ప్రాచీన పద్ధతిలో పనులు షురూ
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:13 PM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రాంగణంలోని పరివార ఆలయాల్లో పలు పైకప్పు.. లీకేజీ మరమ్మతు పనుల కోసం ఆలయ అధికారులు సిద్ధమయ్యారు.
శ్రీశైలంలో వేగంగా నిర్మాణాలు
పనులు చేపడుతున్న పుణేకు చెందిన సంస్థ
నంద్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రాంగణంలోని పరివార ఆలయాల్లో పలు పైకప్పు.. లీకేజీ మరమ్మతు పనుల కోసం ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. భారతీయ ప్రాచీన నిర్మాణ పద్ధతులను అనుసరించి పనులు చేపట్టాలని ఆలయ అధికారులు, అర్చకులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ పనులను ఆలయ అధికారులు పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజీయన ట్రస్ట్ ప్రతినిధులను కోరారు. దీంతో గత ఏడాది అక్టోబరు 2న ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. దీంతో సుమారు రూ.3 కోట్లతో పనులు చేయాలని సదరు ట్రస్ట్ ప్రతినిధులు స్వచ్చంధంగా ప్రాచీన పద్ధతుల్లో పనులు చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సంస్థ గతంలో పలు దేవాలయాల్లో ఈ తరహా పనులు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలంలోని లడ్డుపోటు మండపం, సహాస్ర దీపారాధన మండపం, లడ్డుపోటు దేవాలయం వెనుక, వీర శిరోమండపం తదితర మండపాలు పరంగా.. 3,17,988 చదరపు విస్తీర్ణం కలిగిన సదరు ఆలయాల్లో పనులు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చి నుంచి పనులు ప్రారంభించారు.
ఫ ప్రాచీన పద్ధతిలో..
వేల సంవత్సరాల కిందట జరిగిన ప్రాచీన పద్ధతిని అనుసరించి మిశ్రమాన్ని చేసి నిర్మాణాలను సదరు ట్రస్ట్ శ్రీశైలంలో పనులను చేపట్టింది. ఎప్పటికప్పుడు వేగవంతంగా పనులు సాగుతున్నాయి. కరక్కాయపొడి, సున్నం, బెల్లం, కాల్చిన మట్టి, ఇటుక ముక్కలు, ఇటుకల పొడితో పాటు అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంకను వాడుతున్నారు. ఈ మిశ్రమాన్ని కలిసి వేర్వేరుగా పురాతన పద్ధతుల్లో కొన్ని రోజుల పాటు నానబెట్టి మిశ్రమం సిద్ధం చేసి పనులు చేస్తున్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:14 PM