయ విలువలు, వ్యవసాయంతో పాటు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిజైన్‌తో పాటు చట్టాలను అధ్యాయనం చేయాలని సూచించారు. వర్సిటీలు గ్రాడ్యుయేట్లను తయారు చేయడం మాత్రమే కాకుండా నవీన భారత భవిష్యత్ నిర్మాణానికి శిల్పుల్ని తయారు చేయాలన్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు కాదని, పరిశోధన, ఆవిష్కరణ, స్టార్ట్‌పలు, సమగ్ర అభివృద్థికి కేంద్రాలుగా మారాయన్నారు. ఇంజనీరింగ్ వల్ల వ్యవసాయ రంగానికి డ్రోన్లు, సెన్సర్లు, డేటా ఆధారిత ఫార్మింగ్ సాధ్యమైందని తెలిపారు. ఆరోగ్య రంగంలో డయాగ్నొస్టిక్స్, డ్రగ్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా టెక్, నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోందన్నారు. ‘క్వాంటం వ్యాలీ’ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా మార్చాలన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అబ్దుల్ నజీర్ వివరించారు. స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు, హైదరాబాద్‌లోని జెన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి, మ్యూజిక్ గురు, ఇండియన్ ప్లేబాక్ సింగర్ కంపోజర్, లిటిల్ మ్యాజిసియన్స్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ కొమండూరి రామాచారిలకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేసింది. కార్యక్రమంలో విజ్ఞాన్ వర్సిటీ వీసీ ఆచార్య పి.నాగభూషణ్, చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 03 , 2025 | 04:36 AM