Women Police Jobs: పోలీసు ఉద్యోగాల్లో మహిళల సత్తా
ABN, Publish Date - Aug 02 , 2025 | 04:10 AM
రాష్ట్రంలో సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 6,100 పోస్టుల్లో 1,063 ఉద్యోగాలను మహిళలు కైవసం చేసుకున్నారు.
6,100 పోస్టుల్లో 1,063 పోస్టులు కైవసం
సెప్టెంబరు నుంచి శిక్షణ, తర్వాత విధుల్లోకి
పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
త్వరలో మరో నోటిఫికేషన్: మంత్రి అనిత
మాజీ సీఎం జగన్‌పై కేసు పెడతామని వెల్లడి
మమ్మల్ని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: డీజీపీ
అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 6,100 పోస్టుల్లో 1,063 ఉద్యోగాలను మహిళలు కైవసం చేసుకున్నారు. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పోలీసు ఉద్యోగ నియామకం కూడా చేపట్టలేదన్నారు. 2022 చివర్లో నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రభుత్వం దిగిపోయే దాకా పోస్టులను భర్తీ చేయకుండా ఆపేసిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాక న్యాయపరమైన చిక్కులు అధిగమించి ఫలితాలు విడుదల చేశామని, అటు యువతకు ఉద్యోగాలు, ఇటు పోలీసు శాఖ బలోపేతం రెండూ జరిగాయని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఇంకా ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరులో శిక్షణ ప్రారంభం అవుతుందని, 9 నెలల్లో శిక్షణ పూర్తి చేసుకుని వారు విధుల్లోకి వస్తారని తెలిపారు. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ(ప్రథమ), విజయనగరం వాసి రమ్య మాధురి(ద్వితీయ), రాజమహేంద్రవరానికి చెందిన అచ్యుతరావు(తృతీయ)లకు హోంశాఖ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలను ఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు తప్పదు
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైకి పంపి హత్య చేయించే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే..’’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమన్నారు. జగన్‌పై కేసు నమోదు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు ప్రాంతానికి ఒకలా మాట్లాడే రకమని, నగరిలో టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూనే నెల్లూరులో మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడం.. ప్రాంతానికో విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ‘‘జగన్ ఇప్పుడు పరామర్శించాల్సింది.. తల్లి, చెల్లినే.’’ అని వ్యాఖ్యానించారు.
‘వీఆర్’ పనిష్మెంట్ కాదు: డీజీపీ
పోలీసు శాఖలో వేకన్సీ రిజర్వ్(వీఆర్) కూడా శాంక్షన్ పోస్టేనని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. శాఖా పరమైన నిర్ణయాలు పోలీసు శాఖలో అంతర్గత వ్యవహారమని, ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలో తమకు తెలుసని అన్నారు. పోలీసులు వీఆర్‌లో ఉన్నారంటే అది పనిష్మెంట్ కిందికి వస్తాయనుకోవడం సరి కాదన్నారు. పోలీసులకు శాంతి భద్రతలే ముఖ్యమని, రాజకీయపరమైన వివాదాల్లోకి లాగొద్దని సూచించారు. పోలీసు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు డీటీసీలు, పీటీసీలు ఉన్నాయని తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి దగ్గర పోలీసు అకాడమీ కోసం 95 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, దీంతో పాటు విశాఖపట్నం జిల్లాలో గ్రేహౌండ్స్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ జరుగుతుందని వెల్లడించారు. పూర్తిస్థాయి పారదర్శకతతో జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో సమర్థులైన అభ్యర్థులే ఎంపికయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను కుటుంబాల చెంతకు చేర్చేందుకు నెల రోజుల పాటు ‘ఆపరేషన్ ట్రేస్’ నిర్వహిస్తున్నట్లు డీజీపీ చెప్పారు.
రెండున్నరేళ్లకు పైగా..
పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022, నవంబరు చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులకు రాష్టస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(ఏపీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రాథమిక పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. తర్వాత శారీరక సామర్థ్య, దేహ దారుఢ్య పరీక్షల్లో 95 వేల మంది పాల్గొనగా, తుది పరీక్షలో 38,910 మంది అర్హత సాధించారు. కటాఫ్ మార్కుల మేరకు 33,921 మంది అర్హత సాధించినా.. వీరిలోనూ ఎక్కువ మార్కులు సాధించిన 6,100 మందిని ఎంపిక చేసింది. 3,580 సివిల్ పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో మహిళలు 1,063 ఉండగా, ఏపీఎస్పీకి ఎంపిక చేసిన 2,520 మందిలో మొత్తం పురుష అభ్యర్థులే ఉన్నారు.
కానిస్టేబుల్ నియామకాలపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా ఆదేశించాలని కోరుతూ పలువురు హోంగార్డులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు డివిజన్ బెంచ్.. దీనిలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ వాసపల్లి శ్రీనివాస్ సహా 73 మంది జూలై 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, జూన్‌లో మొదలైన ఎంపిక ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని, ఫలితాలు కూడా విడుదల అయ్యాయని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది.
Updated Date - Aug 02 , 2025 | 04:11 AM